వామ్మో అన్ని తాళాలా!

మ్యూజియాలనూ, వాటిలో భద్రపరిచిన చారిత్రక వివరాలనూ చూడ్డానికి వెళ్లేవాళ్లను మనం చూస్తుంటాం.

Published : 30 Mar 2024 23:33 IST

మ్యూజియాలనూ, వాటిలో భద్రపరిచిన చారిత్రక వివరాలనూ చూడ్డానికి వెళ్లేవాళ్లను మనం చూస్తుంటాం. మరి మ్యూజియం తలుపులను తెరవడం చూడ్డానికి వెళ్లేవాళ్లను ఎక్కడైనా ఎప్పుడైనా చూశారా!! అయినా తాళం వేసిన తలుపుల్ని తెరిచేటప్పుడు చూడ్డంలో అంతగా ఏముంటుందీ అనుకుంటున్నారు కదూ... అందులోనూ ఓ వైవిధ్యముంది కాబట్టే సందర్శకులు ఆసక్తి చూపుతున్నారు. ఒకటి రెండు గదులకు తాళం వేసి తీసేవారికే తాళంచెవులను గుర్తించడంలో చిన్నపాటి తొట్రుపాటు ఉంటుంది. ఏకంగా 2797 తలుపులకు వేసిన తాళంచెవుల గుత్తుల్ని పట్టుకున్న వ్యక్తి ఏ మాత్రం గందర గోళానికి లోనవకుండా ఏ గది ముందు ఆ గది తాళం తీయడమే అక్కడున్న ప్రత్యేకత. క్రైస్తవులకు పవిత్రస్థలమైన వాటికన్‌ సిటీలో 54 మ్యూజియం భవనాల్లోని 1400 గదులకు 2797 తలుపులుంటాయి. ఏడు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్న ఆ గదుల తాళాలను తీసే కార్యక్రమం ప్రతిరోజూ తెల్లవారుజామున ఐదున్నరకు మొదలై దాదాపు ఉదయం పదిగంటలకు ముగుస్తుంది. ఇదంతా జయానీ క్రెయా అనే కీ కీపర్‌ ఆధ్వర్యంలో జరుగుతుంది. అక్కడున్న 2797 తలుపులకు ఉన్న కొన్ని తాళం చెవులకు రెండు నుంచి ఐదు వరకూ స్పేర్‌ కీలు ఉంటాయి. అవన్నీ కలిపి దాదాపు పదివేల తాళం చెవులు  క్రెయా చేతిలో ఉంటుంది. వాటిల్లో క్రీ.శ.1771 నాటి తాళం చెవులు కూడా ఉండటం విశేషం. చరిత్రను తెలియజెప్పే ఆ మ్యూజియంతోపాటు అక్కడున్న తాళాలూ- ఉదయం సాయంత్రం వాటిని తీయించి వేయించే దృశ్యం కూడా ఎంతో బాగుంటుందని డబ్బులు చెల్లించి మరీ చూడ్డానికి పర్యటకులు వెళుతుంటారట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..