అమ్మపనులకీ కోర్సు!

ఏ విద్యాసంస్థలో అయినా టీచర్లు పాఠాలు చెబుతుంటే.. విద్యార్థులు చదువుకుంటూ ఉంటారు. కొలంబియాలోని శానిటాస్‌ యూనివర్సిటీలోని క్లాస్‌కి వెళితే బొమ్మల్ని ఎత్తుకున్న యువకులూ, వారికి సూచనలు చేస్తున్న బామ్మగారూ కనిపిస్తారు.

Published : 06 Apr 2024 23:14 IST

విద్యాసంస్థలో అయినా టీచర్లు పాఠాలు చెబుతుంటే.. విద్యార్థులు చదువుకుంటూ ఉంటారు. కొలంబియాలోని శానిటాస్‌ యూనివర్సిటీలోని క్లాస్‌కి వెళితే బొమ్మల్ని ఎత్తుకున్న యువకులూ, వారికి సూచనలు చేస్తున్న బామ్మగారూ కనిపిస్తారు. మరో క్లాస్‌లో బొమ్మలకు తల దువ్వుతూ పోనీటెయిల్‌ వేసేందుకు ప్రయత్నిస్తున్న పురుషులు దర్శనమిస్తారు. ఇలా ఒక్కో గదిలో ఒక్కో చిత్రమైన దృశ్యం కంటపడుతుంది. చదువు చెప్పే యూనివర్సిటీలో పిల్లల్ని పెంచీ, ఇంటి బాధ్యతలు నేర్పించే శిక్షణ ఇవ్వడం ఏంటీ అనిపిస్తోంది కదూ! పురుషాధిక్యత ఎక్కువగా ఉన్న కొలంబియాలో ఆడవాళ్లే  ఇంటి పనులన్నీ చేస్తూ పిల్లల్ని చూసుకుంటారు. మరోవైపు ఉద్యోగాలూ చేస్తారు. కొవిడ్‌ సమయంలో ఆ దేశంలో మహిళలే ఎక్కువగా మృతి చెందడం, పిల్లల బాధ్యతలు మగవారిపైన పడటంతో చాలామంది ఇబ్బంది పడ్డారు. మగవారికి ఆడవాళ్లు చేసే పనులన్నీ వచ్చి ఉంటే ఆ సమస్యలుండవని భావించారు బొగొటా నగర మేయర్‌గా ఉన్న కార్లోస్‌ ఫెర్నాండో. అందుకే అక్కడున్న శానిటా యూనివర్సిటీలోనే ‘కేర్‌ స్కూల్‌ ఫర్‌ మెన్‌’ పేరుతో కొన్ని కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చి మగపిల్లలకీ యువకులకీ పెళ్లైనవారికీ ఇంటి పనులూ, వంట పనులూ, పిల్లల పెంపకం వంటివన్నీ నేర్పడం మొదలుపెట్టారు. అందుకోసం ప్రత్యేకంగా సిలబస్‌ను కూడా రూపొందించి రెండేళ్లలో దాదాపు నాలుగు లక్షల మంది మగవారికి శిక్షణ ఇచ్చారు. అక్కడ ఎవరికి నచ్చిన పనులు వారు నేర్చుకోవచ్చు. కొన్ని ఒక్కరోజులోనే పూర్తయితే మరికొన్ని నెలలు పట్టొచ్చు. ఏది ఏమైనా మహిళల పనుల్లో పురుషుల్నీ భాగస్వాముల్ని చేయడమే ఈ కోర్సు లక్ష్యం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..