వీళ్ళు... ‘సిమెంటు ఇటుక’ల సృష్టికర్తలు!

ఈ మధ్య మీరు ఇల్లేమన్నా కట్టుకున్నారా..? ఆ కట్టడానికి ఎక్కువ భాగం ‘సిమెంటు ఇటుకల్ని’ వాడుంటారు... అవునా? వాటిని ఆవిష్కరించిన ఘనత ఈ తెలుగు దంపతులది!

Updated : 25 Feb 2024 03:59 IST

ఈ మధ్య మీరు ఇల్లేమన్నా కట్టుకున్నారా..? ఆ కట్టడానికి ఎక్కువ భాగం ‘సిమెంటు ఇటుకల్ని’ వాడుంటారు... అవునా? వాటిని ఆవిష్కరించిన ఘనత ఈ తెలుగు దంపతులది! అందుకు సంబంధించిన పేటెంట్‌లపై రాయల్టీని నిస్వార్థంగా జాతికి అంకితమిచ్చి- కోట్ల రూపాయలని కాదనుకున్నారీ ఆదర్శ జంట. శాస్త్రప్రపంచంలో తాము అనుకున్నది సాధించడానికి ఈ దంపతులు చేసిన పోరాటం కూడా చిన్నదేమీ కాదు.

విజయనగరంలో దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినవారు నాటేరి కాళిదాసు. అక్కడి ఎమ్‌.ఆర్‌.కాలేజీలో డిగ్రీ చేశారు. ఆ కాలేజీ ప్రిన్సిపాల్‌ గారమ్మాయే భానుమతి! చిన్ననాటి స్నేహితురాలే... పెద్దయ్యేనాటికి ప్రియసఖిగా మారింది. పెద్దల ఆమోదంతో వారి బంధం పెళ్లిపీట లెక్కింది. అయితే ఇద్దరికీ శాస్త్రరంగంలో ఏదో సాధించాలనే తపనా, తీరని పరిశోధనాసక్తి! దాంతో పెళ్లినాడే ఓ ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు- పిల్లలు వద్దనుకున్నారు! ఇరువైపులా పెద్దలు ఎన్నో అభ్యంతరాలు చెప్పినా- వినలేదు. సమయాన్నీ, శక్తినీ తాము నమ్మిన టెక్నాలజీ అభివృద్ధివైపే మళ్ళించారు.

 తొలి ప్రయత్నం...

ముందుగా వాళ్ళ దృష్టి ఎరువుల కంపెనీలపైన పడింది. రైతులక్కావాల్సిన ఎరువుల్ని తయారుచేసే క్రమంలో వృథా రసాయనంగా జిప్సమ్‌ పోగవుతుండేది. ఫ్యాక్టరీల్లో పేరుకుపోతున్న ఆ ఫాస్ఫోజిప్సమ్‌ వల్ల- పర్యావరణానికి తీవ్ర ముప్పని గ్రహించారీ దంపతులు. దాన్ని ఉపయోగించి కొత్తరకం ఇటుకలు తయారు చేయగలిగితే అటు పర్యావరణ హానిని అడ్డుకోవడంతోపాటూ- మామూలు ఇటుకకన్నా తక్కువ ధరకే అందించవచ్చని భావించారు. కానీ అందుకు తగ్గ ల్యాబ్‌ వారికి లేదు. ఎంతో కష్టంపైన ఆంధ్రా యూనివర్సిటీవాళ్ళని ఒప్పించి అక్కడి కెమిస్ట్రీ ల్యాబ్‌ ఖాళీగా ఉన్నప్పుడు వాడుకోవడానికి అనుమతి తీసుకున్నారు. ల్యాబ్‌ దొరికిన ప్రతిసారీ అక్కడే రేయింబగళ్ళూ శ్రమించారు. ఎన్నో కాంబినేషన్‌లతో ప్రయోగాలు చేశాక- ఓ ప్రాసెస్‌ని సిద్ధంచేశారు. దాన్ని ప్రాక్టికల్‌గా పరీక్షించాలంటే ఓ పరిశ్రమ కావాలి. దాంతో మూడున్నర లక్షలు అప్పు తీసుకుని ఓ కంపెనీని స్థాపించారు. కానీ- ఇటుకలకి కావాల్సిన ముడిపదార్థాన్ని తయారుచేసే క్రమంలో విడుదలయ్యే వేడిని అంచనా వేయలేకపోయారు. దాంతో 24 టన్నులదాకా రావాల్సిన ముడిపదార్థం మూడు టన్నులే వచ్చింది! పెట్టుబడి మొత్తం పోయింది... అప్పు మిగిలింది. ‘మేం అప్పుడే చెప్పాం! ఇప్పటికైనా ఉద్యోగమేదో చూసుకుని బుద్ధిగా పిల్లాపాపల్ని కని..’ అంటూ చుట్టు పక్కలవాళ్ళు ఉచిత సలహాలు ఇవ్వసాగారు. అంతా అయిపోయింది అనుకున్న తరుణంలో- ఓ చిన్న ఆశాకిరణం కనిపించింది!

ఫ్లై యాష్‌...

జిప్సమ్‌కి సంబంధించి పరిశోధన చేస్తున్నప్పుడే ఆ వివరాలని సాల్జిట్టర్‌ అనే జర్మన్‌ కంపెనీతో పంచుకున్నారు కాళిదాసు. సరిగ్గా- వీళ్ళ సొంత కంపెనీ ఫెయిలైన సమయంలోనే జర్మనీవాళ్ళు ఈ దంపతుల్ని వెతుక్కుంటూ విజయనగరం వచ్చారు. ‘మీ ప్రయోగం ఫెయిల్యూర్‌ కాదు. మీ ఆలోచనకి తగ్గ పెద్దస్థాయి వసతులూ, వనరులూ లేక అలా అయ్యింది. అవి మేం అందిస్తాం’ అంటూ తీపికబురు చెప్పారు. 1988లో ఆ పరిశోధనలు ఓ కొలిక్కి వచ్చాయి. అప్పుడే వాళ్ళ దృష్టి థర్మల్‌ విద్యుత్కేంద్రాల నుంచి వచ్చే వృథా రసాయనమైన ‘ఫ్లైయాష్‌’పైన పడింది. అది కూడా ఇటుకల తయారీకి బాగా ఉపయోగపడుతుందని నమ్మి- పరిశోధనలు మొదలుపెట్టారు. కేవలం ఏడాదిలోనే ఫ్లై యాష్‌-లైమ్‌-జిప్సమ్‌ (ఫాల్‌-జి) అన్న సాంకేతికతని ఆవిష్కరించారు. దానితో అతితక్కువ సమయంలోనే దృఢమైన ఇటుకల్ని తయారుచేసి చూపించారు. అక్కడితో ఆగలేదు. సిమెంటు అవసరం లేని ప్రత్యేక కాంక్రీటునీ తయారుచేశారు. వాటిని తీసుకుని దంపతులిద్దరూ జాతీయ అంతర్జాతీయ సెమినార్లకి వెళుతుంటే- ‘మీ ఇంటినైతే వీటితో కడతారా?’ అని అడిగేవారట. దాన్నో సవాలుగా తీసుకుని 1991లో విశాఖలోని షీలా నగర్‌లో సిమెంటు వాడకుండా- తమ కాంక్రీటుతోనూ ఇటుకలతోనూ ఇల్లుకట్టి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఆ ఇంటికి ‘ఫాల్‌-జి మ్యాన్షన్‌’ అనే పేరుపెట్టారు. అంతేకాదు, తమ సాంకేతికత సామాన్యులకి ఉపయోగపడాలని తమ పేటెంట్‌కి రాయల్టీ తీసుకోకుండా జాతికి అంకితం చేశారు. అలా చేశారో లేదో- ఆ సాంకేతికత ఆధారంగా 30 వేల ఇటుకల పరిశ్రమలు పుట్టుకొచ్చేశాయి! సిమెంటుకీ వీటికీ ఏ సంబంధం లేకున్నా - వాటి రంగుని బట్టి సామాన్యులు సిమెంటు ఇటుకలనడం మొదలుపెట్టారు!  

‘నానో’ కాంక్రీట్‌!

ఇటీవల ఐసీఐసీఐ బ్యాంకు అందించే ఐసీఐ అల్ట్రా టెక్‌ ‘అవుట్‌స్టాండింగ్‌ కాంక్రీట్‌ ఇంజినీర్స్‌’ అవార్డుకి ఎంపికై వార్తల్లో వ్యక్తులయ్యారు! అంతేకాదు, ఈ మధ్యే ‘నానో కాంక్రీట్‌’ని అభివృద్ధి చేశారు వీళ్ళు. దాంతో కాంక్రీట్‌ నిర్మాణాలనీ ఇటుకలతో చేసే (కరంజా) పేవ్‌మెంట్‌లనీ నిర్మిస్తున్నారు. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సాలిడ్‌ వేస్ట్‌ రీసర్చ్‌ అండ్‌ ఎకాలజికల్‌ బ్యాలన్స్‌(ఇన్స్‌వారెబ్‌) అనే ఎన్జీఓని కూడా స్థాపించి కంపెనీలు తమ వృథా రసాయనాలని ఎలా తగ్గించుకోవచ్చో సలహాలిస్తున్నారు.
దేశవ్యాప్తంగా ఏటా పదివేల కోట్ల ఫ్లైయాష్‌ ఇటుకలు తయారవుతున్నాయని ఓ అంచనా! ప్రతి ఇటుకపైన ఒక్క పైసా రాయల్టీగా తీసుకున్నా ఇన్నేళ్ళలో వీళ్ళు వేల కోట్లు వెనకేసుకుని ఉండొచ్చు. ఆ మాటే అంటే ‘అలాగా! ఆ లెక్కలు మేమెప్పుడూ వేయలేదే... అయినా అంత డబ్బు మాకెందుకు?!’ అంటూ నవ్వేస్తారు ఇద్దరూ!
- చంద్రమౌళిక సాపిరెడ్డి, ఈనాడు, విశాఖపట్నం
ఫొటో: పి. నాయుడు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..