థియేటర్‌లోనే పార్టీ చేసుకోవచ్చు!

‘స్నేహితురాలి పుట్టినరోజు వస్తోంది. ఈసారి ఏదయినా మంచి గిఫ్ట్‌ ఇవ్వాలి...’ ‘మా పెళ్లిరోజున ఓ పదిహేను మంది దాకా పిలిచి పార్టీ ఇవ్వాలనుంది.

Published : 18 Feb 2024 00:05 IST

‘స్నేహితురాలి పుట్టినరోజు వస్తోంది. ఈసారి ఏదయినా మంచి గిఫ్ట్‌ ఇవ్వాలి...’ ‘మా పెళ్లిరోజున ఓ పదిహేను మంది దాకా పిలిచి పార్టీ ఇవ్వాలనుంది. ఇంట్లో కాకుండా బయట ఎక్కడైనా చూడాలి...’ ‘హోం థియేటర్‌ పెట్టించుకునేంత పెద్ద ఇల్లు లేదు కానీ... అప్పుడప్పుడూ కుటుంబసభ్యులు మాత్రమే కలిసి సరదాగా సినిమా చూసేలా ఏదయినా ప్రత్యేక ఏర్పాటు ఉంటే ఎంత బాగుంటుంది’... అంటూ ఆలోచించేవారికి ఇప్పుడు ప్రైవేటు థియేటర్లు సరైన పరిష్కారాన్ని చూపిస్తున్నాయి. సన్నిహితులతో కలిసి నచ్చిన సినిమా చూస్తూ... కోరుకున్న ఆహారాన్ని ఆస్వాదిస్తూ... ఎంజాయ్‌ చేసేందుకు అందుబాటులోకి వచ్చినవే ఈ ప్రైవేటు థియేటర్లు.

హారిక తన భర్త పుట్టినరోజున ఏదయినా సర్‌ప్రైజ్‌ ప్లాన్‌ చేయాలనుకుంది. బాగా ఆలోచించి చివరకు థియేటర్‌ను బుక్‌ చేసింది. ఇందులో సర్‌ప్రైజ్‌ ఏముందని అనిపించొచ్చు కానీ... ఆ థియేటర్‌కు వచ్చిన ఆమె భర్తతోపాటు అతడి స్నేహితులు మాత్రం ‘చాలా కొత్తగా ఆలోచించావు’ అంటూ హారికను మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. ఇదెక్కడి ట్విస్ట్‌ అనుకుంటున్నారా... ఆమె బుక్‌ చేసింది సాధారణ థియేటర్‌ కాదు. ప్రైవేటు థియేటర్‌ మరి. అవును... ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తున్న ఈ ప్రైవేటు థియేటర్లు చిన్నసైజు పార్టీలకు అడ్డాగా మారడంతోపాటూ కుటుంబసభ్యులంతా సరదాగా గడుపుతూ నచ్చిన సినిమా చూసేందుకు ఓ చక్కని వేదికగానూ నిలుస్తున్నాయి. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు థియేటర్లు మల్టిప్లెక్స్‌లుగా మారిపోయి... ఎన్నిరకాల సదుపాయాలను అందిస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. అయినా కూడా ఇంకా కొత్తదనం కోరుకునేవారు కొందరైతే... కొన్ని ప్రత్యేక సందర్భాలు తమకు మాత్రమే పరిమితం కావాలంటూ ప్రైవసీకి ప్రాధాన్యం ఇచ్చేవారు మరికొందరు. అలాంటివారిని దృష్టిలో పెట్టుకునే ఈ ప్రైవేటు థియేటర్లను తీసుకొచ్చారు.

సరదాగా గడిపేసేలా... 

పుట్టినరోజులు, పెళ్లిరోజులు, కొలీగ్స్‌ ఏర్పాటు చేసుకునే గెట్‌ టుగెదర్‌లు, కుటుంబసభ్యులంతా ఒక్కచోట కలవాలనుకోవడం, స్నేహితులంతా కలిసి సరదాగా మాట్లాడుకుంటూ ఎంజాయ్‌ చేసేందుకు ఓ మీటింగ్‌ స్పాట్‌... ఇలా సందర్భం ఏదయినా ఈ ప్రైవేటు థియేటర్లను ఎంచుకోవచ్చు. ఇవి చూడ్డానికి హోంథియేటర్ల మాదిరి ఉంటాయి. కనిష్ఠంగా నలుగురి నుంచి గరిష్ఠంగా పదిహేను మంది వరకూ సరదాగా గడిపేందుకు మెత్తని సోఫాలు, థియేటర్‌ను పోలిన పెద్ద స్క్రీనుతోపాటు కూల్‌డ్రింక్స్‌, స్నాక్స్‌... ఇలా దాదాపు అన్ని సదుపాయాలూ చూడొచ్చు. అలాగే అన్నిరకాల ఓటీటీ ఛానళ్లూ అందుబాటులో ఉంటాయి. వాటిల్లో కోరుకున్న సినిమాను చెబితే... అక్కడి సిబ్బంది ఆ సినిమాను స్క్రీన్‌మీద ప్రసారం చేస్తారన్నమాట. దాన్ని చూస్తూ మూడు గంటలసేపు ప్రైవేటు థియేటర్‌లో సరదాగా గడిపేయొచ్చు. సినిమా వద్దూ అనుకుంటే ఈ థియేటర్లను చిన్నచిన్న వేడుకలకూ ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు పైన చెప్పుకున్నట్లుగా పెళ్లిరోజు పార్టీని పది మంది మధ్యే చేయాలనుకున్నప్పుడూ, జీవిత భాగస్వామికి లేదా బెస్ట్‌ఫ్రెండ్‌కు సర్‌ప్రైజ్‌ బర్త్‌డే పార్టీ ఇవ్వాలనుకున్నప్పుడూ కూడా ఈ థియేటర్‌ను ఎంచుకోవచ్చు. వేడుకకి తగినట్లుగా అలంకరణ చేయడంతోపాటూ కేకు, స్నాక్స్‌ తదితరాలను ఏర్పాటు చేస్తారు. థియేటర్‌ను బుక్‌ చేసుకున్న సమయానికి వస్తే... రెండు నుంచి మూడుగంటలసేపు అక్కడే ఆనందంగా గడపొచ్చు. ఆ పార్టీలో భాగంగా నచ్చిన సినిమాను చూసుకోవచ్చు లేదా వ్యక్తిగత వీడియోలనూ ప్లే చేయించుకోవచ్చు. థియేటర్లకు వచ్చేవారి సంఖ్యనూ ఉండాలనుకున్న సమయాన్నీ బట్టి డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ద బింజ్‌ టౌన్‌, టేప్స్‌ అండ్‌ టేల్స్‌, ద బిగ్‌ స్క్రీన్‌.. అంటూ హైదరాబాద్‌తోపాటూ చెన్నై, బెంగళూరు, దిల్లీ, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో ఈ ప్రైవేటు థియేటర్లు ఏర్పాటవుతున్నాయి. కాబట్టి.. ఈసారి ఎవరిదైనా పుట్టినరోజు వస్తోందంటే... హోటల్‌లో భోజనం, థియేటర్‌లో సినిమా... కాకుండా వీటినీ ఎంచుకుంటే... సినిమా, విందు - అన్నీ ఒకేచోట పూర్తిచేయొచ్చు. దీంతో, అటు వ్యక్తిగత ప్రైవసీకీ ఇబ్బంది ఉండదు, ఇటు ఆనందానికీ లోటుండదు...  ఏమంటారూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..