పూలు చూస్తే ఐసైపోవాల్సిందే!

రంగు రంగుల పూలను కొన్నిరకాల వంటకాలపైన అలంకరించడం, టీ రూపంలో తాగడం ఎప్పటినుంచో అందరూ చేస్తున్నదే. కానీ ఐస్‌క్రీమ్‌ కోన్లలో కనిపిస్తున్న ఈ పూలన్నీ నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోతాయి.

Published : 07 Apr 2024 00:15 IST

రంగు రంగుల పూలను కొన్నిరకాల వంటకాలపైన అలంకరించడం, టీ రూపంలో తాగడం ఎప్పటినుంచో అందరూ చేస్తున్నదే. కానీ ఐస్‌క్రీమ్‌ కోన్లలో కనిపిస్తున్న ఈ పూలన్నీ నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోతాయి. చల్లగా, హాయిగా అనిపిస్తాయి. ఎందుకంటే... వీటన్నింటినీ ఐస్‌క్రీమ్‌తోనే తయారుచేశారు మరి. ఐస్‌క్రీమ్‌ వెరైటీల్లో కొత్తగా వచ్చేసి ట్రెండుగా మారిన ఈ ఐసుపూల ప్రత్యేకత ఏంటో మనమూ చూసేద్దామా...

స్‌క్రీమ్‌... పిల్లల నుంచి పెద్దలవరకూ ఇష్టపడే ఆహారపదార్థాల్లో ముందుంటుంది. మండే ఎండల్లో ఐస్‌క్రీమ్‌ను తింటున్నప్పుడు... అది గొంతులోకి జారుతూ ఇచ్చే మజానూ, చల్లని థ్రిల్‌నూ వర్ణించేందుకు మాటలు చాలవు కదూ. అందుకే ఐస్‌క్రీమ్‌ అభిమానులు ఎక్కడికి వెళ్లినా ఇందులో వస్తున్న కొత్తరకం వెరైటీల గురించి ఆరా తీస్తుంటారు. అలాంటి వారికోసమే ఐస్‌క్రీమ్‌ను కూడా ఎప్పటికప్పుడు కొత్తకొత్త రుచుల్లోకీ, రూపాల్లోకీ మార్చేస్తూ ప్రయోగాలు చేస్తుంటారు షెఫ్‌లు. అందులో భాగంగా వచ్చినవే ఈ ఐస్‌క్రీమ్‌ పూలు. జపాన్‌లోని ఓ కెఫెలో తయారుచేసిన ఈ ఐసు పూలను చూసి ఆహారప్రేమికులు ఇష్టంగా తినేయడంతోపాటూ సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్‌ చేయడంతో ఇప్పుడివి ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్‌గా మారిపోయాయి. నిజానికి ఎంత తిన్నా తనివి తీరదు అనిపించే పదార్థాల్లో ముందుండే ఐస్‌క్రీమ్‌ ఒకప్పుడు కేవలం వెనిల్లా ఫ్లేవర్‌లో మాత్రమే దొరికేది. రోజులు మారేకొద్దీ రుచితోపాటూ రూపాన్నీ మార్చుకుని నూడుల్స్‌, శాండ్‌విచ్‌, ఫ్రైడ్‌, కుకీస్‌, కేక్‌... ఇలా రకరకాలుగా వచ్చేసి ఆశ్చర్యపరిచింది. కానీ ఫుడీలు ఇతర పదార్థాల మాదిరి ఇందులోనూ కొత్తదనం కోరుకుంటారని అర్థంచేసుకున్న షెఫ్‌లు తాజాగా ఈ ఐసుపూలను తీసుకొచ్చేసి కోన్లలో అందంగా అమర్చి మరీ ఇవ్వడం మొదలుపెట్టారు.

ఎలా చేస్తారంటే..

కేకులపైన రంగురంగుల పూలు ఎలా తయారుచేస్తారో తెలుసుగా. క్రీమ్‌ను బాగా గిలకొట్టి రకరకాల ఫుడ్‌కలర్స్‌ను కలిపి ప్రత్యేక నాజిల్‌ ఉండే కోన్‌లో నింపి కేకులపైన ఆవిష్కరిస్తారు. ఈ ఐస్‌క్రీమ్‌ పూలనూ అలాగే చేస్తారు కానీ ఇందులో అచ్చంగా ఐస్‌క్రీమే ఉంటుంది. ఎలాగంటే...ఈ పూల తయారీ కోసం రాజ్మా తరహాలో ఉండే ప్రత్యేకమైన రెడ్‌బీన్స్‌ను ఎంచుకుంటారు. వాటిని ఉడికించి అదనంగా చక్కెర కలిపి చిక్కని పేస్టులా మారుస్తారు. చిలగడదుంప రుచిని పోలిన ఈ మిశ్రమానికి వెనిల్లా ఐస్‌క్రీమ్‌ను కలిపి ఇలా పూలను తయారుచేస్తారు. కావాలనుకున్న పూలను బట్టి ఐస్‌క్రీమ్‌లో రకరకాల ఫుడ్‌కలర్స్‌ను కలుపుతూ రంగురంగుల గులాబీలూ, చిట్టిచేమంతులూ, పొద్దుతిరుగుడు పూలూ... ఆకులూ తదితరాలను డిజైను చేసేస్తున్నారు. అదండీ సంగతి.. ఐస్‌క్రీమ్‌ ఫ్లవర్స్‌గా, ఐస్‌బొకేగా పిలిచే ఈ ఐసుపూల ట్రెండు కావడానికి జపాన్‌లో ప్రారంభమైనా ఒక్కో దేశాన్నీ చుట్టేస్తూ ఇప్పుడిప్పుడే మన దగ్గరా అడుగుపెట్టింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..