ఫుడ్‌ ట్రెండ్‌

ఎంత వేసవి అయినా... ఎండలు మండిపోతున్నా... అదేపనిగా కొబ్బరినీళ్లు, చల్లని పదార్థాలనే తీసుకోవాలంటే బోరే.

Published : 28 Apr 2024 00:12 IST

ఎంత వేసవి అయినా... ఎండలు మండిపోతున్నా... అదేపనిగా కొబ్బరినీళ్లు, చల్లని పదార్థాలనే తీసుకోవాలంటే బోరే. అలాగే ఈ కాలంలో మాత్రమే దొరికే మామిడిపండ్లను రోజంతా తినాలన్నా తినలేం. తినకుండానూ ఉండలేం. అందుకే... మామిడిపండ్లు, కొబ్బరినీళ్లు, శరీరానికి చల్లదనాన్ని అందించే గుల్కంద్‌ను ఇలా వైవిధ్యంగా తీసుకొచ్చేస్తున్నారు మాస్టర్‌ షెఫ్‌లు. 


చల్లచల్లని కొబ్బరి ఐస్‌క్రీమ్‌

తియ్యగా ఉండే కొబ్బరినీళ్లు గొంతులోకి జారుతుంటే అప్పటివరకూ ఉన్న అలసట అంతా పోయి హాయిగా అనిపిస్తుంది కదూ. ఎండల్లో దాహాన్ని తీర్చి, శక్తినందించి, ఎన్నో పోషకాలను ఇచ్చే కొబ్బరినీళ్లు... కావాలనుకున్నచోట తాగేందుకు వీలుగా సీసాల్లోనూ, పొడిరూపంలోనూ తీసుకురావడం తెలిసిందే. ఇప్పుడు ఐస్‌క్రీమ్‌ తయారీదారులు మరో అడుగు ముందుకేసి కొబ్బరినీళ్ళూ, లేలేత కొబ్బరితో కలిపి ఇదిగో ఇలా పసందైన ఐస్‌క్రీమ్‌ను తయారుచేయడం మొదలుపెట్టారు. ఇంతకీ దీని ప్రత్యేకత ఏంటంటే... కొబ్బరినీళ్ళనూ, బొండాంలో మాత్రమే వచ్చే లేత కొబ్బరినీ మిక్సీపట్టి కాసేపు ఫ్రిజ్‌లో పెడతారు. తరువాత ఆ మిశ్రమంలో క్రీమ్‌, కండెన్స్‌డ్‌మిల్క్‌, ఇంకాస్త లేత కొబ్బరి పేస్టును కలిపి బాగా గిలకొట్టి అయిదారు గంటలు ఫ్రిజ్‌లో ఉంచుతారు. అలా తయారుచేసిన ఐస్‌క్రీమ్‌ తియతియ్యగా, కొబ్బరి రుచిలో వస్తుంది. దీన్ని పెద్ద కంపెనీలు డబ్బాల రూపంలో అమ్మేస్తున్నా... స్థానిక దుకాణందార్లు మాత్రం ఆ ఐస్‌క్రీమ్‌ను అచ్చంగా కొబ్బరి బొండాంలోనే పెట్టి ఇవ్వడంతో దీనికి క్రేజ్‌ పెరిగింది. ఐస్‌క్రీమ్‌లో కొత్త రుచిని కోరుకునేవారు దీన్ని ఒక్కసారి తింటే చాలు... రుచి అమోఘం అనేస్తారంటే నమ్మండి.  


మామిడిపండు... వెరైటీలు మెండు

వేసవిలో మాత్రమే దొరికే మామిడిపండ్లను ఇష్టపడని వాళ్లుండరు. అల్ఫోన్సా, నీలం, బంగినపల్లి, దశేరీ.. అంటూ బోలెడు రకాల్లో ఉంటాయివి. రకాన్ని బట్టి రుచిలోనూ మార్పు ఉండే ఈ మామిడిపండ్లకోసమే ఏడాదంతా ఎదురుచూస్తారు చాలామంది. అలాగని అన్నిరకాలనూ మార్చిమార్చి అదేపనిగా తినడంలో కొత్తదనం ఏముందని అనుకునేవారి కోసం ఇప్పుడు దాంతోనూ ఇతర పదార్థాలను తీసుకొచ్చేస్తున్నారు. ఆ జాబితాలో సిరప్‌, డ్రైడ్‌ చిప్స్‌, చంక్స్‌, సాస్‌, స్లైస్డ్‌ మ్యాంగోస్‌, మిఠాయిలు... వంటివెన్నో ఉన్నాయి. మామిడి పండ్లు దొరుకుతున్నప్పుడు ఇవెందుకూ అనే సందేహం కలిగినా దానికీ సమాధానమిస్తున్నారు తయారీదారులు. ఉదాహరణకు ఫలూదాలోనో, లస్సీలోనో మామిడిపండును వాడాలనుకున్నప్పుడు ఆ పండు మొత్తాన్ని కోసి ఒకటిరెండు ముక్కలు మాత్రమే ఉపయోగించే బదులు సిరప్‌ లేదా సాస్‌ను ఎంచుకోవచ్చు. అదేవిధంగా మామిడిపండు తినడం బానే ఉంటుంది కానీ కోయడమే పని అనుకునేవారికి స్లైసులు పరిష్కారాన్ని చూపిస్తాయి. పిల్లలకు అప్పుడప్పుడూ మామిడిపండును పోలిన జెల్లీ క్యాండీలను ఇస్తే... పండును ఒలుచుకుని తిన్నట్లుగా వీటినీ చప్పరించేస్తారు. ఇవి కాకుండా రసగుల్లా, బర్ఫీ, సోన్‌పాప్‌డీ.. వంటి మిఠాయిలనూ మామిడిపండు గుజ్జుతో కలిపి తయారు చేస్తున్నారు. అదండీ సంగతి... ఈ సీజన్‌లో కేవలం మామిడిపండ్లను మాత్రమే తెచ్చుకోకుండా వీటిల్లో నచ్చినవాటినీ ఎంచుకుంటే... మామిడిపండుతో ఇతర వంటకాలనూ ట్రై చేయొచ్చు.


గుల్కంద్‌ మిఠాయిలివి

ప్రత్యేకమైన గులాబీలను ఎంచుకుని చక్కెర పాకంతో కలిపి ఉడికించి తయారుచేసే గుల్కంద్‌ని సాధారణంగా పాన్‌, ఫలూదా తయారీలో వేయడం చూస్తుంటాం. మౌత్‌ ఫ్రెష్‌నర్‌గానూ పనిచేసే ఈ గుల్కంద్‌ను అక్కడికే పరిమితం చేయడం ఎందుకనుకున్న మిఠాయివాలాలు ఇప్పుడు దాన్ని రకరకాల వంటకాల్లోనూ ఉపయోగించే స్తున్నారు. ఎలాగంటే.. గుజియాగా పిలిచే కజ్జికాయ, సమోసా, పాన్‌స్వీట్‌, గులాబ్‌జామూన్‌.. తదితరాల్లో ఈ గుల్కంద్‌ను స్టఫింగ్‌రూపంలో పెట్టేస్తూనే దీనితో ప్రత్యేకంగా ఐస్‌క్రీమ్‌, లస్సీ లాంటివి తయారుచేస్తున్నారు. గుల్కంద్‌తో పదార్థాలు చేయడం సరే.... అసలు వేసవిలో దీన్నెందుకు తీసుకోవాలనే సందేహం కలిగింది కదూ... నిజానికి గుల్కంద్‌ను నాచురల్‌ కూలెంట్‌గా పిలుస్తారు. వేసవిలో దీన్ని కొద్దిగానైనా తీసుకోవడం వల్ల వేడి ప్రభావం తగ్గడంతోపాటూ ఎండ కారణంగా వచ్చే నిస్సత్తువా, నీరసం వంటివి దరిచేరవు. అతి వేడివల్ల వచ్చే కాళ్లూ చేతుల మంటలూ అదుపులో ఉంటాయి కాబట్టే అప్పుడప్పుడైనా గుల్కంద్‌ను ఏదో ఒక రూపంలో తీసుకోమని చెబుతున్నారు పోషకాహారనిపుణులు. గుల్కంద్‌ మిఠాయిల్ని తరచూ ఏం తింటామనుకునేవారు... చల్లనిపాలల్లో కొద్దిగా గుల్కంద్‌ను కలుపుకుని తాగొచ్చు, లేదా ఐస్‌క్రీమ్‌పైన కాస్త వేసుకుని తినొచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..