సిల్లీపాయింట్‌

అమెరికాలోని పెన్సిళ్లు- బ్రాండ్‌ ఏదైనా సరే పసుపురంగులోనే ఉంటాయి! చైనీయులు- హ్యాపీ బర్త్‌డే పాటని మనలా ఇంగ్లిషులో పాడరు. అదే ట్యూన్‌కి వాళ్ళ మాతృ భాష మాండరిన్‌లో పాడుకుంటారు!

Published : 25 Feb 2024 01:38 IST

అమెరికాలోని పెన్సిళ్లు- బ్రాండ్‌ ఏదైనా సరే పసుపురంగులోనే ఉంటాయి!

  • చైనీయులు- హ్యాపీ బర్త్‌డే పాటని మనలా ఇంగ్లిషులో పాడరు. అదే ట్యూన్‌కి వాళ్ళ మాతృ భాష మాండరిన్‌లో పాడుకుంటారు!
  •  1942 ఏప్రిల్‌- రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్‌ బ్రిటిష్‌ ఇండియాని జడిపించాలనుకుంది. అందుకోసం విశాఖపట్నంపైన ఉత్తుత్తి బాంబులు వేసింది కూడా! అనుకున్నట్టే అది బ్రిటిష్‌వారిని అతిజాగ్రత్త చర్యలకి పురికొల్పింది. దిల్లీలో జేబీ ఆడెన్‌ అనే రసాయన, భూగర్భశాస్త్రవేత్త తీసుకున్న జాగ్రత్త ఇందుకు పరాకాష్ఠ! ఆయన అప్పట్లో తారుకి మరికొన్ని రసాయనాలు చేర్చి మంటపెట్టి- దిల్లీ పార్లమెంటు చుట్టుపక్కల దట్టమైన పొగని సృష్టించాడట. ‘ఎందుకండీ’ అని అడిగితే ఆకాశం నుంచి చూసే యుద్ధవిమాన పైలట్‌లకి దిల్లీ భవనాలు స్పష్టంగా కనిపించకుండా ఇలా చేస్తున్నా’ను అన్నాడట... జపాన్‌ నౌకాదళం దిల్లీకి వచ్చే అవకాశం ఏమాత్రం లేకున్నా.
  •  సూపర్‌ డూపర్‌ అని వాడేస్తున్నాం కానీ... నిజానికి ఇందులో డూపర్‌
  • అన్న పదానికి అర్థమే లేదు. సూపర్‌తో ప్రాస కుదురుతోందని దీన్ని 1940లో అమెరికాలోని ఓ టీచర్‌ చేర్చారట. అప్పటి నుంచీ అలా కొనసాగుతోంది!
  • మాల్దీవుల్లో మాట్లాడే దివేహి భాష- సంస్కృతానికి దగ్గరగా ఉంటుంది.
  •  అల్జీరియా దేశ జాతీయ మృగం... నక్క!
  • ప్రపంచ మీసాల రాయుళ్ళలో ఎక్కువమంది భారత్‌లోనే ఉంటారు!
  •  ఫిబ్రవరి 29న పెళ్ళి చేసుకోవడం మంచిది కాదన్న నమ్మకం స్కాట్లాండ్‌లో ఉంది. ఇక గ్రీకులైతే, లీపు సంవత్సరంలో పెళ్ళి చేసుకోవడమే పాపమని భావిస్తారట.
  •  ‘ఆడవాళ్ళ వయసు అడగకూడదు’ అంటారు కదా మన దగ్గర. అమెరికాలో అమ్మాయిలనే కాదు అబ్బాయిలనీ వయసు అడగడం అమర్యాదగానే భావిస్తారు.
  •  మనం పూజల్లో పళ్ళూ కొబ్బరికాయా పెట్టినట్టే... ప్రాచీన గ్రీకులు దేవతలకి వెల్లుల్లిని సమర్పించేవారట!  
  •  పాశ్చాత్య దేశాల్లో పెళ్లి సందర్భంగా వేసుకునే ప్రత్యేక గౌనుని 90 శాతం మంది వధువులు- ఆ వేడుక పూర్తయ్యాక, కొద్ది కాలానికే అమ్మేస్తారట.  
  •  గీతా, సీతా, ప్రేమ... ఇలా ‘అచ్చులతో’ అంతమయ్యే అమ్మాయిల పేర్లు భారత్‌లోనే ఎక్కువ. ఒకప్పుడు ఇండో-ఆర్యన్‌ భాషలన్నింటా(ఇంగ్లిష్‌, ఇటలీ, జర్మన్‌, ఫ్రెంచి సహా) ఈ వాడుక ఉండేదికానీ అవన్నీ కాలక్రమంలో ఈ పద్ధతిని కోల్పోయాయట!

స్పైడర్‌మ్యాన్‌ పాత్రకి స్ఫూర్తి సాలెపురుగు కాదు... ఈగ! ఓ ఈగ గోడకి అతుక్కుని ఉండటం చూశాకే ఈ పాత్రని రూపొందించాడట దాని సృష్టికర్త స్టాన్‌లీ. ముందు ‘స్టిక్‌-టు-వాల్‌ మ్యాన్‌’ అనే పేరుపెట్టి, తీరా బొమ్మలు గీసే సమయానికి స్పైడర్‌మ్యాన్‌గా మార్చేశాడట.  


ప్రపంచంలో దాదాపు అన్ని పక్షులూ ఓ చోట నుంచి మరోచోటకి ఏటవాలుగానే ఎగురుతాయి, వాలతాయి.హమ్మింగ్‌ బర్డ్‌ దీనికి మినహాయింపు. అది ఉన్నపళంగా నిట్టనిలువునా
ఎగరగలదు, దిగగలదు- దాన్ని చూసే హెలికాప్టర్‌ని తయారుచేశారు!




వాట్సాప్‌ కంపెనీ పుట్టినప్పటి నుంచీ ఇప్పటిదాకా మార్కెటింగ్‌ కోసం ఒక్కపైసా ఖర్చు చేసింది లేదట. కేవలం నోటి ప్రచారంతోనే ఇంత సక్సెస్‌ సాధించిందన్నమాట!



దుబాయ్‌లో పిన్‌ కోడ్‌లు ఉండవు. ఇక్కడ మనకి మొబైల్‌ ఫోన్‌లుఉన్నట్టే పోస్ట్‌ సేవలు అవసరమైన ప్రతి ఒక్కరికీ ఓ బాక్స్‌ ఇస్తారు. ఆ బాక్స్‌ నంబర్‌ రాస్తే సరిపోతుంది!



ప్రపంచంలో జరిగే మొత్తం పెళ్ళిళ్ళలో 25 శాతం- భారత్‌లోనే జరుగుతాయట.


* ఎంత షాపింగ్‌ అయినా ఓ దశ తర్వాత బోర్‌ కొట్టేస్తుంది. కాక పోతే, మగవారిలో ఆ విసుగు 26 నిమిషాల తర్వాత మొదలైతే, మగువల్లో మూడుగంటల తర్వాతకానీ రాదట! షాపింగ్‌ చేయడానికి మగవారు ఎందుకలా చిరాకుపడతారో... అర్థమైందా?!


నల్లవి, తెల్లవి, గోధుమ రంగున్నవి... సాధారణంగా మనం ఈ రకం పిల్లుల్నే చూస్తుంటాం. ఈ మూడు రంగులూ కలిసినవాటిని ‘క్యాలికో’ పిల్లులంటారు. అదేమోకానీ- ఈ మూడురంగులున్న వాటిల్లో దాదాపు అన్నీ ఆడపిల్లులే ఉంటాయట!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..