రాబందులకో రెస్టరంట్‌!

రాబందుల సంఖ్య బాగా తగ్గిపోతోందన్న వార్తలు ఈ మధ్య వింటూ ఉన్నాం కదా! వాటి సంఖ్యని పెంచడానికి ఓ పరిష్కారాన్ని కనిపెట్టింది కర్ణాటక అటవీ శాఖ.

Published : 18 Feb 2024 00:11 IST

రాబందుల సంఖ్య బాగా తగ్గిపోతోందన్న వార్తలు ఈ మధ్య వింటూ ఉన్నాం కదా! వాటి సంఖ్యని పెంచడానికి ఓ పరిష్కారాన్ని కనిపెట్టింది కర్ణాటక అటవీ శాఖ. ఆ పక్షుల కోసం బందిపుర అడవిలో కొంతభాగాన్ని రాబందుల ఆహార కేంద్రంగా మార్చింది. దానికి ‘వల్చర్స్‌ రెస్టరంట్‌’ అనే పేరు పెట్టింది! దక్షిణ భారతదేశాన ఇలాంటి ‘రెస్టరంట్‌’ ఏర్పాటుకావడం ఇదే ప్రథమం. అడవుల్లో చనిపోయిన ఏనుగుల కళేబరాల్ని కూడా ఇక్కడికి తరలించి రాబందులకు ఆహారంగా ఇస్తున్నారు అటవీ అధికారులు. వాళ్లే కాదు- చుట్టుపక్కల పల్లెల్లోని రైతులు కూడా చనిపోయిన తమ పశువుల్ని ఈ రెస్టరంట్‌కి తీసుకురావడం విశేషం. పర్యావరణ చక్రంలో రాబందుల పాత్ర చాలా కీలకం. అడవిలో చనిపోయిన జంతువుల కళేబరాలు కుళ్ళి వ్యాధులు ప్రబలకుండా కాపాడటం వాటి పని. కానీ- మాంసం కోసం పెంచే పశువులకి వాడే కొన్ని రకాల యాంటీబయోటిక్స్‌ వల్ల కూడా- ఆయా జంతువుల మృత కళేబరాలను తిన్న రాబందులు అనారోగ్యం పాలై, ఆ జాతి అంతరించిపోయే స్థితికి వచ్చింది. అందుకే- వాటి సంఖ్య పెరిగేదాకా ఈ రెస్టరంట్‌ సేవల్ని అందిస్తామంటున్నారు అటవీ అధికారులూ, చుట్టుపక్కలున్న పల్లెవాసులూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..