గొంతు తగ్గిస్తే... లోకం మనదే!

‘సజ్జనుండు పలుకు చల్లగాను’ అని వేమన ఊరికే అన్నాడా! చల్లగా మాట్లాడేవాళ్ళు సజ్జనులుగానే ఉంటారని ప్రపంచం మొత్తం నమ్ముతుందని చెబుతోంది తాజా అధ్యయనం ఒకటి.

Published : 24 Mar 2024 00:03 IST

‘సజ్జనుండు పలుకు చల్లగాను’ అని వేమన ఊరికే అన్నాడా! చల్లగా మాట్లాడేవాళ్ళు సజ్జనులుగానే ఉంటారని ప్రపంచం మొత్తం నమ్ముతుందని చెబుతోంది తాజా అధ్యయనం ఒకటి. గొంతు కాస్త తగ్గించి మంద్రస్థాయి(లో-పిచ్‌)లో సంభాషించేవారిని బిగ్గరగా మాట్లాడేవారికన్నా ఎక్కువగా గౌరవిస్తుందనీ అంటోంది. సమాజంలో పేరు ప్రతిష్ఠలే కాదు- వ్యక్తిగత అనుబంధాల్లోనూ ఈ స్వరం అద్భుతాలు చేస్తుందట. అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్‌ వర్సిటీలో ‘ఎలాంటి గొంతు ఎదుటివాళ్ళనీ సమాజాన్నీ కట్టిపడేస్తుంది?’ అన్న అంశంపైన ఇటీవల ఓ అధ్యయనం నిర్వహించారు. ఇందుకోసం-రెండు విభిన్న ఆడ, మగ గళాల్ని రికార్డు చేశారు. ఆధునిక పరికరాల సాయంతో- ఆ గళాలని రకరకాల స్థాయులతో(పిచ్‌లతో) ‘12 వాయిస్‌ క్లిప్పింగ్స్‌’గా మార్చారు. వాటిని 22 దేశాలకి చెందిన 3,200 మంది స్త్రీపురుషులకి పంపించారు. ‘వీటిల్లో ఏ కంఠం మీకు ఆకర్షణీయంగా అనిపించింది? (ఒక వేళ ఆ గొంతు ఆపోజిట్‌ సెక్స్‌ అయితే) మీరు వాళ్ళని పెళ్ళిచేసుకుంటారా? సమాజంలో వారిని గౌరవిస్తారా?’ అంటూ రకరకాల ప్రశ్నలిచ్చి సమాధానాలు రాబట్టారు. దాదాపు 80 శాతం మంది- మంద్రస్వరంతో ఉన్న గళాలనే అత్యంత ఆకర్షణీయమైందిగా భావించారట. స్త్రీలైనా పురుషులైనా వాళ్ళనే భాగస్వాములుగా చేసుకోవడానికి మొగ్గుచూపారట. బిగ్గరగా మాట్లాడేవాళ్ళకన్నా సౌమ్యంగా మాట్లాడేవాళ్ళనే గౌరవిస్తామనీ చెప్పారట. కాబట్టి- సమాజంలోనూ, దగ్గరి సంబంధాల్లోనూ నెగ్గుకు రావాలంటే స్వరాన్ని కాస్త తగ్గించాలంటున్నారు అధ్యయనకర్తలు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..