ముద్దుగుమ్మకో ముత్యాల జాకెట్టు!

పాల వన్నెలతో అమ్మాయి మెడను చుట్టే ముత్యాల అందం- ఇప్పుడు అతివల సొగసును మరింత పెంచేలా సిద్ధమైపోయింది. ఆభరణాల నుంచి అల్లికల్లోకీ చేరిపోతూ బ్లౌజుల మీదకూ వచ్చేసింది.

Published : 09 Jun 2024 01:23 IST

పాల వన్నెలతో అమ్మాయి మెడను చుట్టే ముత్యాల అందం- ఇప్పుడు అతివల సొగసును మరింత పెంచేలా సిద్ధమైపోయింది. ఆభరణాల నుంచి అల్లికల్లోకీ చేరిపోతూ బ్లౌజుల మీదకూ వచ్చేసింది. ముత్యాల ఎంబ్రాయిడరీ జాకెట్లతో నయా ట్రెండ్‌గా మారిపోయిన ఈ పెరల్‌ బ్లౌజులపైన మీరూ ఓ లుక్కేయండి మరి!

ఏ దైనా వేడుక దగ్గర్లో ఉందంటే ఆడవాళ్లు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. అలంకరణలో అతి ముఖ్యమైన నగలూ, చీరల మీద దృష్టి పెడుతూనే అంతకుమించి ఆ చీర బ్లౌజు డిజైన్‌పైనా శ్రద్ధ చూపిస్తారు. ‘చీర అందమంతా బ్లౌజుతోనే ముడిపడి ఉంటుంది’ అంటూ మార్కెట్లో ఎన్నో రకాల బ్లౌజులొచ్చినా సంతృప్తి చెందరు. నడుస్తున్న ట్రెండ్స్‌ మీద ఆరా తీస్తూ కుట్టు దగ్గర్నుంచీ ఎంబ్రాయిడరీ వరకూ అన్నీ సరికొత్తగానే కనిపించాలనుకుంటారు. అలాంటివారి ఆలోచనలకు రూపమిస్తూనే డిజైనర్లూ నయా ఫ్యాషన్లను తీసుకొస్తుంటారు. అలా ఈమధ్య ఆకట్టుకుంటున్నవే ఈ ముత్యాల బ్లౌజులు.

ఒకప్పుడు చీరకట్టులో అందాన్ని తేవడానికి- చీరకు నప్పే మ్యాచింగ్‌ జాకెట్‌ వేసుకునేవారంతే. కానీ తర్వాత్తర్వాత పూర్తిగా జాకెట్టే సీన్‌లోకి దిగిపోయింది. కుందన్లూ, అద్దాల అందాలతో మెరిసిపోయింది, జర్దోసీ అల్లికలతో ఆకట్టుకుంది, కాసుల బిళ్లలూ, నగల నగిషీలతో చమక్కుమంది. ఇలా ఒకవైపు ఎన్నెన్నో ఎంబ్రాయిడరీలతో జతకడుతూ ఎప్పటికప్పుడు కొత్తకొత్తగా ముస్తాబయ్యింది. మరోవైపు బుట్ట చేతులంటూ అమ్మాయిల మనసును దోచుకుంది. ఇంకా రఫుల్‌, ఎల్బో, లాంగ్‌ స్లీవ్స్‌తో కొత్త అందాన్ని మూట గట్టుకుంది. అలా ఫ్యాన్సీ శారీల బ్లౌజులు మొదలు పెళ్లిపట్టుచీరల జాకెట్ల దాకా ఒక్కోటి ఒక్కోరకమైన స్టైలుతో మెప్పిస్తూ- ఇప్పుడేమో ముత్యాల వన్నెలు అద్దుకుని వచ్చింది. ఏకంగా జాకెట్టునే అందమైన ఆభరణంలా మార్చేసింది.

రకరకాల ఆకారాల్లోని ముత్యాల్ని తీసుకుంటూ జాకెట్టు డిజైన్‌కు తగ్గట్టు ఈ పెరల్‌ ఎంబ్రాయిడరీ చేస్తున్నారు. బ్లౌజు ముందూ, వెనకా నెక్కు మోడల్ని బట్టి ముత్యాల వరసల్ని వేలాడదీస్తున్నారు. ఇంకా ఈ చేతి కుట్టు ముత్యాల ఎంబ్రాయిడరీలతోనే ఇటు ట్రెండీ అటు ట్రెడిషనల్‌ లుక్కును తీసుకొచ్చేస్తున్నారు. ఏ రంగు చీరకైనా ఇట్టే నప్పే ఈ ముత్యాల జాకెట్లను కావాలంటే మనకు నచ్చిన అల్లికలతోనూ తయారుచేయించుకోవచ్చు.

లేదంటే సింపుల్‌ లుక్కుతో ఉన్న పెరల్‌ ఎంబ్రాయిడరీ బ్లౌజులు రెడీమేడ్‌గానూ దొరుకుతున్నాయి. ఫ్యాషన్‌ ఫాలో అయ్యే వాళ్లలో మీరు ముందు వరసలో ఉంటారా... అయితే ఆలస్యం చేయకుండా మీకు నచ్చిన ముత్యాల జాకెట్‌ను ఎంచుకుని చక్కటి చీరకు దాన్ని సెట్‌ చేసేయండి. ‘ముత్యాల జాకెట్టులో ఎంత ముద్దుగున్నావో’ అంటూ ప్రియమైనవారు పాటలందుకుంటారంతే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..