నింగి తెరపై... డ్రోన్‌ షో!

ఆకాశంలో రెక్కల గుర్రం ఎగురుతుంది. చీకటిని చీల్చుకుంటూ చిరుత ఒకటి దూసుకెళుతుంది. చేతికి అందేంత ఎత్తులో నక్షత్రాలు నాట్యమాడతాయి. నింగి నుంచి దేవకన్య అలా నేల మీదకొస్తుంటుంది...

Published : 31 Mar 2024 00:25 IST

ఆకాశంలో రెక్కల గుర్రం ఎగురుతుంది. చీకటిని చీల్చుకుంటూ చిరుత ఒకటి దూసుకెళుతుంది. చేతికి అందేంత ఎత్తులో నక్షత్రాలు నాట్యమాడతాయి. నింగి నుంచి దేవకన్య అలా నేల మీదకొస్తుంటుంది... ఇలా చెబుతూపోతే ఇవన్నీ కల్పితాలనీ, కథల్లో విన్నామనీ అంటారేమో! నిజమండీ బాబూ... టెక్నాలజీ సాయంతో నీలాకాశంలో అద్భుతాలను సృష్టిస్తున్నారు టెక్‌ గురూలు. రంగు రంగుల లైట్లతో మిరుమిట్లు గొలిపే డ్రోన్లను నింగిలోకి పంపి, రకరకాల కళాత్మక దృశ్యాలుగా ఆవిష్కరిస్తున్నారు.

పెళ్ల్లిలో మూడుముళ్లు పడి.. ఏడడుగులు వేశాక అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు. రఘు- శ్రావణిల పెళ్లిలోనూ ఆ తంతుకు వేళయ్యింది. అందరూ ఆరుబయటికి వచ్చారు. సంప్రదాయం ప్రకారం రఘు.. శ్రావణికి ఆకాశంవైపు వేలు చూపిస్తూ అరుంధతి నక్షత్రాన్ని చూడమన్నాడు. పైకి చూసిన శ్రావణి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది.. అంతలోనే అబ్బురపడిపోయింది. నీలాకాశంలో అరుంధతి నక్షత్రానికి బదులు శ్రావణి పేరు కనిపించడమే అందుకు కారణం. కొత్త పెళ్లికూతురును సరికొత్తగా సర్‌ప్రైజ్‌ చేసిన రఘు లేజర్‌ లైట్లను గానీ, చిన్న చిన్న విద్యుత్తు బల్బుల ఏర్పాటుగానీ ఏమీ చేయలేదు. అవేమీ లేకుండా ఆకాశంలో అంత ఎత్తున శ్రీమతి పేరును ప్రదర్శించి అందరి చేతా వావ్‌ అనిపించుకున్నాడంటే అదంతా డ్రోన్ల మహత్యమే!!

కోడింగ్‌ చేసి...

సాధారణంగా డ్రోన్లు అనగానే పెళ్లిళ్లలోనూ ఇతర ఫంక్షన్లలోనూ సర్రుమంటూ సౌండ్‌ చేస్తూ... రయ్‌మంటూ మన తలపైన తిరుగుతూ ఫొటోలూ వీడియోలూ తీస్తూ కనిపిస్తుంటాయి. క్రమంగా పలు రంగాల్లో రకరకాల వస్తువుల్ని సరఫరా చేసే బాధ్యతలనూ అవి భుజానికెత్తున్నాయి. పక్షుల్లా గాల్లోకి ఎంత ఎత్తైనా ఎగురుతూ రకరకాల పనులు చేసి పెట్టే ఈ డ్రోన్లను కళాత్మక ప్రదర్శనలు ఇవ్వడానికి ఎందుకు వాడకూడదూ అనుకున్నారు టెక్‌ గురూలు. రంగురంగుల ఎల్‌ఈడీ లైట్లను అమర్చిన చిన్న డ్రోన్లను ప్రత్యేకంగా తయారు చేసి, వాటిని ఆకాశంలోకి పంపి- రకరకాల ఆకృతుల్లో కళాత్మకంగా డిస్‌ప్లే చేస్తున్నారు. సందర్భాన్ని బట్టి వేడుకలకు డ్రోన్ల ద్వారా కొత్త కళను తీసుకొస్తున్నారు. అది స్వాతంత్య్ర దినోత్సవం అయితే జాతీయ పతాకం రెపరెపలాడుతుంటుంది. వరల్డ్‌ కప్‌ సమయంలో... క్రీడాకారులు ఆకాశంలో బ్యాటింగ్‌ చేస్తుంటారు. అటవీ దినోత్సవం నాడు... అంతెత్తులో జింకలు గంతులు వేస్తుంటే సింహం పరుగులు తీస్తుంటుంది. రాత్రివేళ స్థిరంగా ఆకాశంలో వెలిగే నక్షత్రాలే ఎంతో బాగుంటాయి. క్షణంలో మెరిసి మరునిమిషంలో మాయమయ్యే ఈ డ్రోన్‌ చిత్రాలైతే రెప్పవాల్చనీయని అద్భుతాలే.  ఇంతకీ ఈ డ్రోన్లను ఆకాశంలోకి పంపాక అక్కడ ఒకదానితో ఒకటి తగలకుండా.. చక్కని ఆకృతిలోకి ఎలా వస్తాయి అనుకోవచ్చు ఎవరైనా. మబ్బుల కాన్వాస్‌ మీద ఏ దృశ్యాన్ని ప్రదర్శించాలో ముందుగా ఓ చిత్రం గీసుకుంటారు. దాన్ని డిజిటలైజ్‌ చేసి ప్రోగ్రామింగ్‌ ద్వారా డ్రోన్లకు అనుసంధానం చేస్తారు. వాటికి నంబర్లు ఇచ్చి, ఏది ఏ పొజిషన్‌కి ఎప్పుడు రావాలో కూడా కోడింగ్‌ చేస్తారు. నేల మీద నుంచి డ్రోన్లు ఆకాశంలోకి ఎగిరింది మొదలు.. కంప్యూటర్‌ ముందు కూర్చుని ప్రోగ్రామరే వాటిని నడిపిస్తుంటాడు. ఒకప్పుడు క్రీడలూ, ప్రభుత్వ సంబంధిత కార్యక్రమాల ప్రదర్శనకు ఈ డ్రోన్‌ షోలను ఏర్పాటు చేసేవారు. ఇప్పుడు అయినవారికి మనసులోని మాట చెప్పడానికీ, సర్‌ప్రైజ్‌ చేయడానికీ వీటిని ఉపయోగిస్తున్నారు. ఈ ప్రదర్శనలు ఇవ్వడానికి మార్కెట్‌లో పలు స్టార్టప్‌లు పుట్టుకొచ్చాయి. డ్రోన్లను ఆకాశంలో ఎగురవేయడానికి ఏవియేషన్‌ అనుమతులు కూడా వాళ్లే తీసుకుని మనకు కావల్సిన షోలు ప్రదర్శించి... ఆకాశంలో అద్భుతాలను సృష్టిస్తారన్న మాట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..