‘పట్టాభి’ రాముడు
‘రాజకీయమా... అది మీలాంటి బోళా మనిషికి అచ్చిరాదు’. ‘అదో ఊబి... మిమ్మల్ని బతకనివ్వదు...’ అంటూ అందరూ సలహాలిచ్చేవాళ్లే. హాయిగా సినిమాలు చేసుకోక ఎందుకొచ్చిన తలనొప్పని హెచ్చరించేవాళ్లే.
‘రాజకీయమా... అది మీలాంటి బోళా మనిషికి అచ్చిరాదు’.
‘అదో ఊబి... మిమ్మల్ని బతకనివ్వదు...’ అంటూ అందరూ సలహాలిచ్చేవాళ్లే. హాయిగా సినిమాలు చేసుకోక ఎందుకొచ్చిన తలనొప్పని హెచ్చరించేవాళ్లే. ఆఖరికి స్నేహితుడు ఏఎన్నార్, భార్య బసవ తారకం కూడా... కానీ ఇక్కడున్నది ఎవరు..?
రాముడిగా కృష్ణుడిగా అభిమానుల్ని అలరించిన స్ఫురద్రూపి. ఎంత అందగాడో అంత మొండివాడు. ఎందరు వద్దన్నా ముందుకే అడుగేశాడు. అనుకున్నది చేసి చూపించాడు. మూడు దఫాలు.. ఏడున్నరేళ్లకు పైగా సాగిన ఆ పాలనలో అన్నీ సాహసోపేత నిర్ణయాలే... అన్నీ సంచలనాలే!
హేతుబద్ధంగా ఆలోచించే వ్యక్తి... పరిస్థితులకు తగినట్లుగా తనను తాను మలచుకుంటాడు. హేతు విరుద్ధంగా ఆలోచించే వ్యక్తి ప్రపంచాన్ని తన దారిలోకి తెచ్చుకోవాలనుకుంటాడు. అందుకే అభివృద్ధి అంతా అలాంటి మనుషుల వల్లే జరుగుతుంది... అంటాడు జార్జ్ బెర్నార్డ్ షా.
ఎన్టీఆర్‌కి సరిగ్గా సరిపోయే మాటలివి. రాజకీయాల గురించి ఏ మాత్రం తెలియని వ్యక్తి, ఎన్నడూ వార్తాపత్రికలు చదవని వ్యక్తి- రాజకీయాల్లోకి వచ్చారు. పతాక శీర్షికలకు ఎక్కారు. అప్పటివరకూ కనీవినీ ఎరగని పథకాలను ప్రవేశపెట్టారు. ఇప్పుడు రాష్ట్రాల్లో, దేశంలో అమలులో ఉన్న ఎన్నో పథకాలకు మూలం ఆయన పాలనలోనే ఉంది మరి!
బాక్సాఫీసు రికార్డులను తిరగరాసే వరస హిట్లతో దూసుకుపోతున్న కథానాయకుడికి అసలు రాజకీయాల్లోకి వచ్చి మహానాయకుడి పాత్రలో జీవించాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందీ... అదీ అరవయ్యేళ్ల వయసులో..!
సరే వచ్చారు... అభిమాన నటుడన్న ప్రేమతో, బతుకుల్లో మార్పు తెస్తాడన్న ఆశతో ప్రజలూ గెలిపించారు. హాయిగా ముఖ్యమంత్రి పదవినీ పదవితోపాటూ వచ్చే హంగూ ఆర్భాటాల్నీ అనుభవించక- ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయమంటూ వారికోసం లెక్కకు మిక్కిలి సంక్షేమ పథకాలను ప్రకటించడమెందుకు... పార్టీలన్నిటినీ కూడగట్టి, కేంద్రానికి పక్కలో బల్లెంగా మారడం ఎందుకు..?
ఎందుకంటే... ఆయన ఎన్టీఆర్ కాబట్టి..!
సినీనటుడిగా మూడు దశాబ్దాలపాటు మద్రాసులో నివసించిన ఎన్టీఆర్ సహ నటుడు ఎంజీఆర్ రాజకీయ నాయకుడిగా రాణించడాన్ని దగ్గరగా చూశారు.
అదే సమయంలో అస్తవ్యస్తంగా ఉన్న తెలుగు రాష్ట్ర రాజకీయాల్నీ ఏడాదికో ముఖ్యమంత్రి మారడాన్నీ గమనించారు.
ఎక్కడికి వెళ్లినా మదరాసీలనేవారే తప్ప తెలుగువారిగా గుర్తించని వాస్తవాన్నీ గ్రహించారు.
కరవూ వరదలూ వచ్చినప్పుడు చేయూతనందించడానికి వెళ్లిన వేళ నిరుపేదల నిస్సహాయ స్థితిగతుల్నీ పరిశీలించారు.
మరోపక్క... పైన పడుతున్న వయసు సంపాదించింది ఇక చాలంటోంది. తానంటే ప్రాణమిచ్చే అభిమానుల కోసం ఏమైనా చేయాలని మనసు లాగుతోంది. అందుకు ఏం చేయాలన్న స్పష్టత కోసం సన్నిహితులతో మాట్లాడుతూనే ఉన్నారు. ముఖ్యంగా రచయిత మహారథితో ప్రాంతీయపార్టీ ఏర్పాటు గురించి చాలాసార్లు చర్చించారట. 1981లో ఓరోజు ఉదయం సన్నిహితులూ అనుభవజ్ఞులూ అయిన ఎం.ఎల్.గురప్పచౌదరి, కొసరాజు రాఘవయ్యల ముందు మనసు విప్పారు ఎన్టీఆర్. మోక్షసాధనా, ప్రజాసేవా... ఎటు మొగ్గాలో తేల్చుకోలేకపోతున్నానన్నారు. హేతువాది అయిన కొసరాజు ‘మోక్షసాధన అనేది పలాయనవాదం. ప్రజాసేవే మీకు సరైన మార్గం, రాజకీయాల్లో చేరండి’ అని సలహా ఇవ్వడమే కాక, జనాకర్షణలో ఎన్టీఆర్‌కి సాటిరాగల మరో వ్యక్తి లేరనీ చెప్పారట.
ఇలా అందరితో చర్చించేవారే కానీ తన మనసులోని అభిప్రాయం మాత్రం చెప్పేవారు కాదు ఎన్టీఆర్. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి ఆయన. ఎంత ఎత్తుకు ఎదిగినా సాధారణ మధ్యతరగతి మనిషిలానే జీవించారు తప్ప నేల విడిచి సాము చేయలేదు. దురలవాట్లు లేవు. క్రమశిక్షణా, దేనికీ భయపడని స్వభావమూ, మాట తప్పని మంచి మనసూ ఆయన సొంతం. దూకుడు స్వభావం ఉన్నట్లు కన్పించేవారు కానీ చాలా లోతుగా ఆలోచించేవారనీ, సన్నిహితులతో చర్చించాకే నిర్ణయం తీసుకునేవారనీ... అంటారు ఆయనతో కలిసి పనిచేసినవారు. అలా కొన్నేళ్ల అంతర్మథనం అనంతరం సర్దార్ పాపారాయుడు షూటింగ్ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రెస్‌మీట్‌లో తన అరవయ్యో పుట్టినరోజు (1982 మే 28) నుంచి నెలకు 15 రోజులు ప్రజాసేవకు అంకితం చేయాలను కుంటున్నట్లు ప్రకటించారు. అయినా ఎవరూ ఆయన రాజకీయాల్లోకి వస్తారనుకోలేదు. మహనీయుల జీవిత చరిత్రల్ని సినిమాలు తీస్తారనీ, ఇంకేవో కొత్త బాధ్యతలు చేపడతారనీ... ఎవరికి తోచినట్లు వారు ఊహించుకున్నారు. నెల్లూరుకు చెందిన ‘జమీన్ రైతు’ పత్రిక ఒక్కటే ‘ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నారా’ అని రాసింది. షూటింగ్ పూర్తిచేసుకుని మద్రాసు వచ్చేసరికి ఆయన రాజకీయాల్లోకి రావాలని కోరుతూ అభిమానులు రాసిన మూడు బస్తాల ఉత్తరాలు ఎదురు చూస్తున్నాయి. ఆ ఉత్తరాలన్నిటినీ ఆయన చదివారు. ఆ అభిమానానికి కదిలిపోయారు. ఇక ఆయన తన పుట్టినరోజు వరకూ ఆగదలచుకోలేదు.
ప్రజల కోసం... ప్రజల్లోకి...
తన జీవితంలో పలు మేలి మలుపులకు మూలమైన మార్చి 29నే రాజకీయ పార్టీ ప్రకటనకూ ఎంచుకున్నారు ఎన్టీఆర్. అంతకన్నా ముందు ఏం జరిగిందంటే- స్నేహితుడైన భవనం వెంకట్రామ్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి అతిథిగా హాజరైన ఎన్టీఆర్‌కి నాదెండ్ల భాస్కరరావు పరిచయమయ్యారు. ఆ తర్వాత వేగంగా మారిన పరిణామాల వల్ల కాంగ్రెస్‌ని వదిలి ప్రాంతీయ పార్టీ పెట్టాలని ఆలోచిస్తున్న నాదెండ్లకు ఎన్టీఆర్ పరిచయంతో వెతుకుతున్న తీగ కాలికి తగిలినట్లయింది. నాదెండ్ల లాంటి అనుభవజ్ఞుడు తనకి అవసరమని ఎన్టీఆర్ ఆలోచిస్తే- ఎన్టీఆర్ లాంటి జనాకర్షకనేత కొత్త పార్టీకి అవసరమని నాదెండ్ల భావించారు. అలా ఇద్దరూ తరచూ ఫోనులో మాట్లాడుకునేవారు. మార్చి 29న ఎన్టీఆర్ రాకకోసం హైదరాబాద్ విమానాశ్రయ ప్రాంతమంతా అభిమానులతో నిండిపోయింది. ఆయన్ని పూలదండలతో ముంచెత్తి కేరింతలు కొట్టారు. పైకప్పులేని కారులో ఊరేగింపుగా బయల్దేరి ఏడు కి.మీ.దూరంలో ఉన్న నాదెండ్ల ఇంటికి చేరడానికి రామారావుకి మూడు గంటలు పట్టింది. ఆరోజు అక్కడ జరిగిన సారథ్య సంఘం సమావేశంలో ఎన్టీఆర్‌ని పార్టీ అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. అదే రోజు మధ్యాహ్నం ఎమ్మెల్యే క్వార్టర్స్ ఆవరణలో వేలాదిగా గుమికూడిన అభిమానుల మధ్య ఎన్టీఆర్ ఉద్వేగంగా ప్రసంగించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని రక్షించేందుకూ, పేదలకు సేవ చేసేందుకూ వచ్చానన్నారు. తాను తెలుగువాడిననీ, తనది తెలుగుదేశం పార్టీ అనీ ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ఇక, అప్పటినుంచి రాష్ట్రంలో అదే పెద్ద చర్చనీయాంశం అయింది. ఏప్రిల్ 11న నిజాం కాలేజీ మైదానంలో జరిగిన తొలి బహిరంగ సభకి జనం పోటెత్తారు. ఆ ప్రసంగంలో నినదించిన ‘తెలుగువారి ఆత్మగౌరవం’ పార్టీకి ప్రచారాస్త్రంగా మారింది.
రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లోనూ బహిరంగ సభలు నిర్వహించాక అక్కడితో ఆపలేదు ఎన్టీఆర్. తనను ప్రజలు సినిమా హీరోగా కాక రాజకీయ నాయకుడిగా గుర్తించాలంటే రాష్ట్రమంతా విస్తృతంగా పర్యటించాలని చైతన్యరథాన్ని సిద్ధం చేసుకుని రాష్ట్ర పర్యటన చేపట్టారు. పేదలకు బియ్యం, ఇళ్లు, పిల్లలకు మధ్యాహ్నభోజనం, నిరుద్యోగ భృతి లాంటి ఆయన హామీలపై ఎన్నో విమర్శలు ఎదురయ్యాయి. ఆ పథకాలకు వేలకోట్లు ఎక్కడినుంచి తెస్తారని ఎద్దేవా చేసింది కాంగ్రెస్. ఓపక్క విమర్శిస్తూనే అవి తమ పథకాలే అని చెప్పుకోడానికి నాటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి చౌకబియ్యం, మధ్యాహ్న భోజన పథకాలను హడావుడిగా ప్రారంభించేశారు. అది చూసి ఎన్నికలకు వెళ్లకముందే ఎన్టీఆర్ గెలిచారని ప్రజలు చెప్పుకున్నారు. ఆ పథకాల అమలు క్రెడిట్‌ని ఎన్టీఆర్ ఖాతాలోకే వేశారు.
ఏళ్ల తరబడి ఏ విశేషమూ లేకుండా చప్పగా సాగుతున్న రాజకీయాలకు ఎన్టీఆర్ రాకతో భావోద్వేగాలు వచ్చిచేరాయి. అంత తక్కువ సమయంలో అంత విస్తృతంగా రాష్ట్రమంతటా ఎన్టీఆర్ ప్రయాణించినట్లు అంతకు ముందూ ఆ తర్వాతా మరెవరూ తిరగలేదు. గంటల తరబడి వేచిచూసి ఆయన ప్రసంగం విని వెళ్లిన ప్రజలు తర్వాత వారం రోజులు దాని గురించే ముచ్చటించుకునేవారు. ఆయన దూకుడుకు కళ్లెం వేయాలనుకున్న కాంగ్రెస్ హఠాత్తుగా ఎన్నికలు ప్రకటించింది.
యువతకు ప్రాధాన్యం
తెలుగుదేశం కొత్తగా పెట్టిన పార్టీ. డబ్బుల్లేవు. రామకృష్ణా స్టూడియోలోనే పార్టీ కార్యాలయం నడుస్తోంది. అభ్యర్థుల ఎంపికలో కొత్తవారికీ యువతకూ ప్రాధాన్యం ఇచ్చారు ఎన్టీఆర్. అభ్యర్థులందరికీ ప్రచారానికి గాను- ఎన్టీఆర్‌తో దిగిన ఫొటో, పార్టీ పాటలూ ఎన్టీఆర్ ప్రసంగాలతో క్యాసెట్లూ, కరపత్రాలూ ఇచ్చారు. అభ్యర్థుల ఎంపిక పూర్తికాగానే డిసెంబరులో ప్రచారానికి బయల్దేరారు ఎన్టీఆర్. ఆయన సభలకు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చేవారు. లారీలూ అన్నం పొట్లాలూ లేవు. కుమారుడి పెళ్లికి కూడా వెళ్లకుండా ఎన్టీఆర్ రోజుల తరబడి ఏకబిగిన ప్రచారం చేశారు. ఆయన సినిమా నటుడు కాబట్టి చూడటానికి జనం వస్తున్నారనీ ఓట్లు మాత్రం తమకే పడతాయనీ కాంగ్రెస్ భావించేది. ఎన్నికల ఫలితాలను అంచనా వేయడానికి వచ్చిన నిపుణులు కూడా తెలుగుదేశానికి వంద సీట్లు రావచ్చనీ గెలుపు కాంగ్రెస్‌దేననీ అన్నారు. అందరి అంచనాలనూ తలకిందులు చేస్తూ ఎందరో కాంగ్రెస్ దిగ్గజాలను పరాజయం పాలు చేస్తూ 202 స్థానాలు గెల్చుకుంది తెలుగుదేశం. పార్టీ ప్రారంభించిన తొమ్మిది నెలల్లోనే మూడున్నర దశాబ్దాల పాటు ఓటమి ఎరుగకుండా కొనసాగిన కాంగ్రెస్‌ని మట్టికరిపించింది. దిల్లీ పీఠం తెలుగువారిని బాగా గుర్తుంచుకునే విధంగా పాఠం చెప్పింది.
సంస్కరణ పథం
సినిమాల్లో రైతుగా, సంస్కర్తగా, ఉద్యమకారుడిగా ఎన్టీఆర్ ఎన్నో పాత్రలు చేశారు. అధికారంలోకి వచ్చాక ఆ స్ఫూర్తిని నిజజీవితంలోనూ కొనసాగించారు. తెలుగుదేశం ఒక పార్టీ కాదు, సాంఘిక విప్లవం తేవడానికి ఉద్దేశించిన ఉద్యమం- అని నినదించిన ఎన్టీఆర్, అదే మాట మీద నిలిచారు. ఆయన పాలన అంతా సంస్కరణ పథంలోనే సాగింది. ఆరోజుల్లో ముఖ్యమంత్రులు కానీ పాలనాయంత్రాంగం కానీ సమయపాలన పాటించేవారు కాదు. ఎన్టీఆర్ ఎప్పటిలాగే పొద్దున్నే లేచి ఆరింటికే సమావేశాలు మొదలెట్టేవారు. దాంతో మొత్తంగా పాలనావ్యవస్థ గాడినపడింది. సచివాలయంలోకి సందర్శకుల ప్రవేశంపై ఆంక్షలు విధించారు. ఎక్కడా మధ్యవర్తులకు అవకాశం ఇవ్వలేదు. పాలన పారదర్శకంగా ఉండేది. ఫైళ్లు వేగంగా కదిలేవి.
దిల్లీ వెళ్లిన ఎన్టీఆర్ అక్కడి పత్రికా సంపాదకులు, మేధావులను తేనీటి విందుకు ఆహ్వానించి తనకు రాజకీయాలు కొత్త కాబట్టి సలహాలూ సూచనలూ ఇవ్వాల్సిందిగా కోరారు. ఒక రాజకీయ నాయకుడి నుంచి ఊహించని ఈ మాటలు వారికెంతగానో నచ్చాయి. మనఃపూర్వకంగా మంచి సూచనలిచ్చారు. రాష్ట్రంలోనూ ఆయా రంగాల్లో నిపుణులను ప్రభుత్వానికి సలహాదార్లుగా నియమించుకున్నారు.
నామినేటెడ్ పదవుల్నీ, పటేల్ పట్వారీ, మున్సబు కరణాల వ్యవస్థల్నీ ఎన్టీఆర్ రద్దు చేశారు. ఇలాంటి సంస్కరణల వల్ల పార్టీ ప్రతిష్ఠకు భంగం వాటిల్లుతుందని కొందరు హెచ్చరించినా ఆయన వినలేదు. పార్టీ మేలుకన్నా ప్రజల మేలు ముఖ్యమనేవారు. ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీసును నిషేధించారు. కళాశాలల్లో క్యాపిటేషను ఫీజును రద్దు చేశారు. తండ్రి ఆస్తిలో ఆడపిల్లలకూ సమాన వాటా ఉండాలని 1985లోనే చట్టం చేశారు. ఆ తర్వాత ఇరవై ఏళ్లకు కేంద్రం హిందూ వారసత్వ చట్టానికి సవరణ తెచ్చింది. నిస్సహాయ మహిళలూ పిల్లలకు ఆశ్రయం కల్పిస్తూనే స్వావలంబనకీ తోడ్పడేలా తెలుగు బాల, మహిళా ప్రగతి ప్రాంగణాలను ఏర్పాటుచేశారు. జోగినీ దురాచారాన్ని రద్దు చేశారు. పాలనను ప్రజల ముంగిటికి తేవాలని మండల వ్యవస్థను ప్రారంభించారు.
తెలుగుగంగతో చెన్నైకి తాగునీరూ రాయలసీమ జిల్లాలకు సాగునీరూ అందించారు. గాలేరు-నగరి గ్రావిటీ కెనాల్ ప్రాజెక్టు, హంద్రీ-నీవా సుజల స్రవంతి, వంశధార, శ్రీరామ్‌సాగర్ ఫేజ్-2 వంటి పలు సాగునీటి ప్రాజెక్టులు ఆయన చలవే. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన కొద్దిరోజులకే హైదరాబాదులో మత కల్లోలాల్ని అణచివేశారు.
ఊహించని సంక్షోభం
వందలాది పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో నటించిన ఈ జగద్విఖ్యాత నటుడికి జీవితంలో నటించడం అసలు తెలీదు. ముక్కుసూటిగా వెళ్లేవారు. అందుకే ఆయన రాజకీయ జీవితం అంతా ఒడుదొడుకులమయంగానే సాగింది. ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నామన్న ఆనందం అసమ్మతివాదుల ఆందోళనలవల్ల క్షణాల్లో ఆవిరైపోయేది. దానికి తోడు సొంతపార్టీలోనే అసమ్మతి వర్గం తయారై ఆయనకి మనశ్శాంతి లేకుండా చేసింది. ముఖ్యమంత్రి అయిన ఏడాదిన్నరకి గుండె శస్త్రచికిత్సకు అమెరికా వెళ్లి రాగానే కాంగ్రెస్ మద్దతుతో నాదెండ్ల భాస్కరరావు చేసిన కుట్ర కారణంగా గద్దెదిగాల్సి వచ్చింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అన్యాయంగా కూల్చేయడాన్ని ఎన్టీఆర్‌తో పాటు ప్రజలూ తట్టుకోలేకపోయారు. ఆందోళనలతో రాష్ట్రం అట్టుడికింది. ఎన్టీఆర్‌కి మద్దతుగా ప్రజలు రోడ్డెక్కి ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమం చేశారు. దాంతో ఉక్కిరిబిక్కిరైన ప్రధాని ఇందిరాగాంధీ గవర్నర్‌ని మార్చేసి నెల రోజుల్లోనే మళ్లీ ఎన్టీఆర్‌కి పట్టం గట్టారు.
ఆ సంక్షోభం నుంచి గట్టెక్కినా ఎన్టీ రామారావుకి మనశ్శాంతి లేదు. తన వెంట ఉన్నందుకు ప్రతిఫలాన్ని ఆశిస్తున్న కొందరు ఎమ్మెల్యేల ప్రవర్తన ఆయనకు చికాకు తెప్పించింది. పార్టీ ప్రతిష్ఠను కాపాడుకోవాలంటే శాసనసభను రద్దు చేసి తాజాగా ఎన్నికలకు వెళ్లడమే పరిష్కారమనుకున్నారు. అయితే అదే సమయంలో ఇందిరాగాంధీ హత్య జరిగింది. ఆ వెంటనే లోక్‌సభ ఎన్నికలు వచ్చాయి. వాటితో పాటు శాసనసభ ఎన్నికలకూ వెళ్తే సానుభూతి పవనాలు కాంగ్రెస్‌కి అనుకూలంగా వీచే అవకాశముంది. అందుకని ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరించారు.
లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక నవంబరు23న అసెంబ్లీని రద్దు చేశారు. డిసెంబరులో లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఇందిర హత్య కారణంగా దేశమంతా కాంగ్రెస్‌కి సానుభూతి పవనాలు వీస్తే రాష్ట్రంలో తెలుగుదేశం గెలిచింది. కాంగ్రెస్ హేమాహేమీలందరినీ ఓడిస్తూ 30 స్థానాలు గెలుచుకుని లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించిన తొలి ప్రాంతీయ పార్టీ అయింది. అసెంబ్లీని రద్దు చేసినందుకు ప్రతిపక్షాల విమర్శల్ని పట్టించుకోలేదు.
చేజేతులా పదవిని వదులుకున్నందుకు బాధపడలేదు. అప్పటికే ప్రవేశపెట్టిన పథకాలు ఆయన్ని సమాజంలోని అట్టడుగు వర్గాలకు ఆప్తుణ్ణి చేశాయి. రాజకీయాల్లో విలువల్ని కాపాడడానికి పదవిని వదులుకున్నారన్న సానుభూతి సామాన్య ప్రజానీకంలో నెలకొంది. మార్చిలో జరిగిన శాసనసభ మధ్యంతర ఎన్నికల్లో అవకాశవాద రాజకీయాలకు పాల్పడిన మూడోవంతు సిట్టింగ్ శాసనసభ్యులకు సీట్లు ఇవ్వకుండా యువకుల్ని బరిలో దింపారు. 202 స్థానాలతో ఘనవిజయం సాధించి మూడేళ్లలోనే మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఎన్టీఆర్.
జాతీయ స్థాయిలో
అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఎన్టీఆర్ కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ప్రతిపక్ష పార్టీలన్నిటినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు చొరవ చూపారు. కేంద్రం అధికారాలూ నిధులను తన గుప్పిట్లో పెట్టుకుని రాష్ట్రాల్ని ఇబ్బంది పెట్టడాన్ని ఎన్టీఆర్ తీవ్రంగా వ్యతిరేకించారు. కేంద్రం మిథ్య అనీ, గవర్నర్లు కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లనీ వ్యాఖ్యానించారు. ప్రధాని ఇందిర అధ్యక్షతన జరిగిన జాతీయ అభివృద్ధి సలహా మండలి సమావేశంలో జమ్ముకశ్మీర్‌లో ఫరూక్ అబ్దుల్లా ప్రభుత్వాన్ని రద్దు చేయడాన్ని ఖండిస్తూ నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తరఫున ప్రకటనను ఎన్టీఆర్ చదివి వినిపించడం సంచలనం సృష్టించింది. 1988లో విజయవాడలో జరిగిన మహానాడులో వివిధ పార్టీలకు చెందిన 23మంది నాయకులను ఒకే వేదిక మీదికి తెచ్చారు. వర్షాన్ని కూడా లెక్కచేయకుండా ఐదు లక్షలమంది జనం ఆ సభకు హాజరయ్యారు. భిన్న ధృవాలైన భాజపా, వామపక్షాల్ని ఒకే వేదికమీదికి తేగలిగిన ఎన్టీఆర్ జనతాపార్టీ, లోక్‌దళ్, డీఎంకే తదితర పార్టీలన్నిటినీ కలుపుకుని 1988లో నేషనల్ ఫ్రంట్‌ను ఏర్పాటుచేశారు. దాని ఛైర్మన్‌గా ఆయన చురుకైన పాత్ర పోషించబట్టే 1989లో కేంద్రంలో నేషనల్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చింది.
సిద్ధాంతాలకు కట్టుబడి...
ఏమాత్రం రాజకీయ అనుభవం లేకపోయినా సిద్ధాంతాలపరంగా పార్టీకి పటిష్ఠమైన పునాదుల్ని నిర్మించిన ఘనత ఎన్టీఆర్‌దే. ఎవరైనా తమ పార్టీలో చేరాలంటే పూర్వ పార్టీకీ పదవులకీ రాజీనామా చేసి రావాలన్న నియమం పెట్టారు. అలాగే తన పార్టీలో శాసనసభ్యులుగా పోటీ చేసేవాళ్ల చేత భవిష్యత్తులో పార్టీ మారితే శాసన సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ప్రమాణం చేయించాకే టికెట్లు ఇచ్చారు. వ్యక్తికన్నా పార్టీకే ప్రాధాన్యమిచ్చేవారు. క్రమశిక్షణ విషయంలో ఏమాత్రం రాజీపడేవారు కాదు. కార్యకర్తలు పార్టీ పట్ల అంకితభావంతో ఉండాలనేవారు. అధికార దుర్వినియోగాన్ని సహించేవారు కాదు. రాజకీయ నిరుద్యోగులకు పదవుల పందేరం చేయలేదు. నిజాయతీ, చిత్తశుద్ధి, సమర్థత... ఈ మూడే చూసేవారు.
ఏ రంగంలో నిపుణుల్ని ఆ రంగంలో ప్రాధాన్యం ఉన్న పదవుల్లో నియమించేవారు. పదిహేను రోజులకోసారి కేబినెట్ సమావేశాలు నిర్వహించేవారు. అందరి అభిప్రాయాలూ తీసుకునేవారు. ఎమ్మెల్యేలతోనూ నెలకోసారి మాట్లాడే ప్రయత్నం చేసేవారు. జిల్లాల పర్యటనకు వెళ్లినప్పుడు ఎలాంటి హడావుడీ లేకుండా చెట్ల కిందే మీటింగులు పెట్టేవారు. దాంతో మంత్రులూ శాసనసభ్యులూ కలెక్టర్లూ అక్కడికే వెళ్లి కలిసేవారు. ఏసీ గదుల్లోకన్నా ప్రజల మధ్య ఉండడానికే ఇష్టపడేవారు.
బడుగు ప్రజల ఆత్మబంధువు
సామాన్యులంటే ఎన్టీఆర్‌కి ఎనలేని ప్రేమ. అభ్యర్థుల ఎంపికలోనే తొలిసారిగా వెనకబడిన తరగతుల వారికి పెద్దపీట వేశారు. ఆయన ప్రవేశపెట్టిన పథకాలన్నీ ఆర్థిక ప్రాతిపదికపై రూపొందించినవే. వాటివల్ల ప్రయోజనం పొందేవారంతా బడుగు బలహీన వర్గాలవారు కావడంతో వారికి ఆయన ఆత్మబంధువయ్యారు. రాష్ట్రంలో పౌరపంపిణీ వ్యవస్థ బాగా వ్యాప్తిలోకి వచ్చింది ఆయన రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం ప్రారంభించాకే. రాష్ట్రంలో నాలుగోవంతు ప్రజలు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారన్న విషయం వెలుగులోకి వచ్చిందీ దానివల్లే. పండుగలకు తప్ప తెల్లబియ్యం అన్నం తినని పేద కుటుంబాలకు రెండు పూటలా అన్నం పెట్టేందుకు 1983 ఏప్రిల్ 14న ఉగాది రోజు ఈ పథకాన్ని ప్రారంభించారు. దారిద్య్రరేఖకు కొలమానమైన వార్షికాదాయ పరిమితిని రూ.3600 నుంచి ఆరువేలకు పెంచి 1.43 కోట్ల కుటుంబాలకు ఈ పథకం వల్ల లబ్ధి కలిగేలా చూశారు. ప్రభుత్వమే మిల్లర్ల నుంచి నేరుగా బియ్యాన్ని సేకరించి పంపిణీ చేసేది.
వివాదాలతో సహవాసం
ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చేసరికి శాసనమండలిలో కాంగ్రెస్‌దే పూర్తి మెజారిటీ. దాంతో ప్రభుత్వం ఏ బిల్లు ప్రవేశపెట్టినా మండలి తిరస్కరించేది. విసిగిపోయిన ఎన్టీఆర్ మండలిని రద్దు చేయాలన్న నిర్ణయం తీసుకున్నారు. సంగీత, నాటక అకాడమీల పనితీరు బాగోలేదనీ, రద్దు చేయాలనీ కమిటీ సిఫార్సు చేసినప్పటికీ ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించకుండా రద్దు చేయడమూ విమర్శలకు కారణమైంది. యువతకు ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వోద్యోగుల పదవీ విరమణ వయసును తగ్గించడం ఉద్యోగుల ఆందోళనకు దారితీయగా, పీఆర్సీ అమలులో ఏర్పడిన వివాదం వల్ల యాభై రోజులకు పైగా సమ్మె జరిగింది. రంగా హత్య, తదనంతర విధ్వంసం తెలుగుదేశం ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాల్జేసింది.
1989-90 బడ్జెట్‌ను మంత్రివర్గం ఆమోదించాక శాసనసభలో ప్రవేశపెట్టకముందే కొన్ని వివరాలు బయటకు వచ్చాయి. క్రమశిక్షణా రాహిత్యంగా భావించిన ఎన్టీఆర్ మొత్తంగా మంత్రివర్గం చేత రాజీనామా చేయించారు. తర్వాత వారం రోజులకు కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటుచేసినా అనుభవరాహిత్యం వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా షూటింగ్ మొదలుపెట్టి మరిన్ని విమర్శలకు తానే కారణమయ్యారు.
ప్రజాసేవకోసం డబ్బునీ దైవంలా చూసే సినీ రంగాన్నీ వదులుకుని రాజకీయాల్లోకి వచ్చారు ఎన్టీఆర్. మంచి మనసుతో మార్పు కోసం శాయశక్తులా కృషిచేశారు కానీ ప్రతిగా ఆయనకు లభించింది... రాజకీయ నాయకుల కుట్రలూ కోర్టు కేసులూ నమ్మిన సహచరుల వంచనా ఉద్యోగులతో పోరాటాలూ... లాంటి సమస్యలెన్నో. 1988నాటి మహానాడు సమయానికే ఆయన అలసిపోయారు. పార్టీ నాయకత్వాన్ని మరొకరికి అప్పగిస్తానన్నారు. కానీ అభిమానులు అంగీకరించలేదు. ఆ తర్వాత ఆయన స్వల్పంగా గుండెపోటుకు లోనయ్యారు. పూర్తి స్థాయిలో ప్రచారానికి వెళ్లలేకపోవడంతో 1989 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయం పాలైంది. అయితే అధికారంలో లేని ఆ సమయంలో ఆయన జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారు. దాంతో 1994 డిసెంబరులో జరిగిన ఎన్నికల్లో ఏకంగా 216 స్థానాలు గెల్చుకుని విజయపతాకం ఎగరేశారు.
నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తూనే ఎన్నికలకు ముందు చెప్పినట్లుగా మద్య నిషేధాన్ని ప్రకటించారు. తాను మారిపోయాననీ ఈసారి మరింత జాగ్రత్తగా పాలనావ్యవహారాలు చూసుకుంటాననీ ప్రజలకు మాటిచ్చారు. కానీ ఆయన వ్యక్తిగత, రాజకీయ నిర్ణయాలపై పలు రకాల వివాదాలు ముసురుకున్నాయి. పార్టీలో తిరుగుబాటు చోటుచేసుకుని ఆయన పదవి కోల్పోకుండా ఉంటే మరెన్ని సంచలనాలు సృష్టించి ఉండేవారో మరి!
జనం కోసమే మనం
స్వప్రయోజనాల కోసం పదవులను అడ్డుపెట్టుకునే వారు.. ఎన్టీఆర్ భాషలో చెప్పాలంటే ‘కుక్క మూతి పిందెలు’. అటువంటి స్వార్థ రాజకీయాలను అసహ్యించుకునే ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా అసలు జీతం తీసుకోనన్నారు. రూల్స్ అంగీకరించవు కాబట్టి ఒక్క రూపాయి తీసుకునేవారు. సీఎం అధికారిక నివాసంలోకీ ఆయన మారలేదు. ప్రభుత్వ వాహనాలకు బదులుగా సొంత కారునే వినియోగించేవారు. ఎన్టీఆర్ ప్రయాణించే కారు పికప్ బాగాలేదనీ, దాన్ని మార్చాలనీ నిఘా విభాగం అధికారులు ఎంత చెప్పినా డబ్బు దండగ అంటూ ఆయన అంగీకరించలేదు. చివరికి ముఖ్యమంత్రి కార్యాలయ భవనం ఆధునికీకరణకూ రూపాయి ఖర్చు పెట్టలేదు. సామాన్యులకు మేలు చేసే విషయంలోనైతే వెయ్యి కోట్లు ఖర్చుపెట్టాల్సి వస్తుందన్నా ఆనందంగా ఆమోదించేవారు.
కూల్చండి బ్రదర్!
హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఎన్టీఆర్ నివాసం ముందుండే ప్రహరీ గోడ, గార్డు గదిని మున్సిపల్ అధికారులు పడగొట్టేశారు. అది 1986... అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రామారావే. ‘నా భవనం జోలికి రావడమేమిటీ...’ అని అధికార యంత్రాంగంపై చిందులు తొక్కలేదు. తన పదవిని దుర్వినియోగం చేయలేదు. ప్రజాప్రయోజనం కోసమే రోడ్డును విస్తరిస్తున్నారు కాబట్టి తనకు ఎటువంటి పరిహారమూ అవసరం లేదన్నారు.
తన సహచరుల్లో ఎవరైనా అవినీతికి పాల్పడితే ఊరుకునే వారు కాదు. నాటి కార్మిక శాఖామంత్రి రామచంద్రరావు లంచం తీసుకున్నారన్న ఆరోపణలు రాగా ఏసీబీతో సోదాలు చేయించి నిజమేనని తేలడంతో పదవిలోంచి తొలగించారు. మరో మంత్రి జీవన్‌రెడ్డి కలర్ టీవీ కొన్నారని తెలిసిన ఎన్టీఆర్ వెంటనే ఆయన్ని నిలదీశారు. వాయిదాల పద్ధతిలో కొన్న రసీదు చూపిస్తే తప్ప ఊరుకోలేదు.
రా.. కదలి రా!
తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడంకోసమే రాజకీయాల్లోకి వచ్చిన ఎన్టీఆర్- పార్టీ పేరుతోనే ప్రయోగాలు మొదలుపెట్టారు. తొలుత ‘తెలుగునాడు’, ‘తెలుగు నేల’, ‘తెలుగు భూమి’, ‘తెలుగు కేతనం’ వంటి పేర్లను పరిశీలించారు. ఆ సమయంలో ‘కృష్ణాపత్రిక’ సంపాదకులు ముట్నూరు కృష్ణారావు ఎప్పుడో రాసిన ‘తల్లిపిలుపు’ వ్యాసాన్ని విన్న ఎన్టీఆర్- మరు క్షణంలో ‘ఆహా ముట్నూరు వారికి జోహార్లు. మన పార్టీ పేరు తెలుగు దేశం’ అని ప్రకటించారు. యావత్తు తెలుగు ప్రాంతాన్నీ కదిలించిన ‘తెలుగు దేశం పిలుస్తోంది రా, కదలి రా’ నినాదం సృష్టికర్త- ఆయనే.
ప్రవాసాంధ్రులకు పిలుపు
లైసెన్స్ రాజ్ గుప్పిట్లో దేశం నలిగిపోతున్న కాలమది. ఆ సమయంలో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ స్వేచ్ఛా వాణిజ్యానికి స్వాగతం పలికారు. మాతృభూమి రుణం తీర్చుకోవాలని ప్రవాసాంధ్రులకు పిలుపునిస్తూ, వారినుంచి పెట్టుబడులు ఆకర్షించేందుకు వాణిజ్య, పారిశ్రామికవేత్తల బృందంతో అమెరికాలో పర్యటించారు. అంతకుముందు మరే ముఖ్యమంత్రీ చేయని ప్రయత్నమది. అక్కడున్న ప్రవాసుల్ని స్వదేశం రమ్మని ఆహ్వానించారు. అలా వచ్చిన డాక్టర్ కాకర్ల సుబ్బారావుని నిమ్స్ డైరెక్టరుగా నియమించారు. డాక్టర్ గుళ్లపల్లి నాగేశ్వరరావు ఆస్పత్రి పెడతానంటే స్థలం ఇచ్చారు. అయితే ఆయన ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి నిర్వహణ చేపట్టారు. చిత్తూరుకు చెందిన గల్లా రామచంద్రనాయుడు ‘అమర్‌రాజా బ్యాటరీస్’ పరిశ్రమ నెలకొల్పారు.
తెలుగు సంతకం
తెలుగు భాష, సంస్కృతి అంటే ఎన్టీఆర్‌కు అమితమైన ప్రేమ. సంతకం తెలుగులోనే చేసేవారు. తన హయాంలో ప్రవేశపెట్టిన ప్రతి పథకానికీ తెలుగులోనే నామకరణం చేశారు. రాష్ట్ర సచివాలయంలోని భవనాలకు సమత, సుజల, స్రవంతి, సంక్షేమ, సురక్ష అంటూ ముచ్చటైన పేర్లు పెట్టారు. ఆయనే ఉత్తర భారతానికి వెళ్లి చక్కటి హిందీలో మాట్లాడేవారు. ఆ భాష రాని ఆయన అంత స్వచ్ఛమైన హిందీలో గుక్కతిప్పుకోకుండా మాట్లాడటం చూసి మిగిలిన నాయకులు ఆశ్చర్యపోయేవారు. హిందీ ప్రసంగాన్ని తెలుగులో రాసుకుని అనర్గళంగా ప్రసంగించే వారాయన.
బుద్ధ విగ్రహాన్ని చెక్కారు!
అమెరికా పర్యటనలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని చూసిన ఎన్టీఆర్ అప్పుడు అక్కడే ఉన్న గణపతి స్థపతిని అలాంటి ఓ శిల్పాన్ని మన దగ్గరా నిర్మించగలరా అని అడిగారట. హుస్సేన్‌సాగర్ మధ్యలో 58 అడుగుల ఎత్తైన బుద్ధవిగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి ఆ సంఘటనే ప్రేరణ. గుర్తించిన శిలను శిల్పంగా మలచడానికి ప్రారంభ ముహూర్తం రోజున నల్గొండ జిల్లా రామగిరి కొండమీదికి నడిచి వెళ్లిన ఎన్టీఆర్ ఒక శిల్పిలా ఉలిని ఒడుపుగా పట్టుకుని సున్నితంగా చెక్కారట. అది చూసి శిల్పులు ఆశ్చర్యపోతుంటే ‘మల్లీశ్వరి సినిమాలో పాత్ర కోసం శిల్పకళ నేర్చుకున్నా బ్రదర్’ అని చెప్పారట ఎన్టీఆర్. ముందుతరాల వారికి మన సంస్కృతీ వారసత్వాలు తెలియాలని పలువురు కవులూ సంస్కర్తల విగ్రహాలను ట్యాంక్ బండ్ పొడవునా పెట్టించింది ఆయనే.
ఒక ఉత్తరం... వాచకాలను మార్చింది!
‘చిరంజీవి పెదనాన్న గారికి ఆశీస్సులతో...’ అంటూ ఓ పదో తరగతి అబ్బాయి రాసిన ఉత్తరం ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ని చదువుల గురించి ఆలోచించేలా చేసింది. పెద్దల్ని ఎలా సంబోధించాలో తెలియని విధంగా చదువులు ఉన్నాయని ఆవేదన చెందిన ఎన్టీఆర్ ప్రాథమిక విద్య తెలుగు వాచకాలను మార్పించారు. పలువురు నిపుణులతో కమిటీ వేసి వాడుక భాషలో, తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను చాటేలా కొత్త సిలబస్ తయారుచేయించి 1988నుంచి అందుబాటులోకి తెచ్చారు. పిల్లలు ఆసక్తిగా బడికి వచ్చేలా చేయడానికి దృశ్య, శ్రవణ రూపంలో పాఠాలు రూపొందించమన్నారు ఎన్టీఆర్. మూడో తరగతి వరకూ 32 గంటల పాఠాలను బాపూ రమణలు ఉచితంగా చేసిచ్చారు. వాటిని ప్రదర్శించేందుకుగాను 11 వేల పాఠశాలలకు కలర్ టీవీలను అందించారు. అంతలో ప్రభుత్వం మారింది. దాన్నెవరూ పట్టించుకున్న పాపాన పోలేదు.
తిరుమలపై చెరగని ముద్ర
తెలుగువారి ఇలవేల్పు శ్రీవేంకటేశ్వరుడు కొలువుతీరిన తిరుమలతో తారక రాముడి అనుబంధం చాలా ప్రత్యేకం. పార్టీ మొదటి మహానాడుని తిరుపతిలో నిర్వహించారు. తొలి ఎన్నికల ప్రచారాన్ని ఆయన తిరుపతి నుంచే ప్రారంభించి అక్కడే ముగించారు. తిరుమల కొండల్లో వృక్ష సంపదను పెంచడానికి ముఖ్యమంత్రిగా ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. హెలికాప్టర్ల నుంచి కొండపై విత్తనాలు చల్లించారు. దివ్యారామం ప్రాజెక్టుకు అంకురార్పణ చేశారు. భక్తులు వేచి ఉండటానికి క్యూ కాంప్లెక్స్, వేద విజ్ఞానపీఠం, నిత్యాన్నదాన పథకం, మూలవిరాట్‌కు వజ్ర కిరీటం... ఇవన్నీ ఎన్టీఆర్ హయాంలోనే సాకారమయ్యాయి. తిరుమలలో రాజకీయ పార్టీల జెండాలూ బ్యానర్లూ వాల్‌పోస్టర్లూ కనపడకూడదనీ, రాజకీయ కార్యక్రమాలకు ఆ పవిత్రధామం వేదిక కాకూడదనీ ఉత్తర్వులను జారీచేయించిందీ ఆయనే. ఇప్పటికీ ఆ నిబంధన కొనసాగుతోంది.
గురుకుల పాఠశాలలూ... విశ్వవిద్యాలయాలూ
బడుగు వర్గాల పిల్లలకు విద్యను అందుబాటులోకి తేవడానికి జిల్లాకో గురుకుల పాఠశాలను ఏర్పాటుచేశారు ఎన్టీఆర్. జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుకి స్ఫూర్తి ఈ పాఠశాలలే. హైస్కూళ్లలో వృత్తివిద్యలను ప్రవేశపెట్టిందీ ఆయనే.
వృత్తి విద్యా కళాశాలల్లో ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు కల్పించారు. వైద్య, ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు ఎంసెట్ విధానాన్ని తెచ్చారు. కంప్యూటర్ల వినియోగాన్ని స్వాగతించారు. ఓపెన్ యూనివర్సిటీని అందుబాటులోకి తెచ్చారు. మూసపద్ధతిలో సాగుతున్న విశ్వవిద్యాలయాలకు భిన్నంగా స్త్రీలకోసం తిరుపతిలో పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్నీ, వైద్యవిద్యకోసం ప్రత్యేకంగా విజయవాడలో ఆరోగ్య విశ్వవిద్యాలయాన్నీ, తెలుగు భాషా, కళలను ప్రోత్సహించడానికి హైదరాబాద్‌లో తెలుగు విశ్వవిద్యాలయాన్నీ నెలకొల్పారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు, ఉన్నత విద్యామండలి నియామకాల్లో ప్రతిభకే ప్రాధాన్యమిస్తూ విద్యావేత్తలనే నియమించారు.
గ్రేహౌండ్స్ ఆవిర్భావం
పోలీసు శాఖ అంటే ఎన్టీఆర్‌కు ఎనలేని గౌరవం. హైదరాబాద్‌లో గండిపేటకు వెళ్లే దారిలో వంద ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని పోలీసుల శిక్షణ కేంద్రానికి కేటాయించారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే గ్రేహౌండ్స్ ఆవిర్భవించింది. ఆ బలగాల శిక్షణకోసం 200 ఎకరాల స్థలాన్ని అందజేశారు. పోలీసు దళాల గౌరవ వందనాన్ని స్వీకరించేటప్పుడు మాత్రం ఎన్టీఆర్ కొంచెం ఇబ్బంది పడేవారు. కుడి చేతి మణికట్టు దగ్గర ఎప్పుడో తగిలిన దెబ్బ వల్ల ఆ చేతి వేళ్లు ఆయన స్వాధీనంలో ఉండేవి కాదు.
పారిశ్రామికాభివృద్ధి
పరిశ్రమల అభివృద్ధిపై ఎన్టీఆర్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఆయన అధికారంలోకి వచ్చేసరికి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో భారీ మధ్య తరహా పరిశ్రమలు 390 మాత్రమే ఉండేవి. ఆయన వచ్చాక 216 కొత్తవి వచ్చాయి. చిన్న తరహా పరిశ్రమలు 37,813 నుంచి 58,263కి పెరిగాయి. 2608 మెగావాట్లు ఉన్న విద్యుత్ రంగ సామర్థ్యం 1987 నాటికి 3604 మెగావాట్లకు పెరిగింది. 1980-81లో 26 కోట్ల నష్టంలో ఉన్న ఆర్టీసీ, 1986-87లో ఏడు కోట్ల లాభాన్ని ఆర్జించింది.
రైతుబాంధవుడు
రైతులూ యువకులూ మహిళల కోసం ఎన్టీఆర్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు. ముఖ్యంగా రైతులకు రుణమాఫీ, పక్కా ఇళ్ల నిర్మాణం, సగం ధరకే చేనేత చీరా ధోవతీ, వృద్ధులూ వితంతువులకు పింఛను, యువశక్తి పథకం, తెలుగు గ్రామీణ క్రాంతిపథం, పల్లె పల్లెకూ బస్సు, ప్రసూతి సహాయ పథకం, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, తెలుగు గిరిజన మాగాణ సమారాధన, సంచార న్యాయస్థానం, సంచార శిశు సంరక్షణాలయం, సింగిల్ విండో విధానం లాంటివి చెప్పుకోదగ్గవి. దేశంలోనే మొట్టమొదటిసారిగా భూమిశిస్తు రద్దు చేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
ఇంకా..


తాజా వార్తలు (Latest News)
-
Global Innovation Index: ఇన్నోవేషన్‌లో భారత్‌కు 40వ స్థానం
-
Bengaluru traffic : కారులో నుంచి ఆర్డర్ చేస్తే పిజ్జా వచ్చేసింది.. అట్లుంటది బెంగళూరు ట్రాఫిక్!
-
Hyderabad: మరో రెండు కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన.. 12వేల మందికి ఉపాధి
-
ChatGPT: చాట్‌జీపీటీ నుంచి బిగ్ అప్డేట్.. ఇక రియల్‌టైమ్ సమాచారం
-
Cricket: చైనాకు బయల్దేరిన టీమ్ఇండియా.. ఆ రెండు మ్యాచ్‌లకు బావుమా దూరం
-
MS Swaminathan: ఆకలి తీర్చిన మహనీయుడా.. ఈ దేశం మిమ్మల్ని ఎప్పటికీ మరిచిపోదు!