మైటోకాండ్రియా... మరో గుట్టు వీడింది

మన శరీరం కోట్లాది కణాలతో నిర్మితమైంది. వాటికి శక్తినిచ్చే జనరేటరే మైటోకాండ్రియా. కణంలో ఇదో భాగమే కానీ- అందులో దీనికంటూ సొంత వ్యవస్థ ఉంటుంది. ప్రత్యేక ‘డీఎన్‌ఏ’(ఎండీఎన్‌ఏ) ఉంటుంది. కొన్నిసార్లు ఈ ఎండీఎన్‌ఏ దారిమారి ప్రధాన కణంలోకి పడిపోతుంటుంది.

Published : 17 Mar 2024 00:51 IST

న శరీరం కోట్లాది కణాలతో నిర్మితమైంది. వాటికి శక్తినిచ్చే జనరేటరే మైటోకాండ్రియా. కణంలో ఇదో భాగమే కానీ- అందులో దీనికంటూ సొంత వ్యవస్థ ఉంటుంది. ప్రత్యేక ‘డీఎన్‌ఏ’(ఎండీఎన్‌ఏ) ఉంటుంది. కొన్నిసార్లు ఈ ఎండీఎన్‌ఏ దారిమారి ప్రధాన కణంలోకి పడిపోతుంటుంది. అలా పడ్డ ఎండీఎన్‌ఏని- మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ శత్రువుగా భావించి దాడికి దిగుతుంది. దీన్నే ‘ఆటో-ఇమ్యూనిటీ’ అంటారు. దీని పర్యవసానమే రుమాటాయిడ్‌ ఆర్థ్రైటిస్‌, ఒళ్ళంతా బుడిపెలు వచ్చే లూపస్‌ వంటి సమస్యలు! ‘దీనికంతటికీ మూలమైన ‘ఎండీఎన్‌ఏ’ అసలు ఎందుకు- మైటోకాండ్రియా గడపదాటి బయటకు రావాలి?’ అన్నదానిపైన పరిశోధన చేస్తూ వచ్చిన శాస్త్రవేత్తలు తాజాగా ఆ గుట్టు విప్పారు. అవి తమకు తామే రావట్లేదట. మైటోకాండ్రియాలో ఒక్కోసారి అనవసరమైన ప్రొటీన్‌ చేరిపోతూ ఉంటుంది. అలాంటి చెత్తాచెదారాన్ని ‘ఎండోజోమ్స్‌’ అనే వ్యవస్థ శుభ్రంచేస్తుంటుంది. అలా శుభ్రంచేసేటప్పుడు కాస్త అతిగా స్పందించి ‘ఎండీఎన్‌ఏ’ని కూడా అది బయటకు నెట్టేస్తోందట. ఇల్లు ఊడ్చేటప్పుడు చెత్తాచెదారంతోపాటూ పొరపాటున ఎప్పుడైనా విలువైన వస్తువుల్ని పడేస్తుంటాం కదా... అంటున్నారు. అమెరికాలోని వర్జీనియా స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. సమస్య మూలం తెలిశాక... ఇక మందుని కనిపెట్టడం సులువే నంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..