పూలు తెస్తే ఫైన్‌!

సాధారణంగా గుడికి వెళ్లేటప్పుడు ఎవరైనా పూలు తీసుకెళతారు. కేరళలో మాత్రం పూలు తెస్తే ఫైన్‌ వేస్తాం అంటోంది అక్కడి దేవాదాయ కమిటీ. అదేంటని కంగారుపడుతున్నారా... అన్ని పూలూ కాదులెండి,

Updated : 26 May 2024 01:00 IST

సాధారణంగా గుడికి వెళ్లేటప్పుడు ఎవరైనా పూలు తీసుకెళతారు. కేరళలో మాత్రం పూలు తెస్తే ఫైన్‌ వేస్తాం అంటోంది అక్కడి దేవాదాయ కమిటీ. అదేంటని కంగారుపడుతున్నారా... అన్ని పూలూ కాదులెండి, గన్నేరు లేదా కరివేరు పూలను తెస్తేనే జరిమానా విధిస్తారు. అయినా అపార్టుమెంట్ల చుట్టూ, ఆలయాల దగ్గరా ఇంటి ఆవరణలోనూ చాలామంది కరివేరు(ఒలియాండర్‌) మొక్కల్ని పెంచేదే ఆ పూలకోసం. చెట్టునిండా గుత్తులుగా పూసే ఆకర్షణీయమైన ఆ పూలను చాలామంది దేవుడి ఫొటోలకు పెడతారు. పూజల్లో వాడుకుంటారు. అందుకే మన దగ్గర కూడా ప్రతి ఆలయంలోనూ ఈ మొక్కలు కనిపిస్తుంటాయి. వాటిని రోడ్డు పొడవునా డివైడర్ల మధ్యలో కూడా నాటతారు. అయితే కేరళలో మాత్రం ఈమధ్య కరివేరు పూలను పూజల్లో వాడకూడదనీ, మొక్కల్ని పెంచుకోవద్దనీ అక్కడి దేవాదాయ కమిటీ నిర్ణయించి- ఆ రాష్ట్రంలోని దాదాపు మూడువేల ఆలయాల్లో ఆ పూలను నిషేధించింది. ఓ మహిళ పొరపాటున ఆ పూరేకుల్ని నోట్లో వేసుకోవడంతో తీవ్ర అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోయింది. సాధారణంగా ఔషధాల తయారీలో వాడే ఈ మొక్కలో విషపదార్థం ఉంటుంది. అందువల్ల సంస్థలు ప్రాసెస్‌ చేశాకే  ఉపయోగిస్తాయి. నేరుగా తీసుకుంటే ప్రమాదం కాబట్టి శ్రీలంక, దక్షిణాసియా దేశాల్లో దీన్ని సూసైడ్‌ మొక్క అని పిలుస్తారు. అంత ప్రాణాంతకం కనుకే ఆ మొక్కల్ని దూరంపెట్టమంటోంది కేరళ కమిటీ.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..