సన్‌స్క్రీన్‌ దుస్తులివి!

కాలు బయటపెడితే చాలు, సూర్యుడి ప్రతాపానికి ఒళ్లంతా భగభగ మండిపోతుంది. ఆ వేడి నుంచి కాపాడుకోవడానికి ముఖంపైనైతే సన్‌స్క్రీన్‌లోషన్‌ లాంటిది రాసుకుంటాం.

Updated : 31 Mar 2024 06:14 IST

కాలు బయటపెడితే చాలు, సూర్యుడి ప్రతాపానికి ఒళ్లంతా భగభగ మండిపోతుంది. ఆ వేడి నుంచి కాపాడుకోవడానికి ముఖంపైనైతే సన్‌స్క్రీన్‌లోషన్‌ లాంటిది రాసుకుంటాం. మరి శరీరమంతటికీ ఆ రక్షణ కావాలంటే...  ఇదిగో అది అందివ్వడానికే వచ్చేశాయి రకరకాల ‘యూవీ ప్రొటెక్టివ్‌ దుస్తులు’!

ఎంత ఎండగా ఉన్నా వేసవి కాలంలో బయటకు వెళ్లకుండా ఉంటామా... ఉక్కతో ప్రాణమంతా ఉక్కిరిబిక్కిరయిపోయినా ప్రయాణాలు చేయకుండా ఉంటామా... చేతనయినన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే రోజూ పనులు చేసుకుంటాం. ఎలాగోలా ఊర్లూగట్రా తిరుగుతుంటాం. అది దృష్టిలో పెట్టుకునే మార్కెట్లోనూ వేసవి కోసం ప్రత్యేకం అంటూ వేడిని తప్పించడానికి బోలెడన్ని వస్తువులూ వస్తుంటాయి. ఇప్పుడు వాటి వరసనే ఆ ఎండల తాకిడిని పక్కకు నెట్టడానికి దుస్తులూ వచ్చాయి. వేసవిలో మెడకు పట్టిన చెమటను తుడుచుకోవడానికి పుట్టుకొచ్చిన స్కార్ఫ్‌, ఇంకా టోపీ, గ్లౌవుజుల్లాంటివి ఎప్పటి నుంచో ఉన్నాయి కదా. మరి ఈ దుస్తుల్లో కొత్తేమిటీ అంటారేమో... ఇవన్నీ కూడా యూపీఎఫ్‌(అల్ట్రావయొలెట్‌ ప్రొటెక్షన్‌ ఫ్యాక్టర్‌) టెక్నాలజీతో ఉండే డ్రెస్సులు మరి. సాధారణంగా సూర్యుడి నుంచి వచ్చే అతినీల లోహిత కిరణాలు నేరుగా చర్మం మీద పడకుండా సన్‌స్క్రీన్‌ లోషన్లు, క్రీములు రాసుకుంటాం. ఈ దుస్తులు కూడా అదే పని చేస్తాయి. మన శరీరానికి యూవీ కిరణాల వల్ల ఏ ఇబ్బంది కలగకుండా అడ్డుకుంటాయి.

రకరకాలు...

పిల్లల నుంచి పెద్దల వరకూ అందరి అవసరాలకూ తగ్గట్టుగా ఈ యూవీ ప్రొటెక్టివ్‌ డ్రెస్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో చొక్కాలూ, టోపీలతో సహా ఉండే సన్‌స్క్రీన్‌ జాకెట్లూ, ప్యాంట్లూ, టీషర్టులూ చాలానే వచ్చాయి. ఇంకా యూపీఎఫ్‌ 50ప్లస్‌ ఉండే సన్‌ షాల్స్‌, యాంటీ యూవీ విమెన్‌ సన్‌స్క్రీన్‌ స్కార్ఫ్స్‌, క్యాప్స్‌, ష్రగ్స్‌, మాస్క్స్‌, గ్లౌజెస్‌... లాంటివెన్నో కూడా రకరకాల సైజుల్లో రంగురంగుల్లో దొరుకుతున్నాయి. అతినీలలోహిత కిరణాల్ని గ్రహించే దారపు పోగులతోనే వీటన్నింటినీ తయారుచేస్తారు. అందుకే వీటిని ధరించినప్పుడు సూర్యుడి నుంచి వచ్చే ప్రమాదకరమైన కాంతి నేరుగా మన శరీరానికి తగలదన్నమాట. హుడీ, జాకెట్‌ లాంటి వాటిల్లో అయితే సన్‌స్క్రీన్‌ ప్రొటెక్షన్‌తో పాటూ కాస్త దళసరిగా ఉండే ఆ దుస్తులు వేసుకున్నప్పుడు ఉక్కగా ఉండకుండా కూలింగ్‌ టెక్నాలజీనీ కలుపుతారట. అందుకే అటు వేడి నుంచి రక్షణనీ చల్లదనాన్నీ కూడా ఇస్తాయి. ఇవన్నీ చూడ్డానికి మామూలు ఫ్యాషన్‌ డ్రెస్సుల్లాగే కనిపించినా... ఎండలోకి వెళ్ళినప్పుడు వీటి ఉపయోగమేంటో అర్థమవుతుంది. సాధారణంగా రెండు గంటల వరకూ మాత్రమే పనిచేసే సన్‌స్క్రీన్‌లోషన్ల కన్నా ఈ దుస్తుల వల్ల మంచి లాభమే ఉంటుంది. మండే ఎండలో స్టైలిష్‌ టోపీ, స్కార్ఫ్‌లకు బదులుగానో... ప్రయాణాల్లో ఎప్పుడూ వేసుకునే చొక్కాల స్థానంలోనో... ఈ యూపీఎఫ్‌ దుస్తుల్ని ట్రై చేసి చూడండి, రెండు రకాలుగా పనిచేస్తాయి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..