Sam Altman: సీఈఓ కోసం... ఉద్యోగులందరి రాజీనామా!

బిల్‌ గేట్స్‌ - మైక్రోసాఫ్ట్‌ అధినేత. స్టీవ్‌ జాబ్స్‌- ఆపిల్‌ సృష్టికర్త. మార్క్‌ జుకర్‌బర్గ్‌- ఫేస్‌బుక్‌ రూపకర్త... వీళ్ల సరసన నిల్చోదగ్గవాడు శామ్‌ ఆల్ట్‌మాన్‌! అడిగిన కొన్ని క్షణాల్లోనే అచ్చం మనుషులంత తెలివిగా జవాబు చెప్పగల, వ్యాసాలూ పాటలూ రాయగల ‘చాట్‌-జీపీటీ’ని రూపొందించినవాడు.

Updated : 03 Dec 2023 09:09 IST

బిల్‌ గేట్స్‌ - మైక్రోసాఫ్ట్‌ అధినేత. స్టీవ్‌ జాబ్స్‌- ఆపిల్‌ సృష్టికర్త. మార్క్‌ జుకర్‌బర్గ్‌- ఫేస్‌బుక్‌ రూపకర్త... వీళ్ల సరసన నిల్చోదగ్గవాడు శామ్‌ ఆల్ట్‌మాన్‌(Sam Altman)! అడిగిన కొన్ని క్షణాల్లోనే అచ్చం మనుషులంత తెలివిగా జవాబు చెప్పగల, వ్యాసాలూ పాటలూ రాయగల ‘చాట్‌-జీపీటీ’ని రూపొందించినవాడు. అలాంటివాటికోసమే ‘ఓపెన్‌ ఏఐ’ అన్న సంస్థని నెలకొల్పాడు. సంస్థ నుంచి ఇటీవల శామ్‌ ఆల్ట్‌మన్‌ని తొలగిస్తే ‘అతను వెళ్ళిపోతే మేమూ రాజీనామా చేస్తాం’ అని బోర్డుసభ్యుల్ని ఉద్యోగులు హెచ్చరించడం టెక్‌ ప్రపంచంలో ఓ సంచలనం.! దాని నేపథ్యం ఇది...

శామ్‌ ఆల్ట్‌మాన్‌ అమెరికాలోని షికాగోలో పుట్టాడు, ముస్సోరి రాష్ట్రంలోని సెయింట్‌ లూయీ నగరంలో పెరిగాడు. తల్లి డాక్టర్‌... చర్మవ్యాధి నిపుణురాలు. తండ్రి ఓ చిన్నసైజు స్థిరాస్తి దళారి. మామూలు మధ్యతరగతి జీవితమే వాళ్ళది. శామ్‌ చిన్నప్పటి నుంచీ లెక్కల్లో గట్టివాడు. అది గమనించి వాళ్లమ్మ- ఎనిమిదో తరగతప్పుడు ఓ కంప్యూటర్‌ని కొనిచ్చిందట. అందులో కంప్యూటర్‌ ప్రోగ్రామ్స్‌ రాయడం నేర్చుకోవడమే... అతని పంథాని మార్చేసింది. ప్రపంచమంతా సీటుకోసం కలలుకనే స్టాన్‌ఫర్డ్‌ వర్సిటీలో కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థిని చేసింది. కానీ- కొంతకాలం తర్వాత ఆ క్లాసులేవీ రుచించలేదు. తన గదిలోనే ఉంటూ ‘లూప్ట్‌’ అన్న సరికొత్త సామాజిక మాధ్యమాన్ని సృష్టించాడు. అందులో పెట్టుబడులు పెట్టడానికి ‘వై- కాంబినేటర్‌’ సంస్థ ముందుకొచ్చింది. అలా ముందుకొచ్చిన- ఆ సంస్థ నిర్వాహకులకి ఈ కుర్రాడి తెలివితేటలూ సామర్థ్యమూ నచ్చి సంస్థలో భాగస్వామిగా చేర్చుకున్నారు. శామ్‌తో ఆ సంస్థ దశ తిరిగిపోయింది...

మీషో, జెప్టో అలా వచ్చినవే...

అప్పటిదాకా అమెరికాలోని ఏవో చిన్న స్టార్టప్‌లకి ఆర్థికసాయం చేస్తూ వచ్చిన వై-కాంబినేటర్‌ పరిధిని ప్రపంచవ్యాప్తం చేశాడు శామ్‌. 2014లో... తన 23 ఏళ్ళ వయసులో దానికి అధ్యక్షుడయ్యాడు. కేవలం డబ్బే కాదు- స్టార్టప్‌ వ్యవస్థాపకులకి కావాల్సిన శిక్షణ కూడా అందించడం మొదలుపెట్టాడు. మనదేశానికి చెందిన రేజర్‌ పే, మీషో, జెప్టో వంటి వందలాది సంస్థలు ఆ రకంగా వచ్చినవే. అలా 10 వేల అంకురాలకి సాయం చేశాడతను! అప్పుడే అతని దృష్టి కృత్రిమ మేధపైన పడింది...

అణుబాంబే కానీ...

‘కృత్రిమ మేధ ఓ అణుబాంబులాంటిది. అది దుష్టశక్తుల చేతుల్లోకి వెళితే వినాశనమే. అలాకాకుండా- దాని ఆవిష్కరణలకి మనమే సారథ్యం వహిద్దాం. ఆ నైపుణ్యాలు ప్రజలందరికీ చేరువచేద్దాం..’ - ఈ లక్ష్యంతోనే ‘ఓపెన్‌ ఏఐ’ సంస్థని ఏర్పాటుచేయాలనుకున్నాడు శామ్‌ ఆల్ట్‌మన్‌. టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్‌మస్క్‌ వంటి 12 మంది సాంకేతిక మేధావులూ అతనితో చేతులు కలిపారు. సంస్థ లక్ష్యం గొప్పదైనా- ‘ఏఐ’ని సృష్టించేందుకు కావాల్సిన అతిశక్తిమంతమైన కంప్యూటర్‌లు లేక మొదట్లో ఇబ్బంది పడాల్సి వచ్చేది. సీపీయూలూ, జీపీయూలని కూడా గూగుల్‌ సంస్థ నుంచి అద్దెకు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. అయితేనేం - మూడేళ్ళకల్లా ‘జనరేటివ్‌ ప్రీ-ట్రెయిన్డ్‌ ట్రాన్స్‌ఫార్మర్‌’(జీపీటీ) అన్న ఏఐ ఉపకరణాన్ని తీసుకురాగలిగాడు శామ్‌ ఆల్ట్‌మన్‌. నేటి ప్రపంచ సంచలనం చాట్‌-జీపీటీకి అలా నాందిపలికాడు! అయితే...

నిధుల్లేవు...

2019లో ఈ సంస్థలో భాగంగా ఉన్న ఎలాన్‌ మస్క్‌ తప్పుకున్నాడు. అతనితోపాటూ అతనిచ్చే నిధులు ఆగిపోయాయి. ఓ దశలో ఆఫీస్‌ అద్దె, కరెంటు బిల్లులు చెల్లించడమే కష్టమైంది. ఆ నేపథ్యంలోనే ‘ఓపెన్‌ ఏఐ’ స్వచ్ఛంద సంస్థకి అనుబంధంగా పూర్తి వాణిజ్య అవసరాలకని ‘ఓపెన్‌ ఏఐ గ్లోబల్‌’ అన్న సంస్థని తెచ్చాడు. అందులోకి పెట్టుబడులని ఆహ్వానిస్తే- మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్యనాదెళ్ళ స్పందించి... లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాడు. ఎంతగా పెట్టుబడుల్ని ఆహ్వానిస్తేనేం, అందులో చాలా నియమాలు పెట్టాడు శామ్‌. పెట్టుబడిదారులు అందించిన నిధులపైన కేవలం వందరెట్లు లాభం మాత్రమే వాళ్ళకివ్వాలన్నది అందులో ఒకటి. ఆ పైన వచ్చిన లాభాలన్నీ- ‘ఓపెన్‌ ఏఐ’ స్వచ్ఛంద సంస్థకీ, ఉద్యోగులకీ వాటాలకింద వెళతాయి. శామ్‌తోపాటున్న మరో ముగ్గురు వ్యవస్థాపకులు- తమకొచ్చే జీతం తప్ప వాటాలేవీ తీసుకోరు. ఏమైతేనేం- ఒకప్పుడు వందమందితో నడిచిన సంస్థ రెండేళ్ళకి 770 మందికి చేరింది. సీఈఓగా ప్రతి ఒక్కరి నుంచీ ‘ది బెస్ట్‌’ నైపుణ్యాన్ని వెలికితీసే అతని తీరు- అందరూ అతణ్ణి ఆరాధించేలా చేసింది. ఆ సామర్థ్యమే ఒకప్పుడు అద్దె కట్టడానికే డబ్బుల్లేని ‘ఓపెన్‌ ఏఐ’ సంస్థని 7.5 లక్షల కోట్ల విలువున్న సంస్థగా నిలబెట్టింది. కానీ- ఉద్యోగులు అంతగా ఆరాధిస్తున్నా... సంస్థ బోర్డుమెంబర్స్‌లో అతనిపట్ల వ్యతిరేకత మొదలైంది. పెట్టుబడులూ, కొత్త ఉత్పత్తుల వివరాలేవీ తమతో పంచుకోవట్లేదని విమర్శించసాగారు. అదే కారణం చూపిస్తూ నవంబర్‌ మూడోవారంలో అతణ్ణి కంపెనీ నుంచీ తొలగించేశారు. ఆ విషయం తెలియగానే కంపెనీలోని ఉద్యోగులందరూ అతనితోపాటూ తామూ వెళ్ళిపోతామని బోర్డుసభ్యులకి లేఖరాశారు. ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టిన మైక్రోసాఫ్ట్‌ తదితర సంస్థలు శామ్‌కీ, ఉద్యోగులకీ మద్దతునిచ్చాయి! అందరి ఒత్తిడి ఫలితంగా చివరికి శామ్‌ని కంపెనీ నుంచి తొలగించిన బోర్డు సభ్యులే రాజీనామా చేసి వెళ్ళిపోయారు. శామ్‌, అతని ఉద్యోగులే కంపెనీలో మిగిలారు... టెక్‌ చరిత్రలో సంభవించిన ఓ అరుదైన ఘటనకి గుర్తులుగా!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..