పొలమంతా బోర్లే!

చెరువులూ, కాలవలూ లేనప్పుడు పొలాల్లో బోరు వేసి ఆ నీళ్లతో వ్యవసాయం చేస్తుంటారు రైతులు. అయితే తమ పొలంలో ఉన్న బోరుకు దగ్గర్లో మరో బోరు వేయడానికి రైతులు అస్సలు ఇష్టపడరు.

Published : 06 Apr 2024 23:17 IST

చెరువులూ, కాలవలూ లేనప్పుడు పొలాల్లో బోరు వేసి ఆ నీళ్లతో వ్యవసాయం చేస్తుంటారు రైతులు. అయితే తమ పొలంలో ఉన్న బోరుకు దగ్గర్లో మరో బోరు వేయడానికి రైతులు అస్సలు ఇష్టపడరు. అందుకు కారణం భూగర్భ జలాల నిల్వ తగ్గిపోయి తమకెక్కడ నీటిఎద్దడి వస్తుందోనన్న భయం. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం మడుగుపల్లికి వెళితే అక్కడ ఊరంతా కలిసి ఒక్క చోటే బోర్లు వేసుకున్నారు. అందుకోసమే ఎకరం పొలంలో తలా కొంత స్థలం కొనుగోలు చేసి నీటి కరవు తీర్చుకున్నారు. సుమారు 2000 మంది నివసిస్తున్న ఆ గ్రామంలో ఫ్యాక్షన్‌ కారణంగా ఎప్పుడూ గొడవలు జరుగుతుంటాయి. కానీ, చాలా ఏళ్లుగా అక్కడ నీటి కొరత ఉంది. ఎవరి పొలాల్లో బోర్లు వేసినా నీళ్లు పడేవికావు. కేవలం ఒకే ఒక చోట నీళ్లు పడటంతో గ్రామస్థులంతా ఒక్కటయ్యారు. ఆ స్థలాన్ని సాగుకు కాకుండా నీటికోసమే వాడాలని భావించి ఒక్క చోటే దాదాపు డెబ్భై బోర్లు వేసుకుని... తమ పొలాలకు నీళ్లను పారిస్తున్నారు. కేవలం ఆ స్థలంలోనే నీళ్లు పడటానికి కారణం... భూగర్భంలో గుహలా ఏర్పడి నీటి ఊట పుష్కలంగా చేరడం వల్లనే అక్కడ అన్ని బోర్లు వేసినా కొరత లేకుండా పంటలకు నీరు అందుతోందట.

నాగమల్లేశ్వరరావు, పుట్లూరు న్యూస్‌టుడే


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..