స్మార్ట్‌గా న్యాయసేవలు

కోర్టులతో పని పడినప్పుడు సరైన న్యాయ వాదిని ఎంపిక చేసుకోవడం, న్యాయసలహాలు తీసుకోవడం వంటివాటికి చాలా సమయం పడుతుంది. పైగా కేసులను త్వరగా పరిష్కరించుకోవాలంటే నమ్మకమైన లాయర్‌ కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.

Updated : 07 Apr 2024 06:34 IST

కోర్టులతో పని పడినప్పుడు సరైన న్యాయ వాదిని ఎంపిక చేసుకోవడం, న్యాయసలహాలు తీసుకోవడం వంటివాటికి చాలా సమయం పడుతుంది. పైగా కేసులను త్వరగా పరిష్కరించుకోవాలంటే నమ్మకమైన లాయర్‌ కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అలాంటి న్యాయపరమైన విషయాల్లో సాయపడుతూ లాభాల బాటలో నడుస్తున్నాయి కొన్ని స్టార్టప్‌లు.


ఏఐ పరిష్కారాలు

వాయిదాల మీద వాయిదాలతో కోర్టుల్లో కేసులు తేలేసరికి ఏళ్లకేళ్లు గడిచిపోతుంటాయి. సివిల్‌ కేసులైతే మరీ దశాబ్దాల పాటు కొనసాగుతుంటాయి. అందుకే మధ్యవర్తిత్వం(ఆర్బిట్రేషన్‌) వంటి ప్రత్యామ్నాయ వివాద పరిష్కార మార్గాల(ఏడీఆర్‌)ను ప్రభుత్వం, న్యాయవ్యవస్థలు ప్రోత్సహిస్తున్నాయి. టైమ్‌ను రూపాయిల్లో కొలిచే వ్యాపార సంస్థలకైతే ఈ ఆర్బిట్రేషన్‌ వల్ల చాలా డబ్బు, సమయం కలిసొస్తాయి. అందుకోసమే కృత్రిమమేధ సాయంతో ‘జూపిటిస్‌ జస్టిస్‌’ అనే సంస్థను స్థాపించాడు దిల్లీకి చెందిన రమణ్‌ అగర్వాల్‌. ఇది ప్రపంచంలో మొట్టమొదటిసారి డిజిటల్‌ ఏడీఆర్‌ సేవలను అందించే ప్లాట్‌ఫామ్‌గానూ పేరుపొందింది. కొనుగోళ్లూ అమ్మకాలకు సంబంధించిన వివాదాల్నీ- కమర్షియల్‌, సివిల్‌ తగాదాల్నీ మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరిస్తుంది జూపిటిస్‌. ఈ తరహా సేవలు కావల్సినవారు ఎవరైనా ఆ వెబ్‌సైట్‌లోకి వెళ్లి కేసు వివరాలను నమోదు చేస్తే చాలు- ఆన్‌లైన్‌ ద్వారానే లీగల్‌ పనులన్నీ చేసి సమస్యను పరిష్కరిస్తుంది. ఈ డిజిటల్‌ జస్టిస్‌ ప్లాట్‌ఫామ్‌లో ఇంతవరకు రెండు కోట్లకు పైగా కేసులు నమోదుకాగా,  రూ.8వేల కోట్లకు పైగా విలువైన వివాదాలను జూపిటిస్‌ పరిష్కరించింది.  ప్రస్తుతం ముప్ఫై మందికి పైగా సుప్రీంకోర్టు, హైకోర్టు రిటైర్డ్‌ జడ్జిలూ- మూడువేల మందికి పైగా ఏడీఆర్‌ నిపుణులూ జూపిటిస్‌తో కలిసి పని చేస్తున్నారు.


ఉచితంగా న్యాయసలహాలు

విదేశాల్లో న్యాయవాద విద్యను అభ్యసించిన శ్రియ శర్మ పుణెలో ప్రాక్టీస్‌ మొదలుపెట్టింది. ఒకసారి ఆమెను ఓ అరవై ఏళ్ల వృద్ధురాలు  కలిసింది. పిల్లలు విదేశాల్లో స్థిరపడటం, భర్త మరణించడంతో ఒంటరిదైన ఆమె ఆస్తులను కొందరు కబ్జా చేశారు. అధికారం, ధనబలం ఉన్న ఆ వ్యక్తుల్ని ఎదుర్కోలేక ఇబ్బంది పడుతోందని తెలిసి శ్రియ సాయపడింది. ఎంతటి విద్యావంతులకైనా కొన్నిసార్లు న్యాయపరమైన అంశాల్లో అవగాహన ఉండదన్న ఆలోచనతో సామాన్యులకు న్యాయ సలహాలు ఇస్తూ చట్టాలపై అవగాహన కల్పించాలని ప్రాక్టీసు ఆపేసి ‘రెస్ట్‌ ది కేస్‌’ పేరిట స్టార్టప్‌ను ప్రారంభించింది. దేశంలోని 200 నగరాల్లోని వేలమంది లాయర్లతో ఓ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసింది. న్యాయ సలహాలుగానీ, లాయర్ల వివరాలుగానీ కావల్సినవారు ‘రెస్ట్‌ ది కేస్‌’ సైట్‌లోకి వెళ్లి సంప్రదిస్తే చాలు, ఏ సేవనైనా ఆ సైట్‌లో ఉచితంగా అందిస్తారు. ఎలాంటి సమస్యలకి ఏ లాయర్‌ని సంప్రదించాలో చెబుతారు. తక్కువ ఫీజు తీసుకునేలానూ మాట్లాడతారు. న్యాయవాదుల అపాయింట్‌మెంట్‌ కూడా ఇప్పిస్తారు. కేసు ఫైల్‌ చేయడం దగ్గర్నుంచీ సమస్యకు పరిష్కారం దొరికేవరకూ క్లయింట్లనూ లాయర్లనూ సమన్వయం చేస్తూ ఫాలో అప్‌ చేస్తారు. లాయర్లకు కేసులు అప్పగించి రుసుము వసూలు చేసే ఈ సంస్థ నెలకు రెండు కోట్ల రూపాయల ఆదాయం అందుకుంటోంది. హైదరాబాద్‌, బెంగళూరు, గోవా, ముంబయి, పుణె, దిల్లీతోపాటు దాదాపు 200 నగరాలకు చెందిన న్యాయవాదులు ఈ వెబ్‌సైట్‌లో ఉన్నారు. వారికి మెంబర్‌ షిప్పు ఇవ్వడానికి ముందు బార్‌ కౌన్సిల్‌లో ఆరాతీసే శ్రియ ప్రస్తుతం ‘లీగల్లీ స్పీకింగ్‌ విత్‌ రెస్ట్‌ ది కేస్‌’ అనే పాడ్‌కాస్ట్‌ను నడుపుతూ.. చట్టాల గురించి చర్చిస్తుంటుంది.


ఆన్‌లైన్‌ వకీల్‌

బెంగళూరులోని నేషనల్‌ లా స్కూల్‌ విద్యార్థి అయిన హృషికేశ్‌ దతర్‌కు వ్యాపారమంటే ఆసక్తి. అందుకే మొదట్లో కొన్నిరోజులు టీషర్ట్స్‌ బిజినెస్‌ చేశాడు. ఒకసారి ఏదో ఎడ్యుకేషన్‌ సమిట్‌లో పాల్గొన్నప్పుడు ‘ఆన్‌లైన్‌లో అన్ని రకాల సేవలూ లభిస్తున్నాయి. ప్రొఫెషనల్స్‌ ఎవరు కావాలన్నా అక్కడ సులువుగా వెతికి పట్టుకోవచ్చు. కానీ, న్యాయవాదుల గురించి ఎక్కువ వివరాలు దొరకవు ఎందుకు...’ అని అడిగాడొక వ్యక్తి. ఈ మాటలే హృషికేశ్‌లో కొత్త వ్యాపార ఆలోచనకు ప్రాణం పోశాయి. క్లయింట్లకూ, లాయర్లకూ మధ్య వారధిగా పన్నెండేళ్ల క్రితం చెన్నైలో ‘వకీల్‌సెర్చ్‌’ అనే ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాంను అతను ప్రారంభించాడు. కొత్త కంపెనీల రిజిస్ట్రేషన్‌, హక్కుల రక్షణ, ట్యాక్స్‌ ఫైలింగ్‌, ఆస్తి-అద్దె ఒప్పందాలు... ఇలా రకరకాల సేవలు అందించేలా ‘వకీల్‌సెర్చ్‌ను తీర్చిదిద్దాడు హృషికేశ్‌. వ్యాపార సంస్థలకూ, వ్యక్తులకూ అవసరమైన న్యాయసేవలు అన్నింటినీ ఒకేచోట అందుబాటు ధరల్లో అందిస్తూ దేశంలోని ప్రధాన నగరాలూ, పట్టణాలకు సంస్థను విస్తరించాడు. రూ.5 లక్షలతో ప్రారంభమైన ‘వకీల్‌సెర్చ్‌’ విజయవంతం కావడంతో ఆ తరవాత దానికి దాదాపు యాభై కోట్ల రూపాయల పెట్టుబడులూ వచ్చాయి. అవసరమున్న వారు ఆ సైట్‌లోకి వెళ్తే లాయర్లు, ఛార్టర్డ్‌ అకౌంటెంట్లు, కంపెనీ సెక్రెటరీలు.. ఇలా ఎవరి సేవలు కావాలన్నా వెంటనే పొందవచ్చు. అందుకే ఇప్పుడు ఆ సంస్థకు దేశవ్యాప్తంగా అయిదు లక్షల మందికి పైగా కస్టమర్లు ఉన్నారు. లిబ్రా, మై స్టెనో అనే ఆప్‌లను కూడా రూపొందించిన హృషికేశ్‌... న్యాయవాదులకు పలు రకాలుగా టెక్‌ సేవలనూ అందిస్తున్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..