జ్ఞాపకశక్తి పైనా... పీసీఓఎస్‌ ప్రభావం!

పాలీ సిస్టిక్‌ ఓవరీ సిండ్రోమ్‌... క్లుప్తంగా పీసీఓఎస్‌. రుతుక్రమంలో తేడాలు, సంతానలేమి, అవాంఛిత రోమాలు... ఇలా ఎన్నో ఇబ్బందులకి దారితీసే ఆరోగ్య సమస్య ఇది.

Published : 09 Mar 2024 23:23 IST

పాలీ సిస్టిక్‌ ఓవరీ సిండ్రోమ్‌... క్లుప్తంగా పీసీఓఎస్‌. రుతుక్రమంలో తేడాలు, సంతానలేమి, అవాంఛిత రోమాలు... ఇలా ఎన్నో ఇబ్బందులకి దారితీసే ఆరోగ్య సమస్య ఇది. ప్రపంచంలోని 10 శాతం మహిళల్లో ఈ సమస్య ఉందట. అధికబరువు, బీపీ, షుగర్‌ వంటి సమస్యలకీ దీనికీ దగ్గరి సంబంధం ఉందనీ అంటారు. తాజాగా, ఈ సమస్య వల్ల జ్ఞాపకశక్తీ సన్నగిల్లుతోందని తేల్చారు శాస్త్రవేత్తలు. ఇందుకోసం 18-30 ఏళ్ళ మధ్య వయసున్న 907 మంది యువతుల్ని మూడు దశాబ్దాలపాటు పరిశీలించారు. అరవైల్లో ఉన్నవాళ్ళని పక్కనపెట్టి- నడివయసువాళ్ళకి మేధోపరమైన పరీక్షలు నిర్వహించారు. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, మాట్లాడే తీరుల్ని గమనించారు. పీసీఓఎస్‌ సమస్యతో బాధపడుతున్నవాళ్ళు- అది లేనివాళ్ళకంటే ఎన్నోరెట్లు వెనకపడ్డారని తేల్చారు. అంతేకాదు, వీళ్ళ మెదడుని స్కాన్‌ చేస్తే- ‘వైట్‌ మ్యాటర్‌’ కూడా ఎక్కువగా కనిపించిందట. సాధారణంగా వయో వృద్ధుల మెదడులోనే ఇది అధికంగా ఉంటుంది. అంటే, వృద్ధాప్య లక్షణాలు వీళ్ళలో ముందుగా వచ్చేశాయన్నమాట. సాధారణంగా పెళ్ళయ్యాక గర్భధారణలో సమస్య ఏర్పడ్డప్పుడే ఈ సమస్యని అమ్మాయిలు గుర్తిస్తుంటారు. నిజానికి, ఈ సమస్య 13-14 ఏళ్ళప్పుడే మొదలైపోతుందనీ అప్పుడే గుర్తించి జాగ్రత్తపడితే దుష్ప్రభావాల నుంచి బయట పడొచ్చనీ శాస్త్రవేత్తలు సలహా ఇస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..