అమాయకుల జాబితా!

శ్రీకృష్ణదేవరాయల వారి సభ జరుగుతోంది. ఒక అరబ్‌ దేశస్థుడు వచ్చి... తనను తాను గుర్రాల వర్తకుడిగా పరిచయం చేసుకున్నాడు.  సంచిలోంచి ఏదో చిత్రం తీసి రాజుకు చూపించాడు.

Published : 14 Apr 2024 01:29 IST

శ్రీకృష్ణదేవరాయల వారి సభ జరుగుతోంది. ఒక అరబ్‌ దేశస్థుడు వచ్చి... తనను తాను గుర్రాల వర్తకుడిగా పరిచయం చేసుకున్నాడు.  సంచిలోంచి ఏదో చిత్రం తీసి రాజుకు చూపించాడు. అది ఓ అందమైన, బలమైన అరేబియన్‌ గుర్రానికి సంబంధించింది. రాయలవారికి బాగా నచ్చింది. సమావేశ మందిరం బయటకు వచ్చి, అక్కడున్న గుర్రాన్ని చూశారు. ‘నాకు ఇలాంటివి ఓ ఇరవై కావాలి’ అన్నారు రాయలు. ‘యాభైవేల బంగారు నాణేలు అవుతాయి. ముందు పదివేల బంగారు నాణేలు ఇవ్వండి. మూడు రోజుల్లో గుర్రాలను మీకు అందించి, మిగతా సొమ్ము తీసుకుంటాను’ అన్నాడు ఆ వర్తకుడు. ఎలాగైనా వాటిని సొంతం చేసుకోవాలనుకున్న రాయలు మరో ఆలోచన చేయకుండా వర్తకుడికి పదివేల బంగారు నాణేలు ఇప్పించారు. పది రోజులు గడిచాక ఓరోజు రాయలవారికి గుర్రం సకిలింపు వినిపించింది. అప్పుడు ఆ వర్తకుడి విషయం గుర్తొచ్చింది. ఇంతలో తెనాలి రామలింగడు, రాజుకు ఎదురుగా కూర్చొని ఏదో రాస్తూ కనిపించాడు. ‘ఏం రాస్తున్నావు రామలింగా?’ అని అడిగారు రాయలు. ‘మన రాజ్యంలోని అమాయకుల పేర్ల జాబితా మహారాజా!’ అన్నాడు రామలింగడు. ‘ఏదీ నాకోసారి చూపించు...’ అంటూ అతడి చేతిలోని పత్రాన్ని తీసుకుని చూశారు. మొదటి పేరు ‘శ్రీకృష్ణదేవరాయలు’ అని ఉంది. ‘ఏంటీ... నేను అమాయకుడినా?’ అని అడిగారు రాయలవారు. ‘ముక్కూ మొహం తెలియని వ్యక్తికి పదివేల బంగారు నాణేలు ఇచ్చి, మోసపోయిన మీరు అమాయకులేగా ప్రభూ!’ అన్నాడు రామలింగడు. ‘ఏమో... ఆ వర్తకుడు నేడో... రేపో... వస్తాడేమో... రాడని నువ్వెలా చెప్పగలవు?’ అని కాస్త కోపంగానే అన్నారు రాయలు. ‘ప్రభూ అతడు ఒకవేళ వస్తే... మీ పేరు చెరిపేసి... ఆ స్థానంలో
ఆ వర్తకుడి పేరు రాస్తా’ అని అన్నాడు తెనాలి. రాయలవారికి రామలింగడి మాటల అంతరార్థం అర్థమైంది. ‘నిజంగానే నేను కాస్త తొందరపాటుతో వ్యవహరించాను. ఇకపై ఆలోచించకుండా, ఆస్థానంలోని తెనాలిలాంటి తెలివైన వ్యక్తుల సలహాలు, సూచనలు తీసుకోకుండా ఏ ముఖ్యమైన నిర్ణయమూ తీసుకోను’ అని తన మనసులో అనుకున్నారు. కాసేపు
రాజు మౌనంగా ఉండిపోవడంతో... ఆ జాబితాలో ఆయన పేరు చెరిపేసి ‘వాస్తవాలను గ్రహించారు కాబట్టి. ఇప్పుడిక మీరు అమాయకులు కాదు’ అన్నాడు రామలింగడు. రాయలవారు నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..