యుగయుగాల.. ఉగాది!

ఉగాది.. యుగాల వేడుక. తరాల పండగ. సృష్టి ఆదిలోనే ఆరంభమైంది. త్రేతాయుగ వాసులూ, ద్వాపర పౌరులూ ఘనంగా జరుపుకున్నారు. కలియుగం విషయానికొస్తే.. స్వార్థం ఆకలిగొన్న పులిలా గాండ్రిస్తున్న సమయమిది.

Updated : 07 Apr 2024 21:55 IST

ఉగాది.. యుగాల వేడుక. తరాల పండగ. సృష్టి ఆదిలోనే ఆరంభమైంది. త్రేతాయుగ వాసులూ, ద్వాపర పౌరులూ ఘనంగా జరుపుకున్నారు. కలియుగం విషయానికొస్తే.. స్వార్థం ఆకలిగొన్న పులిలా గాండ్రిస్తున్న సమయమిది. కలి ప్రభావాన్ని తట్టుకునేందుకు సరిపడా మనోబలాన్ని అందించి.. క్రోధినామ సంవత్సరంలో క్రోధాన్ని గెలువగల యోధులుగా మనల్ని తీర్చిదిద్దుతుంది వత్సరాది!

మహాభారత కథ.ఉదంకుడు.. అణిమాది సిద్ధులు సాధించిన మహామేధావి.

ఒకానొక సందర్భంలో, వ్యాస భగవానుల ఆదేశంతో ఓ ప్రాంతానికి వెళ్తాడు.

అక్కడ ఇద్దరు వ్యక్తులు నలుపూ తెలుపూ దారాలను వడుకుతుంటారు. రెండడుగులు ముందుకేస్తే.. మరో ఆరుగురు పన్నెండాకుల చక్రాన్ని తిప్పుతుంటారు. వాళ్లంతా ఎవరన్నది గ్రహించలేకపోయాడు. అంతలోనే, అతనికి వేదమంత్రం గుర్తుకొచ్చింది. విరాట్‌పురుష వర్ణన మదిలో మెదిలింది. అంటే, ఆ ఇద్దరూ.. విధి, విధాత! నలుపూ, తెలుపూ.. చీకటి వెలుగులకు ప్రతీకలు. ఆరుగురు వ్యక్తులు.. ఆరు రుతువులు. ద్వాదశ పత్రాల చక్రమే.. పన్నెండు మాసాల కాలం.

*       *       * 

మార్పు కాల స్వభావం. ఆ మార్పును కాల పురుషుడి తీర్పుగా జనంలోకి తీసుకెళ్లడమే యుగధర్మం.

త్రేత నుంచి ద్వాపర అయినా, ద్వాపర నుంచి కలి అయినా.. యుగానికోసారి పెనుమార్పు వస్తుంది. ప్రభవ నుంచి ప్రభవలోపు ప్రతి అరవై ఏళ్లకూ వ్యవస్థ లోనూ ఎన్నో పరిణామాలు సంభవిస్తాయి. అందులో కొన్ని సకారాత్మకమూ, కొన్ని నకారాత్మకమూ. ఆ మంచి చెడులను ఆకళింపు చేసుకుని అడుగు ముందుకేయాల్సిన సమయంలో.. హెచ్చరికతో కూడిన శుభాకాంక్షలు చెబుతుంది ఉగాది. ?

సత్యయుగం..

విధాత యోగనిద్రలో ఉన్నప్పుడు సోమకుడనే రాక్షసుడు నాలుగు వేదాలనూ దొంగిలించుకుని వెళ్లాడు. వేదం అంటేనే.. జ్ఞానకాంతి. ఆ అమూల్య సంపద పడకూడని చేతిలో పడింది. అంతటా అసుర సంధ్య వ్యాపించింది. దైవీశక్తులు తేజస్సును కోల్పోయాయి. మహర్షుల యజ్ఞయాగాదులకు విఘాతం ఏర్పడింది. అంతా కలిసి విష్ణుమూర్తిని శరణువేడారు. సోమకుడి మత్సరం అణచేందుకు స్వామి మత్స్యావతారం ధరించాడు. రాక్షస సంహారం జరిగిపోయింది. నాలుగు కట్టలనూ భద్రంగా బ్రహ్మకు అప్పగించాడు వేదనారాయణుడు. ఇక విఘ్నాలన్నీ తొలగిపోయాయి. కార్తిక శుద్ధ నవమినాడు చతుర్ముఖుడు ప్రళయానంతర సృష్టిని ఆరంభించాడు. అలా సత్యయుగానికి శ్రీకారం చుట్టాడు. చివరి వరకూ ఆ రోజునే ఉగాదిగా జరుపుకున్నారు కృతయుగ వాసులు. 

త్రేతాయుగం..

రామాయణ కాలం నాటికే ప్రజలలో ఉత్తరాయణం ఉత్తమ ఫలితాలను మోసుకొస్తుందనే నమ్మకం ఉంది. కాబట్టే, సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే శుభ సమయాన్ని ఉగాదిగా నిర్ణయించారని ఓ వాదన. కాదు కాదు, మనం అక్షయ తృతీయగా చెప్పుకునే.. వైశాఖ శుద్ధ తదియ రోజున ఉగాది వేడుకలు జరిగేవనే అభిప్రాయమూ ఉంది. సందర్భం ఏదైతేనేం, పండగ మాత్రం ఘనంగా చేసుకునేవారు.

ద్వాపరయుగం..

ద్వాపర ప్రజలు మాఘ కృష్ణ అమావాస్యను యుగాదిగా భావించారని పండితులు చెబుతారు. సాక్షాత్తు దేవదేవుడే ద్వారకాధీశుడై పాలన సాగించిన సమయం అది. మహాభారత యుద్ధం పూర్తయిన వెంటనే కలి ప్రవేశానికి ముహూర్తం ఖరారైంది. కానీ, కృష్ణ భగవానుడు ఉన్నంతకాలం.. భూమి మీద కాలుమోపే ధైర్యం చేయలేదు కలి. 

కలియుగం..

కృష్ణావతార పరిసమాప్తితో ద్వారక మునిగింది.ద్వాపర ముగిసింది. చైత్రశుద్ధ పాడ్యమినాడు కలియుగం ఆరంభమైంది. ఒకవంతు ధర్మం, మూడొంతుల అధర్మం.. ఈ యుగ నియమం. భౌతిక కాలుష్యాన్ని మించిన భావ కాలుష్యం రాజ్యమేలుతున్న సమయమిది. అహం నెత్తి నెక్కుతోంది. ఇహం పట్ల వ్యామోహం మితి మీరుతోంది. ఇది పతనానికి ఆది. అంతానికి ఆరంభం. ఆ ఉత్పాతం నుంచి రక్షిస్తుంది ఉగాది. పంచాంగమే ప్రమాణంగా కలిని గెలిచే, ఘోరకలిని తట్టుకుని నిలిచే మార్గాన్ని ప్రబోధిస్తుంది. దానధర్మాలను, ధార్మిక కార్యక్రమాలను ప్రోత్సహిస్తుంది. అంతరంగ శుద్ధికి జపతపాలను సూచిస్తుంది. ఉగాది రోజున పాటించాల్సిన మూడు ముఖ్య నియమాల ఉద్దేశం కూడా అదే.

ఒకటి.. అభ్యంగన స్నానం.ఒంటికి పట్టిన మురికితోపాటు.. మనోకల్మషాన్నీ వదిలించుకోవడం. రెండు.. నింబకుసుమ భక్షణం. వేప పువ్వులో కించిత్‌ చేదు ఉంటుంది. జీవితంలో తారసపడే అవరోధాలకు ఇది సూచన.మూడు.. పంచాంగ శ్రవణం.

పంచాంగం మనల్ని వేలు పట్టుకుని నడిపించే దైనందిని. ఏడాది కాలానికి దిక్సూచి. మరో ఉగాది వరకూ మనిషిని నిటారుగా నిలబెట్టే పునాది. ఆ మనో బలమే.. కలిపురుషుడి పరుషత్వాన్ని నిలువరించే ధైర్యం ఇస్తుంది. మనం మనలా బతికేందుకు భరోసా అందిస్తుంది.


కాలానికి సంకేతాలు

లియుగ ఆరంభం నాటికి మనిషి ఆయుర్దాయం నిండుగా నూట ఇరవై ఏళ్లు. అంటే, ప్రభవలో పుట్టిన వ్యక్తి మరో ప్రభవ నాటికి షష్టిపూర్తి చేసుకుంటాడు. అప్పటికే అన్ని బాధ్యతలూ తీరిపోయి ఉంటాయి. మిగిలిన అరవై ఏళ్లూ ఆధ్యాత్మిక చింతనలో గడపాలి. ఇదీ నియమం. మన సంవత్సరాల పేర్లు సైతం కాల స్వభావాన్ని తెలిపేవే. ప్రభవ అంటే పుట్టుక, ఆరంభం. విభవ అంటే వైభవం. శుక్ల అంటే.. నిర్మలం. ప్రమోదూత.. ఆనందానికి ప్రతీక. అంగీరస.. వివిధ శరీర భాగాల్లోని ప్రాణశక్తి. ఇప్పుడు మనం శోభకృత్‌ నుంచి క్రోధి నామ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. అరిషడ[్వర్గాలలో క్రోధం ఒకటి. క్రోధాన్ని గెలిస్తేనే మనిషికి శాంతి. క్రోధం కలి లక్షణం కూడా.


ఉగాది పూజ

గాదినాడు ఉమామహేశ్వర గౌరీవ్రతం జరుపుకునే సంప్రదాయమూ ఉంది. మూడుకాలాలూ మహేశ్వరుడికి త్రినేత్రాలు. శివుని ఇల్లాలు గౌరీదేవి సౌభాగ్య ప్రదాత. సంవత్సరాది శుభవేళ ఆ ఆదిదంపతులను పూజిస్తే.. దోషరాశి తొలగుతుందని నమ్మకం. ఉమా మహేశ్వరులకు ఉగాది పచ్చడితోపాటు, పంచభక్ష్య పరమాన్నాలనూ నైవేద్యంగా సమర్పిస్తారు. షోడశోపచారాలు చేస్తారు. ఆ తరువాత పంచాంగ శ్రవణం.  అన్ని వ్రతాల్లానే గణపతి పూజతో ఆరంభమై, ఉద్వాసనతో పరిసమాప్తి అవుతుంది. ఉమామహేశ్వర పూజ సకలశుభ కారకమని పెద్దల ఉవాచ.


పచ్చడి పరమార్థం..

డ్రుచుల సమాహారమైన సంవత్సరాది ప్రసాదాన్నే ఉగాది పచ్చడిగా వ్యవహరిస్తాం. దీనికి ఆరంటే ఆరు దినుసులే ఉండాలి. రుచి కోసమో, అలంకరణ కోసమో అదనపు పదార్థాలు జోడించడం సరికాదు. అదీ, పరమాత్మకు నివేదించిన తర్వాతే స్వీకరించాలి. పచ్చడిలోని ప్రతి దినుసులో ఆరోగ్య ఫలమూ, వికాస సూత్రమూ అంతర్లీనం.

తీపి...

తీపి ఆనందానికి ప్రతీక. ఆశావాదానికి సంకేతం. ఆయుర్వేదం ప్రకారం.. వాత, పిత్త, కఫం..అనే త్రిదోషాలను సవరించే శక్తి బెల్లానికి ఉంది. 

పులుపు...

చింత పులుసులోని పులుపు రాబోయే అవరోధాలకు ప్రతీక. వాటిని లౌక్యంతో ఎదుర్కోమనే ధైర్యాన్ని ఇస్తుంది. ఆరోగ్యశాస్త్రం ప్రకారం పులుపు జీర్ణశక్తిని పెంచుతుంది. ఆ మోతాదు పెరిగితే వికటిస్తుంది కూడా.

ఉప్పు-కారం...

మనలోని అంతర్లీన శక్తిని గుర్తుచేస్తాయి. ఉప్పూకారం తగ్గితే వంటలో రుచి పోతుంది. పొరపాటున పెరిగితే నాలుక నావల్ల కాదంటూ మొరాయిస్తుంది. మధ్యస్థమైన ఆహారాన్నే పొట్ట హరాయించుకోగలదు. జీవితంలోనూ ఇలాంటి సమతౌల్యమే అవసరం.

చేదు...

భోజనంలో అయినా, జీవనంలో అయినా అనివార్యమైన రుచి. అయిష్టంగా అయినా ఆమోదించాల్సిందే. గుండె దిటవు చేసుకుని స్వీకరించాల్సిందే. చేదు అనుభవంలో ఓ పాఠం ఉంటుంది. వేపపూవులోని చేదులో అపారమైన ఔషధగుణం ఉంది.

వగరు...     

వసంతం అందించే పసందైన పంట మామిడి. వగరు ఆశ్చర్యానికి బండగుర్తు. జీవితం నిబిడాశ్చర్యాల సమాహారమని గుర్తు చేస్తుందీ రుచి. వగరు ఎంతోకొంత ఆరోగ్యకరం కూడా. దీనికి గాయాల్ని మాన్పే గుణమూ ఉందంటారు.


కాల పట్టిక
సంవత్సరం

పన్నెండు నెలల కాలం.మొత్తం అరవై సంవత్సరాలు.ప్రభవ నుంచి అక్షయ వరకు.


ఆయనం

రు నెలల కాలం. మొత్తం రెండు ఆయనాలు.ఉత్తరాయణం, దక్షిణాయనం.


నెల

ముప్పై రోజుల కాలం. మొత్తం పన్నెండు మాసాలు.చైత్రం నుంచి ఫాల్గుణం వరకు


రుతువు

రెండు నెలల కాలం.మొత్తం ఆరు రుతువులు. వసంత, గ్రీష్మ, వర్ష, శరత్‌, హేమంత, శిశిరాలు.


పక్షం

పదిహేను రోజుల కాలం.నెలకు రెండు పక్షాలు.శుక్లపక్షం, కృష్ణ పక్షం.


తిథి

రవై నాలుగు గంటల కాలం. పక్షానికి పదిహేను తిథులు.పాడ్యమి నుంచి పౌర్ణమి లేదా అమావాస్య వరకు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..