‘సీరం’...సొగసరి కోసం!

అందమైన ప్రేమరాణి లేత బుగ్గపై చిన్న మొటిమ కూడా ముత్యమేలే’ అంటూ అమ్మాయి అందాన్ని ఎంతగా పొగిడినా... ముఖంపైన చిన్న మచ్చ కూడా ఉండకూడదనే కోరుకుంటుంది

Published : 25 Feb 2024 00:20 IST

ముఖమంతా నల్లగా మారిపోయింది ఏం చేయాలి...ఈ మొటిమలు పోవాలంటే అసలేది వాడాలి... చర్మం నిగనిగలాడుతూ కనిపించాలంటే ఏ క్రీమ్‌ కొనాలి... అమ్మాయిల మనసుల్లో మెదులుతున్న ఇలాంటి ప్రశ్నలన్నింటికీ ఈమధ్య బాగా వినిపిస్తున్న సమాధానం ‘సీరం వాడితే సరి’ అన్నమాట... అసలేంటీ సీరం... ఏమా సంగతులు...

‘అందమైన ప్రేమరాణి లేత బుగ్గపై చిన్న మొటిమ కూడా ముత్యమేలే’ అంటూ అమ్మాయి అందాన్ని ఎంతగా పొగిడినా... ముఖంపైన చిన్న మచ్చ కూడా ఉండకూడదనే కోరుకుంటుంది ఏ అమ్మాయైనా. ఏ వయసులోనైనా మేలిమి ఛాయతో మెరిసిపోవాలనుకుంటూ అందాన్ని పెంచుకోవడానికి ఎన్నెన్నో సౌందర్యోత్పత్తులూ వాడేస్తుంది. అందుకోసమే మార్కెట్లోనూ బోలెడన్ని క్రీములూ, లోషన్లూ వస్తుంటాయి. ఈమధ్య వాటన్నింటినీ పక్కనపెడుతూ రకరకాల సీరమ్స్‌ వచ్చాయి. అందానికి సంబంధించిన చర్మ సమస్యలేవైనా కానీ సీరమ్‌ మంచి సొల్యూషన్‌ అంటూ వైద్యులూ వీటినే సూచిస్తున్నారు.

సీరమే ఎందుకంటే...

మందు ఏదైనా నేరుగా చర్మంలోకి చొచ్చుకుపోతేనే కదా అక్కడున్న సమస్య సమసిపోతుంది. సరిగ్గా ఈ సీరమ్స్‌ విషయంలోనూ అదే జరుగుతుంది. విటమిన్లూ, ఇతర పోషకాల్లాంటివన్నీ కూడా సీరమ్‌లో చిన్న చిన్న అణువుల్లా ఉంటాయి. ఇవి చర్మంలోని లోతైన పొరల్లోకీ సులువుగా చొచ్చుకునిపోయి చర్మానికి అవసరమైన పోషకాల్ని నేరుగా అందిస్తాయి. అందుకే మరి, చాలా తక్కువ సమయంలోనే కావాల్సిన ఫలితం వస్తుందన్నమాట.

ఎలా పనిచేస్తాయి...

బ్లాక్‌ హెడ్స్‌, మొటిమలు, మచ్చలు, రంధ్రాలు, ముడతలు, గీతలు... ఇలా ఒక్కో అమ్మాయికి ఒక్కో ఇబ్బంది. వీటిల్లో ఒక్కో దానికి ఒక్కోరకమైన సీరం దొరుకుతోంది. చర్మం మెరవడానికి సిట్రిక్‌ యాసిడ్‌తో ఉండే విటమిన్‌ సీ సీరం, ముడతలూ, గీతలూ పోయి కొత్త మెరుపును సంతరించడానికి రెటినాల్‌తో వచ్చే యాంటీఏజింగ్‌ సీరం, చర్మం ప్లఫ్ఫీగా నిగారింపుతో ఉండటానికి హైలురోనిక్‌ సీరం... యాంటీఆక్సిడెంట్లతో చర్మం మీదున్న బ్యాక్టీరియాల్ని తొలగించే విటమిన్‌ ఇ సీరం... లాంటివెన్నో అందుబాటులో ఉన్నాయి. ఇంకా ఎక్కువమందికి ఉపయోగపడేది నియాసినమైడ్‌ సీరం.

ఇది రకరకాల స్కిన్‌ సమస్యలకు చెక్‌ పెట్టేస్తుంది. పిగ్మెంటేషన్‌ తగ్గిస్తూ స్కిన్‌టోన్‌ని మెరుగ్గా మార్చడమే కాదు, చర్మ రంధ్రాల్ని తగ్గించడంలోనూ ఇది ఎంతో ఉపయోగపడుతుందట. ఇవేకాదు, ప్రోటీన్లతో ఉండే పెప్టైడ్‌ సీరమ్స్‌ చర్మానికి రక్షణగా ఉంటూ ఇతర స్కిన్‌ డ్యామేజీల్నీ తగ్గిస్తుంటాయి. ఇలా చంద్రబింబంలాంటి ముఖాన్ని తెచ్చిపెట్టడానికి మార్కెట్లో బోలెడన్ని రకాల సీరమ్స్‌ వస్తున్నాయి. జుత్తు రాలడం తగ్గించడానికీ, ఆరోగ్యకరమైన కురుల కోసం హెయిర్‌ సీరమ్సూ ఉన్నాయి. జుత్తుకు అవసరమయ్యే పోషకాలు ఉంటాయి వీటన్నింటిలో. ‘ఇదంతా బాగానే ఉంది కానీ ఈ స్కిన్‌ ఇంకా హెయిర్‌ సీరమ్స్‌ వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఏమైనా ఉంటాయా’ అనే సందేహం వచ్చే ఉంటుంది కదూ. పోషకాలన్నింటినీ ఒక దగ్గర కలుపుతూ తక్కువ పిహెచ్‌తో ఉండేలా తయారుచేసిన ఈ సీరమ్స్‌ వల్ల ఎలాంటి ఇబ్బందీ ఉండదట. కానీ సమస్యను బట్టి వైద్యుల సలహా మేరకు సీరంను ఎంచుకోవడం మంచిది. సీరం బాటిల్‌ను ఎండ తగలకుండా ఉంచడమూ, సీరంను నేరుగా చర్మానికే రాయడమూ, దీని తర్వాత మాయిశ్చరైజర్‌ అప్లై చేయడం లాంటి జాగ్రత్తలూ తీసుకోవాలి. అప్పుడే దాని వల్ల ఫలితం ఉంటుందట. మరి ఆలస్యం దేనికీ... ఒక్కసారి డాక్టరుతో మాట్లాడి- అందుబాటులో ఉన్న రకరకాల సీరమ్స్‌లో మీకు అనువైన దాన్ని కొనుక్కుని ముఖారవిందాన్ని మెరిపించేయండి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..