పిల్లలు హెడ్‌ఫోన్స్‌ వాడుతున్నారా?

మొబైల్‌ ఫోన్‌లతోపాటూ హెడ్‌ఫోన్స్‌/ఇయర్‌ బడ్స్‌ కూడా ఈ మధ్య పిల్లల చేతికి వచ్చేస్తున్నాయి. వీటి విషయంలో తల్లిదండ్రులు అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు శాస్త్రవేత్తలు.

Published : 09 Mar 2024 23:27 IST

మొబైల్‌ ఫోన్‌లతోపాటూ హెడ్‌ఫోన్స్‌/ఇయర్‌ బడ్స్‌ కూడా ఈ మధ్య పిల్లల చేతికి వచ్చేస్తున్నాయి. వీటి విషయంలో తల్లిదండ్రులు అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు శాస్త్రవేత్తలు. అమెరికాలోని మిషిగన్‌ హెల్త్‌ యూనివర్సిటీ పరిశోధకులు ఇటీవల దీనిపైన అధ్యయనం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న- ఐదు నుంచి ఎనిమిదేళ్ళలోపు పిల్లలున్న తల్లిదండ్రుల్లో సగం మంది తమ చిన్నారులు వీటిని వాడుతున్నారని చెప్పారట. వాళ్ళలో 50 శాతం- తమ పిల్లలు గంటపాటు వాడుతున్నారంటే, దాదాపు 10 శాతం మంది రెండుగంటలపాటు కూడా ఉపయోగిస్తున్నారని వివరించారట. ఈ ఫలితాలని చూసి ‘ఇది చాలా ఆందోళనకరమైన పరిణామమ’ని ప్రకటించింది అమెరికన్‌ అకాడమీ ఆఫ్‌ పీడియాట్రిక్స్‌(ఆప్‌) సంస్థ. హెడ్‌ఫోన్స్‌ని హద్దుమీరి ఉపయోగించడం వల్ల పిల్లల చెవుల్లో అప్పుడప్పుడే ఎదుగుతున్న శబ్దగ్రహణ వాహకాలు(ఇయర్‌ కెనాల్స్‌) దెబ్బతింటాయని ప్రకటించింది. ఒక్క వినికిడి సమస్యే కాదు, చెవుల్లో ఎప్పుడూ ఏదో తెలియని శబ్దం వినిపించే ‘టినిటస్‌’ వంటి రుగ్మతలూ వస్తాయని ఆందోళన వ్యక్తంచేసింది. వీలుంటే- పిల్లలకి హెడ్‌ఫోన్స్‌ని పూర్తిగా దూరం చేయడం, లేకపోతే ‘60/60 నియమం’ పాటించడం మంచిదని ఆ సంస్థ సూచిస్తోంది.  ఏమిటీ 60/60 అంటే- రోజు మొత్తంలో 60 నిమిషాలు మాత్రమే వినడం, హెడ్‌ఫోన్స్‌ శబ్దాన్ని 60 శాతానికే పరిమితం చేయడం అట!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..