‘జైరో’తో హిమాలయాలకు చలో!

ఏ పర్వత ప్రాంతాల అందాలైనా రోడ్డుమార్గంలో వెళ్ళి చూడటం బాగానే ఉంటుంది కానీ- ‘విహంగ వీక్షణం’ మరింతగా బావుంటుంది. విమానం కొంతవరకూ మనకి ఆ అవకాశాన్నిచ్చినా- అది మరీ ఎత్తులో వెళుతుంది కాబట్టి ఆ అందాలని పూర్తిగా ఆస్వాదించలేం.

Published : 18 Feb 2024 00:01 IST

ఏ పర్వత ప్రాంతాల అందాలైనా రోడ్డుమార్గంలో వెళ్ళి చూడటం బాగానే ఉంటుంది కానీ- ‘విహంగ వీక్షణం’ మరింతగా బావుంటుంది. విమానం కొంతవరకూ మనకి ఆ అవకాశాన్నిచ్చినా- అది మరీ ఎత్తులో వెళుతుంది కాబట్టి ఆ అందాలని పూర్తిగా ఆస్వాదించలేం. హెలికాప్టర్‌లోనైతే చక్కగా వెండిశిఖరాలు మనకు అందుతున్నాయా అన్నంత దూరంలోనే వెళ్ళొచ్చు! కాకపోతే దానికి ఖర్చెక్కువ. ఆ ఖర్చుని భారీగా తగ్గించి హిమాలయాల అందాలని సామాన్యులకి చేరువ చేయడానికే ‘జైరోకాప్టర్‌’ వస్తోంది. దేశంలోనే తొలిసారి ఉత్తరాఖండ్‌ రాష్ట్రం దీన్ని పరిచయం చేయబోతోంది.

కాశాన్ని ముద్దాడే వెండిశిఖరాలూ, వాటిని చీరలా చుట్టుకున్న నదుల హొయలూ, వాటి నడుమ పచ్చలు పొదిగినట్టుండే పచ్చికబయళ్ళూ... హిమాలయాల అందాలు ఎంత చూసినా తనివితీరదు. ఆ అద్భుత సౌందర్యాన్ని ఓ పక్షిలా ఎగురుతూ చూసినంత హాయిగా ఆస్వాదించేందుకు ఇప్పటికే ‘ఎయిర్‌ సఫారి’ పేరుతో హెలికాప్టర్‌ పర్యటనల్ని నడుపుతోంది ఆ రాష్ట్రం. కాకపోతే, దానికి ఖర్చెక్కువ. గంటకి 30 వేల రూపాయలకుపైగా ధర ఉంటుంది. ఆ వ్యయం భరించలేని సామాన్యుల కోసమే ఇప్పుడు ‘జైరోకాప్టర్‌’ని పరిచయం చేయబోతోంది ఉత్తరాఖండ్‌. హెలికాప్టర్‌ ఖర్చుతో పోలిస్తే సగం కన్నా తక్కువకే దీన్ని అందిస్తామంటోంది. ఒక్క ఖర్చు విషయంలోనే కాదు- అనుభూతి విషయంలోనూ ఇది హెలికాప్టర్‌కన్నా ఎన్నో రెట్లు మెరుగ్గా ఉంటుంది.

ఓ స్కూటర్‌లాగే!

మనం నడిపే స్కూటర్‌ ఉన్నపళంగా గాలిలో తేలుతూ పోతే ఎంత గమ్మత్తుగా ఉంటుంది! జైరోకాప్టర్‌ ప్రయాణం కూడా అలాగే ఉంటుంది, అంత సునాయాసంగానే అనిపిస్తుంది. ఏ కొండాకోన చుట్టూ అయినా చక్కర్లు కొట్టేందుకు అనువుగా ఉంటుంది. చూడటానికి ఓ చిన్న సైజు హెలికాప్టర్‌లా ఉన్నా- దీని పనితీరు విమానంలాగే ఉంటుంది. నేలపైన కాసింత సేపు ముందుకెళ్ళాకే టేకాఫ్‌ అవుతుంది... ల్యాండింగ్‌ కూడా అంతే! కాకపోతే- విమానానికి కావాల్సినంత పొడవైన ‘రన్‌ వే’ అక్కర్లేదు... కేవలం అరకిలోమీటరున్నా చాలు. సాంకేతికంగా చూస్తే - ఏ విమానమైనా దాని వెనకున్న ప్రొపెల్లర్‌ ముందుకు తోస్తేనే ముందుకెళుతుంది, పైకెగురుతుంది. ఒక్కసారి ఎగిరాక దాని రెక్కలు ఆ గాలిని వెనక్కినెడుతూ విమానాన్ని బ్యాలెన్స్‌ చేస్తాయి. జైరోకాప్టర్‌ పనితీరూ దాదాపు ఇంతే. కాకపోతే, విమానంలో రెక్కలు చేసే పనిని- దీన్లో పైనుండే ‘రోటర్‌ బ్లేడ్‌’ చేస్తుంది.

హెలికాప్టర్‌కన్నా దీని బరువూ, సైజూ తక్కువ. దాంతో ఇంధనం కూడా చాలా తక్కువే అవసరమవుతుంది. తేలిగ్గా ఉండటం వల్ల హెలికాప్టర్‌ కన్నా చురుగ్గా కదులుతుంది. ఒకరిద్దరు ప్రయాణం చేయడానికి అనువుగా ఉంటుంది. ఏదైనా సమస్య వచ్చి మధ్యలో ప్రొపెల్లర్‌ ఆగిపోయినా భయం అక్కర్లేదు- రోటర్‌బ్లేడ్‌ గాలికి తిరుగుతూ క్షేమంగా మనల్ని ల్యాండ్‌ చేసేస్తుంది. ఇన్ని ప్రయోజనాలున్నాయి కాబట్టే తొలిసారి దీన్ని మనదేశంలో పరిచయం చేయబోతోంది ఉత్తరాఖండ్‌ పర్యాటక అభివృద్ధి సంస్థ. జర్మనీకి చెందిన ఆటోజైరో సంస్థ నుంచి ఇప్పటికే రెండు జైరోలని కొనుగోలు చేసింది. ఆ మధ్య- హరిద్వార్‌లోని బైరాగి క్యాంప్‌ నుంచి కొందరు ప్రయాణికులతో ప్రయోగాత్మకంగా పర్యటనలు కూడా నిర్వహించింది. త్వరలోనే లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. అంతేకాదు, ఈ జైరోకాప్టర్‌ల సాయంతో ఉత్తరాఖండ్‌ రాష్ట్రం మరెన్నో ప్రయోగాలు చేయాలనుకుంటోంది.

‘అల్పాహార’ పర్యటనలు!

అమెరికా, స్విట్జర్లాండ్‌ వంటి దేశాల్లో పర్వత ప్రాంతాల్లో ‘బ్రేక్‌ఫాస్ట్‌ టూర్స్‌’ అని నిర్వహిస్తుంటారు. శిఖరాలకి సమీపంలో ఏర్పడే పచ్చికబయళ్ళ(ఆల్పైన్‌ మెడోస్‌) దగ్గరకి హెలికాప్టర్‌లతో తీసుకెళతారు. మామూలుగా రోడ్డు ద్వారా చేరుకోలేని ఆ ప్రకృతి అందాల మధ్య అల్పాహార విందు ఏర్పాటుచేస్తారు. ఇలాంటి వైవిధ్య పర్యటనల్ని మనదేశానికీ పరిచయం చేయబోతోంది ఉత్తరాఖండ్‌. హిమాలయ సానువుల్లో ఇప్పటిదాకా పర్యటకులు వెళ్ళలేని ప్రాంతాల్లో ఈ ఆతిథ్యం ఇవ్వబోతోంది. రుషికేష్‌, హర్సిల్‌, జార్జ్‌ ఎవరెస్ట్‌, నైనిటాల్‌ వంటి చోట్ల ఇప్పటిదాకా నిగూఢంగా ఉండిపోయిన కొన్ని ప్రాంతాలని ఇందుకోసం గుర్తించింది. కేవలం మూణ్ణాలుగు గంటల్లోనే పూర్తయ్యేలా ఈ చిరు పర్యటనల్ని తీర్చిదిద్దబోతున్నారు. ఇందుకు విదేశాల్లోలాగా- హెలికాప్టర్‌లని కాకుండా జైరోకాప్టర్‌లని వాడబోతున్నారు. ఈ ప్యాకేజీలు కూడా ప్రారంభమైతే- ఇప్పటిదాకా పర్యటకులు ఎవరూ వెళ్ళలేని హిమాలయాల అందాలన్నింటినీ అతి సునాయాసంగా సందర్శించే అవకాశం దొరుకుతుంది! ఆ ఊహతోనే- గాల్లో తేలిపోతున్నట్లు అనిపించడం లేదూ?!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..