వాజుల్లోని పూలు... ఆకలేస్తే తినేయొచ్చు! .....

ఇంటిముందు లేదా బాల్కనీలో నాలుగైదు పూల కుండీలు ఏర్పాటు చేసుకున్నా కూడా నట్టింట్లో ఓ వాజూ అందులో కాసిని పూలూ ఉంచితే ఎలా ఉంటుందంటారూ..! అవి కూడా తియతియ్యగా ఉండి నోరూరించేస్తే..!

Published : 10 Mar 2024 00:19 IST

ఇంటిముందు లేదా బాల్కనీలో నాలుగైదు పూల కుండీలు ఏర్పాటు చేసుకున్నా కూడా నట్టింట్లో ఓ వాజూ అందులో కాసిని పూలూ ఉంచితే ఎలా ఉంటుందంటారూ..! అవి కూడా తియతియ్యగా ఉండి నోరూరించేస్తే..! అటుపోతూ రెండూ ఇటువస్తూ రెండూ నాలుగైదు రెక్కల్ని తెంపి నోట్లో వేసుకోమూ అనేస్తారు కదూ...! ఈ పూల వాజులన్నీ అలాంటివే మరి.

ప్రియ తన స్నేహితుల్ని పేరంటానికి పిలిచి తాంబూలంతోపాటూ ఓ పూలవాజునూ చేతికిచ్చింది. అది చూసి స్నేహితులు భలే ఉందంటూ మెచ్చుకుంటుంటే ప్రియ మాత్రం ఆ పూలను తినేయొచ్చు తెలుసా అంటూ అక్కడున్నవారందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే.. ఆ వాజులోని పూలూ, వాటితోపాటు ఉండే ఆకులూ, మొగ్గలూ... అన్నీ చక్కెర, ఇతర పదార్ధాలతో తయారుచేశారు కాబట్టి. పూలకుండీలూ, పూలబొకేల మాదిరి ఈ చక్కెర పూలవాజుల్నీ బహుమతిగా ఇచ్చే వారి సంఖ్య పెరగడంతో... వీటికి డిమాండు ఎక్కువగానే ఉందిప్పుడు. ప్రకృతి ప్రేమికులకు పూల కుండీలనూ, తులసి మొక్కలనూ కానుకలుగా ఇవ్వడం అనేది ఎప్పటినుంచో ఉన్నదే. అయితే అవి కాకుండా పూల వాజులు ఇవ్వాలీ, కానీ అవి వెరైటీగా ఉండాలీ... తీసుకున్నవారూ భలే ఉందంటూ మెచ్చుకుంటూనే ఆశ్చర్యపోవాలీ... అనుకునేవారికి ఇవి చక్కని ఎంపికవుతాయి. నిజానికి షుగర్‌ఫ్లవర్స్‌ను కేకులపైన అలంకరించడం అనేది పాత మాట. కేకుల్లో కొత్తకొత్త వెరైటీలు తీసుకొస్తున్నట్లుగానే ఈ పూలతోనూ ప్రయోగాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న షెఫ్‌లూ, కేకు తయారీ నిపుణులూ... పూలన్నింటినీ వాజుల్లో అందంగా అమర్చి కానుకగా ఇచ్చేసేలా మార్చేయడంతో ఇవి అందరినీ ఆకట్టుకుంటున్నాయి.  

ఎలా తయారుచేస్తారంటే...

కేకులపైన రకరకాల బొమ్మల్ని చేసేందుకు ఫాండంట్‌ను ఉపయోగిస్తారనేది తెలిసిందే కదా... అదేవిధంగా ఈ పువ్వులను తయారుచేసేందుకు ప్రత్యేకంగా గమ్‌పేస్టు లేదా ఫ్లవర్‌ పేస్టు అని దొరుకుతుంది. ఈ పేస్టును కొద్దికొద్దిగా తీసుకుంటూ మొక్కజొన్నపిండీ, నీళ్లు అద్దుకుంటూ రకరకాల ఆకృతుల్లో పూలను తయారుచేస్తారు. ఆ తరువాత ఎడిబుల్‌ రంగుల్ని అద్దడంతో ఆ పూలు అప్పుడే కోసినట్లుగా, సహజంగా కనిపిస్తూ అబ్బురపరుస్తాయి. వాటన్నింటినీ ఓ పద్ధతి ప్రకారం ఎంచుకుంటూ కాడలూ మొగ్గలూ ఆకుల్ని జతచేస్తూ ఫ్లవర్‌వాజుల్లో అమర్చడంలోనే ఉంటుంది అసలైన కళ. అలా తయారుచేస్తున్న పూలల్లో రంగురంగుల గులాబీలూ లిల్లీలూ కలువలూ పొద్దుతిరుగుడు పూలూ చామంతులూ టులిప్‌లూ.... ఇలా అన్నింటినీ మేళవిస్తున్నారు. కొన్నిసార్లు వాజుల్ని కూడా పూల మాదిరి చక్కెర, ఇతర పదార్థాలతోనే రూపొందించడం గమనార్హం. ఇలా తయారుచేసిన వాజుల్ని పార్టీలప్పుడు డైనింగ్‌టేబుల్‌పైన లేదా టీపాయ్‌మీద పెడితే చూడ్డానికే భలే ఉంటుంది. సో... ఈసారి స్నేహితుల పుట్టినరోజు వస్తోందనుకున్నప్పుడు కేకుతోపాటు ఇలాంటి వాజుల్ని తీసుకెళ్లి ఇస్తే ఆనందంతో తబ్బిబ్బవుతారంటే నమ్మండి...!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..