ఈ సాగు... మీకు తెలుసా?

పొలంలో రకరకాల పంటలు పండించుకోవడం అందరికీ తెలుసు. ఈ మధ్య పెరట్లోనూ మిద్దెల మీదా కూడా పండిస్తున్నారు. వాటన్నిటికీ భిన్నంగా నగరాల్లో చేస్తున్న సాగు గురించి తెలుసా..?

Published : 30 Mar 2024 23:29 IST

పొలంలో రకరకాల పంటలు పండించుకోవడం అందరికీ తెలుసు. ఈ మధ్య పెరట్లోనూ మిద్దెల మీదా కూడా పండిస్తున్నారు. వాటన్నిటికీ భిన్నంగా నగరాల్లో చేస్తున్న సాగు గురించి తెలుసా..?


ఆఫీసులో వ్యవసాయం!

‘అర్బన్‌ ఎలివేటెడ్‌ ఫామింగ్‌’ గురించి విన్నారా ఎప్పుడైనా? ‘స్థలం చాలా విలువైనది, ప్రతి చదరపు అడుగునీ పూర్తిగా వినియోగించుకోవాలి’ అని నమ్ముతున్న కొందరు ఈ పేరుతో ఏం చేస్తున్నారంటే- ఆఫీసుల్లో క్యాబిన్లూ గదుల మధ్య ఉండే పార్టిషన్ల స్థానంలో, ఇతర ఖాళీ చోటుల్లో వర్టికల్‌ ఫామింగ్‌ పద్ధతిలో మొక్కల్ని ఏర్పాటుచేస్తున్నారు. హైడ్రోపోనిక్స్‌, ఏరోపోనిక్స్‌ విధానాల్లో, కృత్రిమమేధతో పనిచేసే సెన్సార్లతో ఎల్‌ఈడీ లైట్లతో వెలుతురునీ ఉష్ణోగ్రతల్నీ నియంత్రిస్తూ తక్కువ నీటితో రకరకాల కూరగాయల్నీ ఆకుకూరల్నీ పండిస్తున్నారు. కంప్యూటర్‌ తెరలకు కళ్లప్పగించే ఉద్యోగులకు పక్కనే ఉన్న ఈ పచ్చని మొక్కల్ని చూడడం రిలీఫ్‌గా ఉంటుంది. మొక్కల సంరక్షణలో వాళ్లూ భాగస్వాములు కావచ్చు. క్రిమిసంహారకాలూ, రసాయన ఎరువులూ వాడని శుభ్రమైన కూరగాయల్ని ఇంటికి తీసుకెళ్లొచ్చు. ఇన్నిరకాల లాభాలున్నప్పుడు ఎవరు మాత్రం వ్యాపార అవకాశాల్ని వదులుకుంటారు... అందుకే పలు దేశాల్లో ఇప్పుడు పెద్ద పెద్ద ఆఫీసుల్లోని ఖాళీ స్థలాల్ని కంపెనీలు లీజుకు తీసుకుంటున్నాయి. అగ్రిప్లే, ఫామ్‌జీరో, ఏరియా2ఫామ్స్‌... లాంటి అంతర్జాతీయ సంస్థలు ఇప్పుడు ఈ పనిలో బిజీగా ఉన్నాయి.  


ఇంట్లోనే... మైక్రో గ్రీన్స్‌!

మొలకెత్తిన గింజల్లో పోషకవిలువలు ఎక్కువగా ఉంటాయని అందరికీ తెలుసు కదా. అదే మైక్రోగ్రీన్స్‌ కాన్సెప్ట్‌కి పునాది అయింది. ఆరోగ్యం పట్ల ప్రజల్లో పెరుగుతున్న స్పృహ దానికి తోడై నగరాల్లో ఎందరికో ఉపాధి చూపిస్తోంది. బాల్కనీనో, ఇంట్లోని ఒక గదినో అందుకు కేటాయించి నెలకి లక్షల్లో సంపాదిస్తున్నారు కొందరు. మైక్రోగ్రీన్స్‌ అంటే మరేమిటో కాదు, లేలేత మొక్కలు. మట్టి అక్కర్లేకుండా నీటిలోనో, లేదా కోకోపీట్‌ని ఉపయోగించో వెడల్పాటి ట్రేలలో పెంచే చిన్ని చిన్ని మొక్కలు. బ్రోకలీ, కేల్‌, ముల్లంగి, సన్‌ఫ్లవర్‌, బఠానీ, కొత్తిమీర... లాంటివన్నీ ఇలా మొలకెత్తించవచ్చు. కొద్ది రోజుల్లోనే మొలకెత్తి పలు విటమిన్లూ ఖనిజాలతో పోషకాల గనులుగా మారతాయివి. తెగుళ్ల బెడద ఉండదు. నాణ్యమైన విత్తనాలు నాటి గాలీ వెలుతురూ తగినంత ఉండేలా చూసుకుంటే చాలు. ఒకవేళ ఇంట్లోకి చాలినంత వెలుతురు రాదనుకుంటే ఎల్‌ఈడీ లైట్లనీ వాడవచ్చు. పెద్ద ఖర్చూ శ్రమా ఏమీ అక్కర్లేదు. మైక్రోగ్రీన్స్‌ పెంపకానికి కావలసిన సెట్లనూ మొక్కలకు కావలసిన పోషకాలు కలిపిన ద్రావణాలనూ ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నాయి పలు సంస్థలు. ఇలా ఇళ్లలో పండించిన మైక్రో గ్రీన్స్‌ని హోటళ్లకీ సూపర్‌ మార్కెట్లకీ సరఫరా చేయొచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..