కిటికీలు లేవు... కర్టెన్లే!

దూరం నుంచి చూస్తే ఒకలా... దగ్గరకు వెళ్తే మరోలా కనిపిస్తాయివి. ప్రకృతి అందాలతో వచ్చేస్తూనే ఆకట్టుకుంటాయి. ‘అరె భలే ఉన్నాయే’ అంటూ ఇంటికొచ్చినవారిని ఆశ్చర్యపరుస్తాయి కూడానూ.

Updated : 28 Apr 2024 07:05 IST

దూరం నుంచి చూస్తే ఒకలా... దగ్గరకు వెళ్తే మరోలా కనిపిస్తాయివి. ప్రకృతి అందాలతో వచ్చేస్తూనే ఆకట్టుకుంటాయి. ‘అరె భలే ఉన్నాయే’ అంటూ ఇంటికొచ్చినవారిని ఆశ్చర్యపరుస్తాయి కూడానూ. ఈ ఉపోద్ఘాతమంతా ఇప్పుడు కొత్తగా వచ్చేస్తున్న ‘ల్యాండ్‌స్కేప్‌ బ్లాక్‌అవుట్‌ కర్టెన్స్‌త్రూ ద విండోస్‌’ గురించే. అంటే... కిటికీల డిజైనులో ఉండే పరదాలన్నమాట. ఇంటికి కొత్తలుక్‌ను తెస్తూనే లేనిది ఉన్నట్లుగా ఉన్నది లేనట్లుగా మాయచేసే ఈ కర్టెన్ల కథ ఏంటో చూసేద్దామా...

కిటికీలకు వేలాడదీసే కర్టెన్లదేముందీ... కాస్త కొత్త డిజైనూ, రంగూ చూసి ఎంచుకుంటే సరిపోతుందని ఎవరూ అనుకోవడంలేదిప్పుడు. సీజన్‌ను బట్టి వాటినీ మార్చేస్తున్నారు. ఇక, పండుగలకూ ప్రత్యేక వేడుకలకూ మెరిసిపోయేలా గ్లిట్టర్‌ అనీ, షీర్‌ అనీ, సిల్క్‌ అనీ.. ప్రత్యేకమైన వాటిని ఎంచుకునేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. మొత్తంగా సందర్భాన్ని బట్టి ఎప్పటికప్పుడు వీటిల్లోనూ కొత్తవి ఉండేలా చూసుకుంటున్నవారే ఎక్కువ. వినియోగదారుల అభిరుచుల్నీ, ఆసక్తుల్నీ గుర్తించి నిపుణులూ ఎప్పటికప్పుడు పరదాల డిజైన్లలోనూ ప్రయోగాలు చేస్తున్నారు. ఆ ప్రయోగాల్లో భాగంగా తాజాగా తీసుకొచ్చినవే ఈ మాయా పరదాలు. ‘ల్యాండ్‌స్కేప్‌ బ్లాక్‌అవుట్‌ కర్టెన్స్‌ త్రూ ద విండోస్‌’ పేరుతో వచ్చేస్తున్న ఇవి దూరం నుంచి చూసినవాళ్లకు కిటికీల్లా కనిపిస్తాయి. కానీ నిజానికి కర్టెన్లే. పరదాల్లో కొత్తగా వచ్చేస్తున్న ఈ మోడళ్లకు ప్రకృతి అందాలు కూడా తోడవడంతో... ఇప్పుడు ఎక్కువమంది వీటిని ఎంచుకునేందుకు ఇష్టపడుతున్నారు.

ఆకట్టుకునే డిజైన్లలో...

పరదాలపైన ప్రకృతి అందాలు ఉండి.. అవి త్రీడీలుక్‌తో రావడం అనేది ఎప్పటినుంచో ఉన్నదే. అయితే... ఆ పరదాలకే కిటికీ డిజైన్‌నూ జతచేయడంతో వీటిని మొదటిసారి చూసినవాళ్లెవరైనా ఇది కిటికీనా లేదా పరదానా అంటూ ఒక్కక్షణం సందేహించడం ఖాయం. నాణ్యమైన పాలిస్టర్‌ ఫ్యాబ్రిక్‌తో డిజైను చేసిన ఈ పరదాలకు కిటికీ లుక్‌ను తెచ్చేందుకు అక్కడక్కడా కాస్త మందంగా ఉండే వస్త్రాన్ని ఎంచుకుంటారట. ప్యానెళ్ల తరహాలో కనిపించే ఈ కర్టెన్లు ఎండనూ, అతినీలలోహిత కిరణాలనూ దాదాపు ఎనభైశాతం ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటాయని అంటున్నారు తయారీదారులు. ముడతలు పడకుండా ఉండేలా, ఎక్కువకాలం మన్నేవిధంగా రూపొందించిన వీటిని చల్లని నీటిలో బ్లీచ్‌ వాడకుండా ఉతికితే సరిపోతుంది. ఇన్ని జాగ్రత్తలు తీసుకుని ఆవిష్కరించిన ఈ కర్టెన్లు... జాలువారే జలపాతాలతో, వసంతాన్ని తలపించే పూల చెట్లతో, కురిసీ కురియనట్లుగా కనిపించే మంచు చిత్రాలతో, మిరుమిట్లు గొలిపే లైట్ల ప్రత్యేకతలతో, అడవి అందాలతో... ఇలా ఒకటేమిటి, కోరుకున్న ప్రకృతి డిజైన్లతో వచ్చేస్తూ కనికట్టు చేస్తున్నాయి. మరి... వీటిల్లో మీ ఇంటికి ఎలాంటి కిటికీలు.. కాదుకాదు... పరదాలు నప్పుతాయో చూసి ఎంచుకోండి.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..