సాంబ్రాణి ధూపం వేద్దామా..!

‘సాంబ్రాణి వాసన బానే ఉంటుంది కానీ.. ఆ పొగను ఎక్కువసేపు భరించలేం..!’, ‘వ్యక్తిగత అవసరాలకు తగినట్లుగా కొత్తకొత్త వస్తువులు వచ్చేస్తున్నట్లు సాంబ్రాణి కూడా తక్కువ పొగతోనూ మంచిమంచి వాసనల్లోనూ దొరికితే ఎంత బాగుంటుందో..!

Updated : 10 Mar 2024 07:10 IST

‘సాంబ్రాణి వాసన బానే ఉంటుంది కానీ.. ఆ పొగను ఎక్కువసేపు భరించలేం..!’, ‘వ్యక్తిగత అవసరాలకు తగినట్లుగా కొత్తకొత్త వస్తువులు వచ్చేస్తున్నట్లు సాంబ్రాణి కూడా తక్కువ పొగతోనూ మంచిమంచి వాసనల్లోనూ దొరికితే ఎంత బాగుంటుందో..!’, ‘అసలు ధూపం వేయకుండా ఇల్లు సాంబ్రాణి వాసనతో నిండిపోతే..!’... ఇలా కోరుకునేవారికోసం ఇప్పుడు అది కూడా రకరకాలుగా దొరికేస్తోంది తెలుసా...

సిపిల్లలకు తలస్నానం చేయించాక... వాళ్లకు సాంబ్రాణి పొగను వేస్తుంటారు ఇంట్లోని పెద్దవాళ్లు. ఎందుకూ అంటే... తల వెంటనే ఆరిపోతుందనీ, త్వరగా జలుబు చేయదనీ, ఆ వాసన జుట్టుకు పట్టుకోవడంతోపాటూ వాళ్లు మరో రెండుగంటలు ఎక్కువగా నిద్రపోతారనీ చెబుతుంటారు. అందుకే అమ్మమ్మలూ, నానమ్మల కాలం నుంచీ పిల్లలకు సాంబ్రాణి పొగ వేయడాన్ని ఓ సంప్రదాయంగా పాటిస్తున్నారు. అలాగే పూజగదిలో కాస్త సాంబ్రాణిని వెలిగిస్తే, లేదా అప్పుడప్పుడూ దాంతో ఇల్లంతా ధూపం వస్తే పాజిటివ్‌ ఎనర్జీ సొంతమై... మానసిక సాంత్వన కలుగుతుందనే నమ్మకమూ ఉంది. వీటన్నింటి కారణంగానే నేటికీ సాంబ్రాణి వాడకం తగ్గకుండా కొనసాగుతోంది. అలాంటి సాంబ్రాణి ఇప్పుడు నేటి అవసరాలకు తగినట్లుగా కొత్తకొత్త రూపాల్లోకి మారిపోయి... కోరుకున్న సువాసనలతో, ఆయుర్వేద సుగుణాలతో, నూనె రూపంలో, ఆగరుబత్తీల తరహాలో, తక్కువ పొగ వచ్చేలా... రకరకాలుగా అందుబాటులో ఉంది. 

కోరుకున్న సువాసనలో...

సాధారణంగా అగరుబత్తీలతో పోలిస్తే సాంబ్రాణి వాసన ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. కానీ తయారీదారులు ఇందులోనూ కొత్త పరిమళాల్ని చేర్చడంతో  సాంబ్రాణి కూడా తులసి, పసుపు, జువ్వాది, కర్పూరం, విభూది, గంధం... తదితర వాసనల్లోనూ దొరుకుతోంది. అంతేకాదు- వట్టివేరు, జటమానసీ, కమలాఫలం/నిమ్మతొక్కలు తదితరాలు కలిపిన ఆయుర్వేద సుగుణాలతోనూ అందుబాటులో ఉంది. అలాగే, దీన్నుంచి వచ్చే సువాసన ఎంత బాగున్నా సరే.. కొందరికి పొగ పడకపోవచ్చు. ఇలాంటివారికి పొగ తక్కువగా వచ్చేలా లో స్మోక్‌ అగరుబత్తీలనూ తీసుకొచ్చారు. ధూప్‌స్టిక్స్‌ కూడా కేవలం సాంబ్రాణి సువాసనకే పరిమితం కాకుండా లావెండర్‌, జాస్మిన్‌, రోజ్‌ వంటి పూల సువాసనలతో పరిమళిస్తున్నాయి. అవి కూడా వద్దనుకునేవారికి సాంబ్రాణి నూనె, మిస్ట్‌స్ప్రేయర్‌ ఉన్నాయి. అంటే.. ఈ నూనెలో కాసిని నీళ్లు కలిపి ఇంట్లో అక్కడక్కడా చల్లితే సాంబ్రాణి వాసన వస్తుంది. అదే మిస్ట్‌స్ప్రేయర్‌ అయితే  ఇంటి గోడలపైనా, పరదాలపైనా, కుషన్లమీదా... చల్లితే సరిపోతుంది. ఇక, బొగ్గును చిన్న కప్పుగా మార్చి, అందులో సాంబ్రాణిని కూర్చి ఇచ్చేవి తెలుసుగా.. ఇప్పుడు అవీ మునుపటిలా కాకుండా రకరకాల రంగుల్లో ఉంటున్నాయి.
ఆ కప్పులూ విడిగా వస్తున్నాయి. బొగ్గులు, పంచగవ్య, మామిడి చెట్టు నుంచి తీసిన చెక్క... తదితరాలతో తయారుచేసే ఈ కప్పుల్ని తెచ్చుకుంటే సాంబ్రాణి పొడితోపాటు కొద్దిగా కర్పూరం, నచ్చిన అరోమా నూనె... వంటివన్నీ మనమే వేసుకోవచ్చు అన్నమాట. సాంబ్రాణిలో ఇన్ని మార్పులు వచ్చాక... దాన్ని వేసుకునే పాత్రలూ కొత్తగా ఉండాలి కాబట్టి.. అవి కూడా ఇత్తడి, కంచు, ప్లగ్గుల్లో పెట్టుకునే సిరామిక్‌ రకాల్లోనూ మార్కెట్లో ఉన్నాయిప్పుడు. అన్నింటికీ మించి.. ఇవన్నీ కానుకగానూ ఇచ్చేలా కిట్‌ రూపంలోనూ దొరికేస్తున్నాయి. అదండీ సంగతి... ఈసారి సాంబ్రాణి కొనేటప్పుడు వీటిలో మీకేం కావాలో చూసి మరీ ఎంచుకుంటే సరి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..