అమ్మమ్మ వంటలతో... అమెరికాని మెప్పిస్తున్నాడు!

సినిమాలకి ఆస్కార్‌ అవార్డు ఎలాగో- ప్రపంచంలోని రెస్టరంట్‌లకి ‘మిషెలిన్‌ స్టార్‌’ అలాగ. ఒక్కసారి కాదు- ఆ అవార్డుని పలుమార్లు అందుకున్నవాడు ‘సెమ్మ’ విజయకుమార్‌.

Updated : 28 Apr 2024 13:02 IST

సినిమాలకి ఆస్కార్‌ అవార్డు ఎలాగో- ప్రపంచంలోని రెస్టరంట్‌లకి ‘మిషెలిన్‌ స్టార్‌’ అలాగ. ఒక్కసారి కాదు- ఆ అవార్డుని పలుమార్లు అందుకున్నవాడు ‘సెమ్మ’ విజయకుమార్‌. ‘సెమ్మ’ అన్నది అమెరికాలో అతను నడుపుతున్న సౌత్‌ ఇండియన్‌ రెస్టరంట్‌ పేరు! బయట చూడ్డానికి ఫక్తు అమెరికన్‌ రెస్టరంట్‌లాగే కనిపించినా... దాని కిచెన్‌ ఓ పల్లెటూరి వంటింటిని తలపిస్తుంది. అక్కడున్న సరంజామాలన్నింటిలోనూ రోకలి బండంటే తనకి మహా ఇష్టమంటాడు విజయ్‌. తన అమ్మమ్మకి గుర్తుగా ఇండియా నుంచి తెచ్చుకున్నాననీ చెబుతాడు!
ఆ కథ ఏంటంటే...

రసపట్టి... ఓ కుగ్రామం. అక్కడ- పచ్చటి తమలపాకుల నడుమ నల్లని పోకచెక్కని పెట్టినట్టు పంటపొలాల మధ్య ఉండేది ఓ పూరిపాక. ఆ గుడిసెలోనే విజయకుమార్‌ అమ్మమ్మా తాతయ్యల జీవనం. అతని సెలవులన్నీ అక్కడే గడిచేవట. అక్కడున్న ప్రతిరోజూ ఉదయం తాతయ్యతో కలిసి ‘వేట’కి వెళ్ళేవాడట. పొలంగట్లపైని నత్తలూ, వాగులో తాతయ్య తలపాగని వలగా మార్చి పట్టే చేపలూ, ఇసుకలో దోబూచులాడుతూ దొరికిపోయే పీతలూ, పొదలమాటున నక్కే కుందేళ్ళూ... మధ్యాహ్నానికల్లా వీటిల్లో ఏవి దొరికితే వాటిని పట్టితెచ్చేవారు. నత్తలో పీతలో చేపలో కుందేలో- తాతయ్య వాటిని శుభ్రం చేసేలోపు- పసుపు, మిరియాలు, చింతపండు కలిపి దంచిన మసాలాలు సిద్ధంచేసేదట అమ్మమ్మ. వేటకి వెళ్ళొచ్చిన పిల్లలు- స్నానాదికాలు పూర్తయి వచ్చేలోపే అరటి ఆకులో అన్నమూ కూరా పెట్టి ఎదురుచూస్తుండేదట. ఆ చేతిరుచే తనని వంటవాడిగా నిలబెట్టిందంటాడు విజయ కుమార్‌. ఆ చిననాటి జ్ఞాపకాలనే వంటలుగా మార్చి- అమెరికావాసులతో పంచుకుంటున్నాననీ చెబుతాడు.

నత్తకూర మలుపుతిప్పింది!

తమిళనాడులోని దిండుక్కల్‌ దగ్గర నత్తమ్‌ అనే ఊరు విజయకుమార్‌ది. అక్కడికి వంద కిలోమీటర్ల దూరంలో ఉండేది వాళ్ళమ్మమ్మగారి ఊరు. అమ్మమ్మ చేతి వంటను ఇష్టంగా తినడమే కాదు- ఊహవచ్చాక ఆమెకి వంటల్లోనూ సాయపడ సాగాడు. ఇంట్లోనూ వంటగదిలో తల్లికి చేదోడువాదోడుగా ఉండేవాడు. విజయకుమార్‌ తండ్రి సన్నకారు రైతు. ఆయన పెద్దగా చదువుకోకపోతేనేం- కొడుకు వంటలపైన ఆసక్తితో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు చేస్తాననగానే ఒప్పుకున్నాడు. తిరుచ్చిరాపల్లి లోని ‘స్టేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ క్యాటరింగ్‌ టెక్నాలజీ’లో సీటొస్తే- రూ.50 వేలు అప్పుతెచ్చి మరీ చేర్చాడు. ‘ఎన్నో కలలతో కాలేజీలో అడుగుపెట్టిన నాకు మూణ్ణెళ్ళపాటు ఏదీ బోధపడలేదు. దేశం నలుమూలల నుంచే కాదు విదేశాల నుంచీ వచ్చిన అధ్యాపకులు ఉండేవారు అక్కడ. విద్యార్థుల్లో దాదాపు అందరూ బయటి రాష్ట్రాలవాళ్ళు. ఎవరినోట విన్నా ఇంగ్లిషే. నేనేమో ఇంటర్‌ దాకా తమిళంలో చదువుకున్నవాణ్ణి. దాంతో- సబ్జెక్టులు అర్థంకాక, డౌట్‌లు అడిగేందుకు భాషా రాక నానా అవస్థలు పడ్డాను. ‘పరమ మొద్దు’ అనిపించుకున్నాను. ‘ఊర్లో ఉంటూ పశువులు కాయ్‌’ అన్నవాళ్ళూ లేకపోలేదు. కానీ, ఓసారి ఫ్రెంచ్‌ దేశానికి చెందిన అధ్యాపకుడు ఒకాయన అక్కడి ‘అస్కాగో’ వంట నేర్పిస్తానన్నాడు. అదేమిటా అని చూస్తే... నత్తల వేపుడే! వెంటనే నేను- వచ్చీరానీ ఇంగ్లిషులో దాన్ని మా అమ్మమ్మ అంతకన్నా బాగా ఎలా చేస్తుందో వివరించాను. అది చేసీ చూపాను. ‘అద్భుతం’ అన్నారు తిన్నవాళ్ళు. మా కాలేజీలో నేను అందుకున్న తొలి ప్రశంస అది. దాంతో మొద్దబ్బాయన్న ముద్రపోయింది. మెల్లగా భాషపైన పట్టుసాధించాను. పట్టుదలతో ‘ఉత్తమ విద్యార్థి’గా బయటకొచ్చాను...’ అంటాడు విజయకుమార్‌. ఆ పట్టుదలే అతణ్ణి తాజ్‌ హోటల్స్‌లో షెఫ్‌గా మార్చింది. అట్నుంచటే అమెరికాలోని క్యాలిఫోర్నియాకి వెళ్ళేలా చేసింది! అక్కడ ‘రస’ అనే సౌత్‌ ఇండియన్‌ హోటల్‌లో ప్రధాన షెఫ్‌ అయ్యాడు. ఆ సంస్థకి వరసగా ఐదు మిషెలిన్‌ అవార్డులు సాధించిపెట్టాడు. అంత చేసీ ఏం ప్రయోజనం... కరోనా లాక్‌డౌన్‌తో అమెరికాలోని రెస్టరంట్‌లన్నీ మూతపడ్డాయి. విజయకుమార్‌ ఉద్యోగం పోయింది!

క్లీనర్‌గా వెళ్లి...

‘చేతిలో డబ్బులేదు. కరోనాలో అందరూ అతిశుభ్రత పాటిస్తున్నారు కాబట్టి ఇళ్ళకి వెళ్ళి క్లీనింగ్‌ పనులూ చేశాను. పోనుపోను ఆ పనులూ కరవయ్యాయి. అప్పుడే న్యూయార్క్‌లో ఉంటున్న రోణీ మజుందార్‌, చింతన్‌ పాండ్యా నన్ను సంప్రదించారు. కొత్త తరహా రెస్టరంట్‌ ఏదైనా పెడదామన్నారు. అప్పటిదాకా అమెరికాలో ఉన్న భారతీయ రెస్టరంట్‌లకి ఓ పద్ధతి ఉండేది. అవి మన వంటల్ని అమెరికన్‌ల కోసం ఉప్పూ కారం తగ్గించి చప్పగా అందించేవి. లేదా ‘ఫ్యూజన్‌’ అంటూ మోడర్న్‌ ప్రయోగాలు చేసేవి. నేను అలా కాకుండా- మా అమ్మమ్మ చేతి రుచిని యథాతథంగా తీసుకురావాలనుకున్నాను. అందుకే ‘సెమ్మ’(అదిరింది- అని అర్థం)ని ప్రారంభించాను. నత్తల వేపుడు, చేపల పులుసు, వేటమాంసం ‘బోటీ’... ఇలా అచ్చమైన పల్లెరుచుల్ని ఇవ్వడం మొదలు పెట్టాను. మా అమ్మ 22 మసాల దినుసులతో చేసే ప్రత్యేక సాంబార్‌ని పరిచయం చేశాను. వాటిని తిన్న అమెరికన్‌లు ‘భారతీయ రుచులు ఇంత అద్భుతంగా ఉంటాయనుకోలేదు’ అంటూ లొట్టలేశారు. ఆ ప్రశంసలే ఏడాది తిరక్కుండానే మా రెస్టరంట్‌కి మిషెలిన్‌ స్టార్‌ని ఇప్పించాయి. ఈ మధ్యే అమెరికాలోని ‘టాప్‌-10’ రెస్టరంట్‌లలో ఒకటిగా గుర్తించింది న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక!’ అంటాడు విజయకుమార్‌. అంతేకాదు- ‘ఇంతచేసినా- మా అమ్మ, అమ్మమ్మ చేతి రుచిలో సగం కూడా తీసుకురాలేకపోతున్నాను...’ అని కూడా అంటాడు నవ్వుతూ.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..