పిల్లలకీ ఉన్నాయి... ట్రెడ్‌మిల్‌, డంబెల్స్‌!

అమ్మ సెల్‌ఫోను, నాన్న పెట్టుకునే స్మార్ట్‌వాచీ, అత్త దగ్గరుండే ట్యాబ్‌... ఇలా పెద్దవాళ్లు ఏ వస్తువు వాడుతున్నా తమకూ అలాంటిదే కావాలంటూ పేచీ పెడతారు పిల్లలు.

Published : 06 Apr 2024 23:39 IST

అమ్మ సెల్‌ఫోను, నాన్న పెట్టుకునే స్మార్ట్‌వాచీ, అత్త దగ్గరుండే ట్యాబ్‌... ఇలా పెద్దవాళ్లు ఏ వస్తువు వాడుతున్నా తమకూ అలాంటిదే కావాలంటూ పేచీ పెడతారు పిల్లలు. దాన్ని గుర్తించే పలు సంస్థలు... పిల్లల అవసరాలకు తగినట్లుగా ఆ వస్తువుల్లో జూనియర్‌ వెర్షన్లను తీసుకురావడం మొదలుపెట్టాయి. ఆ జాబితాలో తాజాగా జిమ్‌ పరికరాలూ చేరాయి. పిల్లల వయసునీ, అవసరాలనీ పరిగణించి మరీ డిజైను చేసిన ఈ ఉపకరణాల్లో ఏమేం ఉన్నాయంటే...

‘నేనూ నీలా ట్రెడ్‌మిల్‌పైన నడుస్తా’... ‘నేనూ జిమ్‌కు వస్తా’... ‘నీలా స్ట్రాంగ్‌గా మారాలంటే నేనేం చేయాలి...’ అంటూ ఫిట్‌నెస్‌ విషయంలోనూ అమ్మానాన్నల్ని అనుకరించేస్తుంటారు కొందరు పిల్లలు. అలాంటి చిన్నారులకోసం ఇప్పుడు మినీ జిమ్‌ ఎక్విప్‌మెంట్‌ దొరుకుతోంది. చిన్నారుల్ని ఆకట్టుకునేలా రంగురంగుల్లో ఉండి... వాళ్లకు ఎలాంటి హాని కలగని విధంగా రూపొందించిన ఈ వ్యాయామ పరికరాల్లో ట్రెడ్‌మిల్‌, సైకిల్‌, వెయిట్స్‌, స్టెప్పర్‌, బెంచ్‌, హర్డిల్స్‌.... ఇలా ఎన్నో ఉన్నాయి. పిల్లలకు ఆటలే మంచి వ్యాయామమని అంటారు కానీ ఈ రోజుల్లో వాళ్లు బయటకు వెళ్లి ఆడుకునేది తక్కువ. స్కూలు నుంచి వచ్చాక సెల్‌ఫోన్లతో కాలక్షేపం చేసేవారే ఎక్కువ. అలాంటి చిన్నారుల్ని పొద్దున్నే నిద్రలేపి వాళ్లచేత వాకింగో, రన్నింగో చేయించడం సాధ్యం కాకపోవచ్చు. పోనీ యోగా అలవాటు చేద్దామంటే దగ్గర్లో యోగా కేంద్రం అందుబాటులో ఉండకపోవచ్చు... ఎలా అని ఆలోచించే తల్లిదండ్రులకు ఈ జిమ్‌ పరికరాలు మంచి పరిష్కారాన్ని చూపుతాయి. ఎందుకంటే... చూడ్డానికి చిన్నగా, బొమ్మల మాదిరి కనిపించే ఈ పరికరాలతో పిల్లలు ఓ వైపు సరదాగా గడిపేస్తూనే పనిలో పనిగా వ్యాయామాలూ చేసేస్తారు మరి.

పిల్లలకు తగినట్లుగా...

ఒక్కసారి ట్రెడ్‌మిల్‌పైన ఎక్కి స్టార్ట్‌ బటన్‌ను నొక్కితే చాలు... ఎంత వేగంగా కదులుతుందో తెలిసిందే. అలాగే వెయిట్స్‌ గురించి చెప్పక్కర్లేదు. సైకిల్‌పైన కదలకుండా కూర్చుని తొక్కడం అంటే మాటలు కాదు. ఇవన్నీ పిల్లలతో అయ్యేపనేనా అని తల్లిదండ్రులు భయపడొచ్చు కానీ ఈ వ్యాయామ పరికరాలు పెద్దవాళ్లు ఉపయోగించే వాటిలా కష్టంగా ఉండవు. ఇవన్నీ పిల్లల వయసుకు తగినట్లుగా ఉంటాయి కాబట్టి ఎలాంటి సందేహం లేకుండానే ఎంచుకోవచ్చు.

ఉదాహరణకు ట్రెడ్‌మిల్‌, సైకిల్‌ను తీసుకుంటే.. ఇవి చిన్నగా ఉండి మాన్యువల్‌గా పనిచేస్తూ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వస్తాయి. వాళ్లు ఎంత సమయం నడిచారు లేదా తొక్కారనేది ఆ స్క్రీనుపైన తెలుసుకోవచ్చు. అదే విధంగా అమ్మానాన్నల్లా బరువులు ఎత్తాలని ముచ్చటపడే చిన్నారులకోసం అడ్జెస్టబుల్‌ డంబెల్స్‌, వెయిట్‌లిఫ్టింగ్‌ సెట్స్‌ కూడా దొరుకుతున్నాయి. సాధారణ డంబెల్స్‌లానే కనిపించినా చాలా తక్కువ బరువుతో ఉంటాయివి. పిల్లలు గెంతడాన్నీ ఆనందించేందుకు హర్డిల్స్‌, లాడర్‌, కోన్స్‌... లాంటివీ వస్తున్నాయి. ఇవి కాకుండా ఎత్తు పెంచేందుకు ప్రత్యేక స్టాండ్‌, సరదాగా బాక్సింగ్‌ చేసే కిట్‌, స్టెప్పర్‌... తదితరాలెన్నో ఈ జిమ్‌ పరికరాల్లో దొరుకుతున్నాయి. ఇవి చేస్తూనే సరదాగా యోగా ప్రయత్నించాలనుకునే చిన్నారులకోసం యోగా కిట్‌ కూడా అందుబాటులో ఉంది. వీటన్నింటిపైనా మెత్తని ఫోమ్‌ ఉంటుంది కాబట్టి పిల్లలకు గాయాలవుతాయనే భయం కూడా లేదు. పైగా ఇవన్నీ చిన్నగానే ఉంటాయి గనుక చోటు గురించీ ఆలోచించక్కర్లేదు. ఆలస్యమెందుకు, వీటిల్లో మీ పిల్లలకు ఏం నచ్చాయో చూసేయండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..