ఇక... చెవులు చిల్లులుపడవు!

పండగా పబ్బమనే కాదు- నలుగురు కలిసే కార్యక్రమం ఏదైనా సరే మనదగ్గర భారీ సౌండ్‌తో పాటలు మోతమోగి పోవాల్సిందే. వీటన్నింటితో చెవులు చిల్లులుపడతాయని మనకు తెలుసు.

Published : 24 Feb 2024 23:44 IST

పండగా పబ్బమనే కాదు- నలుగురు కలిసే కార్యక్రమం ఏదైనా సరే మనదగ్గర భారీ సౌండ్‌తో పాటలు మోతమోగి పోవాల్సిందే. వీటన్నింటితో చెవులు చిల్లులుపడతాయని మనకు తెలుసు. ‘చెవులు చిల్లులుపడటమంటే లోపలి కణాలు దెబ్బతినడమే’ అనుకుంటూ ఉన్నారు శాస్త్రవేత్తలు ఇంతకాలం. ‘కణాలు దెబ్బతింటాయి సరే, ఏ కణాలు?’ అన్న ప్రశ్న వచ్చింది తాజాగా అమెరికాలోని పిట్స్‌బర్గ్‌ వర్సిటీ శాస్త్రవేత్తలకి. అందుకోసమే ప్రయోగశాలల్లోని కొన్ని ఎలుకలకి వంద డెసిబెల్స్‌ శబ్దాన్ని వినిపించారు. వంద డెసిబెల్స్‌ అంటే... సైలెన్సర్‌ చెడిపోయిన ఓ మోటారుబైకు సౌండుకి సమానం! దాన్ని రెండుగంటలపాటు విన్న ఎలుకలు వినికిడిశక్తిని కోల్పోయాయట. వాటి చెవి భాగాల్ని పరిశీలిస్తే వినికిడి సామర్థ్యంలో కీలకపాత్ర పోషించే మృదులాస్థి(కాక్లియా) చుట్టూ ‘జింక్‌’ మూలకాలు తేలుతుండటాన్ని చూశారు. చెవిలోని ప్రొటీన్‌ కణాలు దెబ్బతిని వాటి నుంచి ఈ జింక్‌ విడిపోవడమే ఇందుక్కారణమని తేల్చారు. దాంతో చెవి కణాల నుంచి జింక్‌ అలా విడిపోకుండా అడ్డుకునే ప్రత్యేక రసాయనాల్ని తయారుచేస్తే- చెవులు చిల్లులుపడకుండా కాపాడొచ్చని భావించారు. వాటినో మందుగా తయారుచేసి ఎలుకలపైన విజయవంతంగా ప్రయోగించారు. త్వరలో వాటిని మనుషుల కోసమూ చుక్కల మందుగా తెస్తారట. వాటిని వేసుకుని- డీజే కార్యక్రమానికి వెళ్ళినా ఏమీ కాదంటున్నారు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..