ఆ కాన్పుని... ముందుగా పసిగట్టొచ్చా?

మామూలుకన్నా గర్భిణుల్లో గుండెకొట్టుకునే వేగంలో మార్పు వస్తుందని మనకి తెలుసు! ‘ఆ మార్పుల్ని సరిగ్గా అంచనావేసి నెలలు నిండకుండానే జరిగే కాన్పుల్ని అడ్డుకోవచ్చా?

Published : 18 Feb 2024 00:09 IST

మామూలుకన్నా గర్భిణుల్లో గుండెకొట్టుకునే వేగంలో మార్పు వస్తుందని మనకి తెలుసు! ‘ఆ మార్పుల్ని సరిగ్గా అంచనావేసి నెలలు నిండకుండానే జరిగే కాన్పుల్ని అడ్డుకోవచ్చా? కనీసం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవచ్చా?’ అన్న దిశగా పరిశోధిస్తున్నారు శాస్త్రవేత్తలు. గుండె వేగాన్ని(హార్ట్‌ రేట్‌ వేరియబుల్స్‌- హెచ్‌ఆర్‌వీ) కొలిచే వాచ్‌లాంటి పరికరాల వాడకం ఇటీవల పెరుగుతున్న నేపథ్యంలో ఇది సులభం కూడానని చెబుతున్నారు అమెరికాలోని వెస్ట్‌ వర్జీనియా వర్సిటీ పరిశోధకులు. ప్రపంచంలోని 15 దేశాల్లో వీటిని వాడుతున్న సుమారు 250 మంది గర్భిణుల ‘హెచ్‌ఆర్‌వీ’ని వీళ్ళు విశ్లేషించారు. నెలలు పూర్తిగా నిండాక ప్రసవించిన వారిలో- గర్భం ధరించాక గుండెకొట్టుకునే వేగం సాధారణంకన్నా తగ్గి, ఏడో నెల(35వ వారం నుంచి) పెరగడాన్ని చూశారట. అదే- నెలలు నిండక ముందే కాన్పయినవారిలో ఏడునెలలప్పుడు పెరగాల్సిన గుండెవేగం ముందుగానే ఎక్కువకావడం, మళ్ళీ ఉన్నపళంగా తగ్గడం... ఇలా విపరీతమైన హెచ్చుతగ్గుల్ని గమనించారట. కాబట్టి, ఈ అసాధారణ మార్పు ముందస్తు కాన్పుకి సూచికవుతుందన్న నిర్ణయానికి వచ్చారు. దీన్ని గుర్తించగానే జాగ్రత్తలు తీసుకోవడం మంచిదంటున్నారు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..