తియతియ్యని మంచుకొండలు!

కేకు... ఒకప్పుడు పుట్టినరోజునాడే కోసేవారు. కానీ ఇప్పుడు పెళ్లిరోజు కానివ్వండీ, చిన్న గెట్‌ టు గెదర్‌ అవనివ్వండీ, ఆఫీసులో పార్టీ ఉద్యోగంలో ప్రమోషన్‌... ఇలా సందర్భం ఏదయినా కేకు తప్పనిసరిగా ఉండాలంటున్నారు.

Published : 25 Feb 2024 00:09 IST

కేకు... ఒకప్పుడు పుట్టినరోజునాడే కోసేవారు. కానీ ఇప్పుడు పెళ్లిరోజు కానివ్వండీ, చిన్న గెట్‌ టు గెదర్‌ అవనివ్వండీ, ఆఫీసులో పార్టీ ఉద్యోగంలో ప్రమోషన్‌... ఇలా సందర్భం ఏదయినా కేకు తప్పనిసరిగా ఉండాలంటున్నారు. ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నా కేకు లేనిదే ఆ వేడుకకి నిండుదనం రాదంటూ చెప్పకనే చెప్పేస్తున్నారు. ఆ వేడుకలకు తగినట్లుగా కేకులూ కోరుకున్న డిజైన్లలో వచ్చేస్తూ అబ్బురపరుస్తున్నాయి. తాజాగా ఆ డిజైన్లలో ఈ ‘స్నో - మౌంటెయిన్‌’ థీమ్‌ కేకులూ చేరిపోయి... మంచు ప్రాంతాల్ని ఇష్టపడేవారిని మురిపించేస్తున్నాయి.

కేకును ఆర్డరివ్వాలనుకున్నప్పుడు... అది చాక్లెట్టా, వెనిల్లానా, బ్లాక్‌ఫారెస్టా, స్ట్రాబెర్రీనా, పైనాపిలా.. అంటూ రుచుల్ని చూసి ఎంచుకోవడంతోనే ఆగిపోవడంలేదు కేకు ప్రేమికులు. సందర్భం, కేకు కోసేవారి ఇష్టాయిష్టాలూ, డిజైనూ, రుచీ.. ఇలా అన్నింటికీ ప్రాధాన్యం ఇస్తున్నారు. దానికి తగినట్లుగా మాస్టర్‌ షెఫ్‌లూ, కేక్‌ నిపుణులూ ఎప్పటికప్పుడు కేకుల్లోనూ ప్రయోగాలు చేస్తూ వాటికి థీమ్‌లను సృష్టిస్తున్నారు. ఆ జాబితాలో ఇప్పటికే ప్రకృతి ప్రేమికులకోసం పచ్చని చెట్లూ, జలపాతాలూ, దీవులూ, సముద్రం... వంటి నమూనాలతో తయారు చేసిన కేకులు వచ్చేశాయి. వాటికి కొనసాగింపుగా తాజాగా ఈ ‘స్నో-మౌంటెయిన్‌’ థీమ్‌నూ తీసుకొచ్చారు. కొందరికి తోటపని అంటే ఇష్టం. మరికొందరికి ప్రయాణాలు చేయడం సరదా. వంటలు చేయడాన్ని హాబీగా ఎంచుకునేవారూ ఉన్నారు. చాలా తక్కువమంది మాత్రం రాక్‌క్లైంబింగ్‌, మౌంటెనీరింగ్‌, స్కీయింగ్‌ అంటూ సాహసాలు చేసేస్తుంటారు. ఆ సాహసాలే తమ అభిరుచులని చెబుతుంటారు. అలాంటివాళ్ల పుట్టినరోజు, పెళ్లిరోజు వచ్చినప్పుడు.... లేదా వాళ్లు సాధించిన విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకుంటున్నప్పుడు.. వాళ్ల అభిరుచినీ ఇష్టాన్నీ ప్రతిబింబించేందుకే ఇలాంటి కేకుల్ని తయారుచేస్తున్నారు.

ఏంటి ప్రత్యేకత అంటే...

మంచుపర్వతాలు అనగానే... ఎత్తుగా కనిపించే చల్లని కొండలని ఎవరైనా టక్కున చెప్పేస్తారు. కానీ వాటి మధ్య నుంచి జాలువారే జలపాతాలూ, అక్కడక్కడా కనిపించే చెట్లూ, జంతువులూ... ఇలా ఆ పర్వతాల మధ్య ఎన్నెన్నో వింతలు ఉంటాయి. ఆ వింతల్నీ, విశేషాల్నీ ఆస్వాదిస్తూనే ప్రకృతి ప్రేమికులు మంచుకొండల్ని ఎక్కేందుకు ప్రయత్నిస్తారు, స్కీయింగ్‌ చేసేందుకూ ఆసక్తి చూపిస్తారు. లేదా సరదాగా ఆ కొండలమధ్య గడిపేస్తుంటారు. ఇదిగో ఆ ప్రకృతి అందాల్నీ, ఆ ప్రేమికుల అభిరుచుల్నీ మేళవించే ఈ కేకుల్ని డిజైను చేస్తున్నారు మాస్టర్‌ షెఫ్‌లు. పైవాటన్నింటితోపాటూ ఆ కొండలపైనుంచి ఎగిరే పక్షులూ అక్కడక్కడా తిరిగే పాండాలు, కొండలు కరిగి ప్రవహించే నీరూ.. వంటివన్నీ ఈ కేకుల తయారీలో చూపించేస్తున్నారు. అందుకు తగినట్లుగా ఫాండంట్‌, బటర్‌, క్రీమ్‌, ఫుడ్‌కలర్స్‌ వంటివన్నీ ఎంచుకుంటూ సహజత్వాన్ని తీసుకొస్తున్నారు. దాంతో ఈ కేకుల్ని చూసినవారెవరైనా ‘వావ్‌.. ఇది నిజంగా కేకేనా లేక బొమ్మా అంటూ ఒక్కక్షణం ఆశ్చర్యపోవడం ఖాయం. కాబట్టి... ఈసారి స్నేహితుల్లో లేదా కుటుంబసభ్యుల్లో ఎవరిదైనా పుట్టినరోజు వస్తోందను కున్నప్పుడు... వాళ్లకు సాహసాలు చేయడం ఇష్టమని తెలిసినప్పుడు ఈ కేకును కానుకగా ఇచ్చి చూడండి. వాళ్లు ఆశ్చర్యానందాలతో ఉబ్బితబ్బిబ్బవుతారంటే నమ్మండి..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..