వంటలో కిటుకులు...షెఫ్‌లే చెబుతారు!

మనకు తెలిసిన వంటకు నైపుణ్యాలు తోడైతే... రోజువారీ చేసే కూరలూ, పప్పులూ హోటల్‌ రుచుల్లో అదిరిపోతే... ప్రముఖ షెఫ్‌ల అనుభవాలు పాఠాలుగా వినే అవకాశం వస్తే...

Published : 31 Mar 2024 00:01 IST

 

మనకు తెలిసిన వంటకు నైపుణ్యాలు తోడైతే... రోజువారీ చేసే కూరలూ, పప్పులూ హోటల్‌ రుచుల్లో అదిరిపోతే... ప్రముఖ షెఫ్‌ల అనుభవాలు పాఠాలుగా వినే అవకాశం వస్తే... మనమూ నలభీముల్లా వంటల్లో ఆరితేరిపోతాం కదూ. అందుకోసమే కొందరు ట్యూటర్లు అందుబాటులో ఉన్నారిప్పుడు.

వంట చేయడం ఏమైనా బ్రహ్మ విద్యా ఏమిటి... మూకుడులో కూర ముక్కలు పడేసి కాస్త ఉప్పూ, కారం, మసాలా వేస్తే చాలు. నిమిషాల్లో కూర రెడీ అయిపోతుంది’ అని చెప్పేస్తుంటారు కొందరు. కానీ నిజానికి వంట అనేది బ్రహ్మ విద్యే. అరవైనాలుగు కళల్లో వంట కూడా ఒకటి. ఒక కూర చేయడానికి ఇంట్లో/హోటల్‌లో వాడే పదార్థాలు దాదాపు ఒకటే అయినా రంగు, రూపు, రుచిలో ఎంతో కొంత తేడా కనిపిస్తుంది.

ఎందుకంటే హోటళ్లలో మాస్టర్‌ షెఫ్‌లు అదనంగా ఏవైనా పదార్థాలు వేయొచ్చు లేదా వండే విధానంలోనే కొన్ని మెలకువలు పాటించొచ్చు. ఆ కిటుకులతోపాటు తమ అనుభవాలనూ, వండే
విధానాన్నీ తెలియజేసేందుకే మాస్టర్‌ షెఫ్‌లు ప్రత్యేక తరగతుల్ని అందిస్తున్నారిప్పుడు. అలా నేర్పించేవారిలో సెలబ్రిటీ షెఫ్‌లుగా పేరుపొందిన సంజీవ్‌కపూర్‌, రణ్‌వీర్‌ బ్రార్‌, వికాస్‌ ఖన్నా వంటివాళ్లు ఉన్నారు. వీళ్లతోపాటు మరికొందరు ట్యూటర్లు సైతం ఇప్పుడు ఆన్‌లైన్‌లో గంటకు ఇంత చొప్పున తీసుకుంటూ వంటలకూ ట్యూషన్లు చెబుతున్నారు. నిజానికి ఒకప్పుడు కేకులు, కప్‌కేకులు, బిస్కెట్లు, కుకీలు, జామ్‌, స్క్వాష్‌... వంటి వంటకాలను నేర్చుకోవాలనుకునేవారికి వారం, పదిరోజులు, రెండువారాల చొప్పున తరగతులు నిర్వహించేవారు. కానీ వంటల ఛానళ్లూ, వెబ్‌సైట్లూ అందుబాటులోకి వచ్చాక ప్రతిఒక్కరూ వాటిని చూస్తూ ఇంట్లోనే ప్రయోగాలు చేయడం మొదలుపెట్టారు. అయినా కూడా ఒక్కోసారి చేసిన వంటకం అనుకున్న రుచిలో రాకపోవచ్చు. ఎక్కడో పొరపాటు జరగొచ్చు. అవేవీ లేకుండా చేయి తిరిగిన వంటవాళ్లలా మారాలనుకునేవారికోసమే ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

ఏమేం నేర్పిస్తారంటే...

కొందరు రోజువారీ వంటను చేయడానికే ఎంతో సమయం తీసుకుంటారు. ప్రతి పదార్థాన్నీ కొలతల ప్రకారం వేస్తున్నా కూడా ఏదో ఒక పొరపాటు చేస్తూనే ఉంటారు. మరికొందరేమో ఆడుతూపాడుతూనే గంటలోనే వంట ముగించేస్తుంటారు. పైగా అద్భుతంగానూ వండేస్తుంటారు. వంటలపైన నామమాత్రపు అవగాహన ఉన్నవారికీ, అద్భుతంగా చేయగలిగినవారికీ కూడా ఈ కోర్సులు సరైన ఎంపికవుతాయి. ఉదాహరణకు పిల్లలకు వంటలు నేర్పించాలనుకుందాం. అలాంటప్పుడు వాళ్లను ఎక్కడికో పంపించకుండా లేదా ఇంట్లోనే మనకు తెలిసినట్లుగా చెప్పకుండా ఆన్‌లైన్‌ ట్యూటర్లను ఎంచుకోవచ్చు. వాళ్లు గంటల చొప్పున ఫీజు తీసుకుని పిల్లల వయసుకు తగినట్లుగా చేయగలిగిన వంటకాలను
నేర్పిస్తారు. అదేవిధంగా వంటల్లో ప్రవేశం ఉండి మరిన్ని మెలకువలు నేర్చుకోవాలనుకునేవారికీ ఈ ట్యూటర్లు అందుబాటులో ఉన్నారు. అలా చెబుతున్నవారిలో ‘కుష్బూ కుకింగ్‌’, ‘ద షెఫ్‌ అండ్‌ ద డిష్‌’, ‘మంజూస్‌ కుకింగ్‌క్లాసెస్‌’... వంటివి అందుబాటులో ఉన్నాయి. వ్యక్తిగత అవసరాలకు తగినట్లుగా కస్టమైజ్డ్‌ తరగతులు నిర్వహించేవీ ఉన్నాయి. అదే విధంగా సంజీవ్‌కపూర్‌, వికాస్‌ ఖన్నా, రణ్‌వీర్‌ బ్రార్‌.. వంటివాళ్లూ తరగతుల్ని నిర్వహిస్తూ వంటలు చేయడంలో నైపుణ్యం పెంచుకోవడం కోసం తమకు మాత్రమే ప్రత్యేకమైన చిట్కాలు తెలియజేస్తారు. ఉదాహరణకు సంజీవ్‌ కపూర్‌ తన అకాడమీ అందించే శిక్షణలో భాగంగా వంటకాలను కోర్సుల ద్వారా అందిస్తూనే.. క్లౌడ్‌కిచెన్‌ ఏర్పాటు చేసుకుని దాన్ని విజయవంతం చేసుకునేందుకు అవసరమైన సమాచారాన్ని శిక్షణ రూపంలో అందిస్తారు. ఇక, హైదరాబాద్‌కు చెందిన ‘కలినరీ గురు’ అనే హోటల్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ సైతం.. వంటను వ్యాపారంగా మార్చుకోవాలనుకునేవారికి పూర్తిస్థాయిలో శిక్షణ అందిస్తోంది. కాబట్టి.. వంటలు చేయడంలో ఏ మాత్రం ఆసక్తి ఉన్నా సరే ఇలాంటి వేదికల్ని ఎంచుకుంటే... మనమూ చేయితిరిగిన వంటవాళ్లలా మారిపోవచ్చు. ఆసక్తిని బట్టి.. దాన్నే ఓ వ్యాపారంగానూ మార్చుకోవచ్చు. ఏమంటారూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..