ఫుడ్‌ట్రెండ్‌

ఈ కాలంలో ఎండను తట్టుకోవడానికి మంచినీళ్లతోపాటు ఇతర ద్రవపదార్థాలనూ ఎక్కువగా తీసుకోవడం తప్పనిసరి. అలాగని ఎప్పుడూ ఒకేరకం పానీయాలను ఏం తాగుతామని అనుకునేవారికి ఇవి సరైన ఎంపికవుతాయి.  

Updated : 17 Mar 2024 04:10 IST

ఈ కాలంలో ఎండను తట్టుకోవడానికి మంచినీళ్లతోపాటు ఇతర ద్రవపదార్థాలనూ ఎక్కువగా తీసుకోవడం తప్పనిసరి. అలాగని ఎప్పుడూ ఒకేరకం పానీయాలను ఏం తాగుతామని అనుకునేవారికి ఇవి సరైన ఎంపికవుతాయి.  


సబ్జాగింజలతో పానీయాలు...

వేసవిలో తీసుకునే పదార్థాల్లో సబ్జాగింజలు కూడా ఒకటి. ఓ గ్లాసు చల్లని నీళ్లలో కాసిని సబ్జాగింజల్ని వేసుకుని తాగితే ఎంత హాయిగా అనిపిస్తుందో తెలిసిందే. అయితే సబ్జాగింజల్ని కేవలం నీళ్లతోనే ఎందుకు తీసుకోవాలీ అని ఆలోచించిన తయారీదారులు.. ఇప్పుడు పండ్లరసాల్లోనూ వాటిని వేసి... బేసిల్‌సీడ్‌ ఫ్రూట్‌ డ్రింక్స్‌ను తయారు చేస్తున్నారు. మామిడి, దానిమ్మ, కమలాఫలం, ద్రాక్ష, పైనాపిల్‌, అవొకాడో... వంటివాటితో పండ్లరసాలను తయారుచేసి.. వాటిల్లో సబ్జాగింజల్ని వేసి సీసాల్లో అమ్ముతున్నారు. అంటే... అటు జ్యూస్‌ తాగుతూనే ఇటు సబ్జాగింజల్నీ తీసుకోవచ్చన్నమాట.
అదేవిధంగా ఫలూదా తయారీలో సేమియాతోపాటు సబ్జాగింజలు, రూఅఫ్జా, ఇతర పండ్లరసాల సిరప్‌లను వేయడం చూస్తుంటాం. ఇప్పుడు అవీ సబ్జాగింజలతోనే దొరుకుతుండటం వల్ల... ఫలూదాలో అదనంగా ఆ గింజల్ని వేయాల్సిన పనినీ తగ్గించేస్తున్నారు తయారీదారులు. వాటినీ వాడేద్దామా మరి.


మంచినీళ్లకు పండ్ల రుచి...

మిగిలిన సీజన్లతో పోలిస్తే... మంచినీటిని ఎండాకాలంలోనే ఎక్కువగా తాగుతాం. అయితే ఆ నీళ్ల రంగు, రుచి మనం కోరుకున్నట్లుగా మారిపోతే... సాధారణ నీళ్లే పండ్లరసం తరహాలో తక్షణశక్తినీ అందిస్తే... భలే ఉంటుందనుకునేవారికోసం ఇప్పుడు ‘వాటర్‌ ఎన్‌హాన్సర్లు’ దొరుకుతున్నాయి. పుచ్చకాయ, ఆపిల్‌, స్ట్రాబెర్రీ, మామిడి, జామ, పైనాపిల్‌... తదితర పండ్ల రసాలను ఇలా ఎన్‌హాన్సర్లుగా తయారుచేస్తున్నారు. తాగే నీటిలో ఈ ఎన్‌హాన్సర్‌ను ఒకటిరెండు చెంచాలు కలిపితే చాలు.. నీటికి ఆ పండ్ల రుచి రావడంతోపాటూ రంగూ మారిపోతుంది. అన్నింటికీ మించి ఈ ప్యాక్‌లను వెంట
తీసుకెళ్లేందుకు వీలుగా చిన్నసైజులో డిజైను చేయడంతో... ఎక్కడున్నా మంచినీటిని మనకు నచ్చినట్లుగా తాగొచ్చు. జ్యూస్‌కు ప్రత్యామ్నాయంగానూ వాడుకోవచ్చు.


సోడా.. ఇలా కూడా

ల్లని గోలీసోడా తాగినప్పుడు ఎంత హాయిగా అనిపిస్తుందో చెప్పక్కర్లేదు. ఇప్పుడిప్పుడే ఎండలూ పెరుగుతున్నాయి కాబట్టి... ఈ సమయంలో తీసుకునే పానీయాల్లో సోడా కూడా ఉండాల్సిందేనని కోరుకునేవారు సాధారణ సోడా కాకుండా ఈ రకాలను ఎంచుకుంటే సరి. ఎందుకంటే.. ఈ సోడాలను పైనాపిల్‌, గ్రీన్‌ ఆపిల్‌, బ్లూబెర్రీ, పీచ్‌, మిక్స్‌డ్‌ఫ్రూట్‌... వంటి పండ్ల ఫ్లేవర్లలో తయారుచేశారు మరి. అదేవిధంగా ప్రొబయోటిక్‌ రూపంలోనూ సోడా దొరికేస్తోందిప్పుడు. సాధారణ సోడాకు ప్రత్యామ్నాయంగా వచ్చేసిన ఈ పానీయాలు.. అటు సోడాతోపాటూ ఇటు పండ్లరసాన్నీ తాగిన భావనని కలిగిస్తాయి.


చెరకు, కొబ్బరినీళ్లు పొడి రూపంలో!

ఎండలో బయటకు వెళ్లినప్పుడు బాగా దాహం వేసిందనుకోండీ... చల్లని మంచినీళ్లు, కొబ్బరినీళ్లు, చెరకు రసం వంటివే  తాగుతాం కదూ... మంచినీళ్లసీసాను అయితే వెంట తీసుకెళ్లొచ్చు కానీ కొబ్బరినీళ్లు, చెరకురసం లాంటివాటిని అన్నిసార్లూ సీసాల్లో పోసుకుని బ్యాగుల్లో వేసుకుని వెళ్లడం కుదరకపోవచ్చు. అలాగని వెళ్లిన ప్రతిచోటా అవి దొరక్కపోతే ఎలా అనుకునేవారికోసం ఇప్పుడు చెరకురసం, కొబ్బరినీళ్లు, నిమ్మకాయనీళ్లు, పచ్చిమామిడికాయతో చేసే ఆమ్‌పన్నా వంటివన్నీ పొడి రూపంలో సాచెట్లుగా వచ్చేస్తున్నాయి. బ్యాగులో ఈ సాచెట్లను వేసుకెళ్తే చాలు.. బాగా దాహంగా అనిపించినప్పుడు.. ఈ సాచెట్లలోని పొడిని నీళ్లలో కలిపితే అప్పటికప్పుడు కొబ్బరినీళ్లు, నిమ్మరసం, చెరకురసం తయారవుతాయి. అంటే... ఎక్కడున్నా మనకు కావాల్సిన పానీయాన్ని నిమిషాల్లో తాగేయొచ్చన్నమాట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..