కొరియన్‌ క్రేజు... తగ్గేదేలే!

కె-పాప్‌, కె-డ్రామా, కె-ఫుడ్‌, కె-ఫ్యాషన్‌ అంటే అందరికీ అర్థంకాకపోవచ్చు... కానీ టీనేజర్లను అడిగి చూడండి... ‘మీకు ఇది కూడా తెలియదా’ అంటూ వింతగా చూస్తారు. ‘కె’ అంటే కొరియన్‌ అనీ, అదీ దక్షిణ కొరియా అనీ, ఇప్పుడదే తమ స్టైలూ, ట్రెండూ అంటూ చెప్పకనే చెబుతారు.

Published : 28 Apr 2024 00:24 IST

కె-పాప్‌, కె-డ్రామా, కె-ఫుడ్‌, కె-ఫ్యాషన్‌ అంటే అందరికీ అర్థంకాకపోవచ్చు... కానీ టీనేజర్లను అడిగి చూడండి... ‘మీకు ఇది కూడా తెలియదా’ అంటూ వింతగా చూస్తారు. ‘కె’ అంటే కొరియన్‌ అనీ, అదీ దక్షిణ కొరియా అనీ, ఇప్పుడదే తమ స్టైలూ, ట్రెండూ అంటూ చెప్పకనే చెబుతారు. అంతగా ఇప్పుడు వాళ్లను ముంచేస్తోంది ఈ కొరియన్‌ వేవ్‌. ప్రపంచదేశాల్ని మాయ చేస్తున్న ఈ కె-క్రేజ్‌ మనదేశంలోనూ కొత్త మార్క్‌ వేస్తోంది... ఆ ముద్ర ఎంతలా ఉందంటే...

ఒక అమ్మాయి చిన్నప్పటి నుంచీ తను అందంగా లేనని బాధపడుతుంటుంది. చూడ్డానికి వికారంగా ఉన్నావంటూ తోటి పిల్లలూ ఆట పట్టిస్తుంటారు. హైస్కూల్‌లోనూ ఎవరూ తనతో స్నేహం చేయడానికి ఇష్టపడరు. అది భరించలేక ఏడుస్తూ ఓరోజు చనిపోవాలని నిర్ణయించుకుంటుంది. అప్పుడే అనుకోకుండా వచ్చిన ఒక చిన్న ఆలోచన ఆ అమ్మాయి జీవితాన్నే మార్చేస్తుంది. అందంగా కనిపించడానికి మేకప్‌ వేసుకోవడం మొదలుపెడుతుంది. అది ఎంత బాగా చేసుకుంటుందంటే... ఆ మేకప్‌ వల్ల ఆ అమ్మాయి రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి. ఎవరూ దాన్ని మేకప్‌ అనుకోనంత సహజంగా కనిపిస్తుందా అమ్మాయి. అలా ఆమె బాగా ఫేమస్‌ అయ్యి సెలెబ్రిటీలకు మేకప్‌ వేస్తూ కాస్మటాలజిస్ట్‌గా రాణిస్తుంది. పూర్తిగా ఒక అమ్మాయి అందం చుట్టూ ఉండే ఈ కథ... ‘ట్రూ బ్యూటీ’ అనే ఓ కొరియన్‌ డ్రామా. ఇది ఈతరం పిల్లల్ని ఎంతగా ఆకర్షించిందంటే... కొరియన్‌ సిరీస్‌ మీద మనసు పారేసుకునేంత. మేకప్‌లోనూ ఆ దేశానికి సంబంధించిన వస్తువుల్నే భాగం చేసుకునేంత. ఇదొక్కటే కాదు, ఇలా ఒక్క మేకప్‌ విషయంలోనే కాదు... అక్కడి సంస్కృతీ, ఆహారమూ, అలవాట్లూ, ఫ్యాషన్లు చూపిస్తూ ప్రేక్షకుల మనసు దోచేస్తున్నాయీ కె-డ్రామాలన్నీ. అందుకే మరి, ఇతర దేశాలతోపాటూ మన దగ్గరా వాటికి ప్రత్యేక స్థానం వచ్చింది.

కె-స్టోర్లూ, రెస్టరంట్లూ!

పెద్ద పెద్ద షాపింగ్‌ మాళ్లలో అక్కడక్కడా విదేశీ దుస్తులు కనిపించడం వేరు. కేవలం వాటికోసమే ప్రత్యేక దుకాణాలు ఉండటం వేరు. కొరియన్‌ నటీనటుల్ని ఇష్టపడటంతోపాటు వాళ్లు వేసుకున్న దుస్తుల్నీ కోరుకుంటున్న టీనేజర్ల కోసం దిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ లాంటి నగరాల్లో చాలాచోట్ల కొరియన్‌ క్లాతింగ్‌ దుకాణాలు వచ్చాయి. ఇంకా అమెజాన్‌, మింత్రా లాంటి ఆన్‌లైన్‌ సైట్లలోనూ కొరియన్‌ ఫ్యాషన్‌ పేరుతో విడిగా డ్రెస్సులు దొరుకుతున్నాయి. వీటిల్లో పై నుంచి కింద వరకూ ఉండే కొరియన్‌ సంప్రదాయ దుస్తులు ‘హాన్‌బాక్‌’తో సహా మినీ-లాంగ్‌ స్కర్ట్స్‌, టాప్స్‌, ప్యాంట్స్‌, షర్ట్స్‌... ఇలా కొరియన్‌ స్టైల్‌ నెక్స్‌, ప్రింట్లతో బోలెడన్ని డ్రెస్సులు ఉన్నాయి. రెడీమేడ్‌గా ఉన్నవే కాదు, కొన్ని కొరియన్‌ ఫ్యాషన్‌ దుకాణాల్లో కె-డ్రామాల్లో కనిపించి, మెప్పించిన డ్రెస్సుల్నీ కావాలంటే తెప్పిస్తున్నారు.

ఫ్యూజన్‌ కల్చర్‌ మొదలయ్యాక అన్ని ప్రాంతాల్లో అన్నిరకాల ఆహారపదార్థాలూ కనిపిస్తున్నాయి. కానీ చాలావరకూ ఒకటో, రెండో ఫేమస్‌ విదేశీ ఫుడ్స్‌ మాత్రమే అందుబాటులో ఉంటే... ఈ కె-క్రేజ్‌తో మాత్రం ఇప్పుడు రకరకాల రుచులతో కొరియన్‌ రెస్టరంట్లే వచ్చాయి. సలాడ్‌ రైస్‌తో ఉండే బిబిమ్‌బప్‌, క్యాబేజీ-కొరియన్‌ ర్యాడిష్‌లతో తయారుచేసే కిమ్చీ, కొరియన్‌ నూడుల్స్‌... ఇలా ఎన్నో రకాల ఫుడ్‌ ఐటమ్స్‌ మనవాళ్లకీ నోరూరిస్తున్నాయి. కె-పాప్‌ అభిమానుల్నీ ఆకట్టుకునేలా బీటీఎస్‌, బ్లాక్‌ పింక్‌ పోస్టర్లతో పూర్తిగా కొరియన్‌ థీమ్‌ హోటళ్లూ ఉన్నాయి. ఇంకా రకరకాల కొరియన్‌ సాసులూ, రైస్‌కేక్‌ ప్యాకెట్లూ... దుకాణాల్లో అమ్ముతున్నారు. అంతేకాదు, కొన్ని కొరియన్‌ ఫుడ్స్‌... మన ట్రెండ్స్‌లోకి వచ్చాయి. ‘నీకు మాత్రమే ప్రత్యేకం’ అన్నట్టుగా ఉండే ‘బెంటో మినీ కేక్స్‌’ అలా వచ్చినవే. కొరియన్‌ లైఫ్‌ భారత్‌లో ఎంతలా ప్రభావం చూపుతోంది అంటే- బొమ్మల దగ్గర్నుంచి బ్యాగుల వరకూ దొరికే కొరియన్‌ స్టోర్లతో పాటు పూర్తిగా కొరియన్‌ వస్తువుల్ని అందించే ‘కొరికార్ట్‌, కొరియన్‌మార్కెట్‌.ఇన్‌’ పేర్లతో ఆన్‌లైన్‌ షాపింగ్‌ వెబ్‌సైట్లూ అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో పౌడర్‌ దగ్గర్నుంచి వంట పాత్రల వరకూ అన్నీ కొరియన్‌వే ఉంటాయి. కొరియన్‌ స్కిన్‌కేర్‌, కె-బ్యూటీఇండియా, కొరియన్‌ బ్యూటీ ప్రొడక్ట్స్‌... ఇలా రకరకాల ఇన్‌స్టాగ్రామ్‌ పేజీల ద్వారా కూడా కె-వస్తువుల అమ్మకాలు జరుగుతున్నాయి.

ఇక్కడా కె- మేకప్‌!

నున్నగా, మెరిసే చర్మంతో ఆకట్టుకునే కొరియన్ల అందానికి ఫిదా అయిపోతూ అలాంటి గ్లాసీ లుక్కును తెప్పించే సౌందర్య ఉత్పత్తుల్ని ఇక్కడివారూ ఇష్టపడుతున్నారు.
24 క్యారెట్ల బంగారంతోపాటు రైస్‌ వాటర్‌, లావా బూడిద, వైట్‌ లోటస్‌, సుగంధ తైలాల్లాంటి సహజసిద్ధమైన పదార్థాల్ని వాడి తయారు చేసే కొరియన్‌ సౌందర్య ఉత్పత్తులకే ఓటేస్తున్నారు. మేకప్‌ వేసినట్టుగా కాకుండా సహజంగా కనిపించే ఈ కొరియన్‌ బ్యూటీ ఉత్పత్తుల్ని ఇదివరకు విదేశాల నుంచి తెప్పించుకుంటే- ఇప్పుడు మన దగ్గరా దొరుకుతున్నాయి. పెరిగిన ఈ కొరియన్‌ అభిమానాన్ని గమనించిన కొన్ని దేశీయ కంపెనీలూ కొరియన్‌ గ్లాసీ లుక్‌ క్రీమ్స్‌ని మార్కెట్లోకి తెచ్చాయి.

ఇంకా చిట్టి చిట్టి హెయిర్‌ క్లిప్పులూ, ఫ్యాన్సీ హెయిర్‌బ్యాండ్లూ ఇదివరకే మార్కెట్లో ఉన్నా అవి కొరియన్‌ డ్రామాల్లోనూ కనిపించడంతో వాటికి మరింత క్రేజ్‌ పెరిగింది. హెయిర్‌ ఎక్స్‌టెన్షన్ల దగ్గర్నుంచి పిన్నుల వరకూ ఎన్నెన్నో కొరియన్‌ ఫ్యాన్సీ హెయిర్‌ యాక్సెసరీలు వచ్చాయి. అవేకాదు, ‘ఫ్రంట్‌ బ్యాంగ్స్‌, బాయిష్‌ పిక్సీ, వేవీ బాబ్‌...’ ఇలా రకరకాల కొరియన్‌ ఇన్‌స్పైర్డ్‌ హెయిర్‌ స్టైళ్లూ ట్రెండ్‌ అవుతున్నాయి.

అలా మొదలైంది...

దక్షిణ కొరియా... ఇంచుమించు ఐదుకోట్ల జనాభాతో ఉండే ఈ దేశం- ఇప్పుడు కొన్ని వందల కోట్ల మంది అభిమానుల్ని సంపాదించుకుంది. దేశ సంస్కృతిని విస్తరించుకుంటూ  కె-పాప్‌, కె-డ్రామాలతో కొత్త ట్రెండ్‌ను సృష్టించింది. కొరియన్‌ వేవ్‌గా చెప్పే ఈ ట్రెండ్‌ 1990లో మొదలై ప్రస్తుతం ప్రపంచమంతా పాకిపోయింది. లాక్‌డౌన్‌లో దొరికిన వెసులుబాటుతో మరింత దూసుకుపోయింది. అది ఎంతలా అంటే... కొన్ని కోట్ల మంది చందాదారులతో నడుస్తున్న ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌ చూసే ప్రతి పది మందిలో ఆరుగురు కొరియన్‌ డ్రామాలు చూస్తారట. అందుకే ఇప్పుడు ఇతర భాషలతోపాటూ హిందీ, తమిళం, తెలుగు భాషల్లోనూ ఈ కొరియన్‌ డ్రామాలు వచ్చేస్తున్నాయి. ప్రేమ, కుటుంబం, చదువు, పరిశోధన, థ్రిల్లర్‌... ఇలా రకరకాల అంశాల్లో ఆకట్టుకునే సన్నివేశాలతో తీర్చిదిద్దే కె- సిరీస్‌ అంతా ఈతరం ఆలోచనలకు చాలా దగ్గరవ్వడమూ, సాగతీతలు లేకుండా రెండూ, మూడూ నెలల్లోనే పూర్తయ్యే ఎపిసోడ్లతో ఉండటంతో యువతను కొరియన్‌ ప్రేమలో పడేస్తున్నాయి. ఎందరో అమ్మాయిల కలల రాజకుమారులు కొరియన్‌ హీరోలే అన్నట్టుగా మార్చేశాయి. ఇంకా, ఆ ఇష్టమే కొరియన్‌ భాషను నేర్చుకునేలా చేయడంతో పాటు కె-ఫ్యాషన్లను ఫాలో అయ్యేలా చేసింది.

ఆ ‘కె- ప్యాషన్‌’... మన మార్కెట్‌ మీద ఎంత ప్రభావం చూపుతోందంటే- 2021లో రెండు కోట్లతో మొదలైన కొరియన్‌ నూడుల్స్‌ వ్యాపారం రెండేళ్లలో 65 కోట్ల రూపాయలకు చేరిందట. ఇక ఫ్యాషన్లూ, ఫుడ్డూ, ఇతర ఉత్పత్తుల లెక్కలు తేల్చితే తెలిసిపోతుంది మనదేశంలో కె-వేవ్‌ సృష్టించిన మాయ ఏంటో!Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..