చిన్న చిన్న కాలేయాలు సృష్టించేస్తారట!

పదిహేనేళ్ళ కిందటి మాట. అమెరికాలో కాలేయం దెబ్బతిన్న ఓ రోగికి చికిత్స చేస్తున్నారు. ఓ దాత ఇచ్చిన ఆరోగ్యకరమైన కాలేయంలోని కణాలు(హెపటోసైట్స్‌) తీసి బాధితుడి కాలేయానికి అందించారు- అక్కడవి కొత్తగా పెరుగుతాయేమోనని.

Updated : 14 Apr 2024 04:37 IST

పదిహేనేళ్ళ కిందటి మాట. అమెరికాలో కాలేయం దెబ్బతిన్న ఓ రోగికి చికిత్స చేస్తున్నారు. ఓ దాత ఇచ్చిన ఆరోగ్యకరమైన కాలేయంలోని కణాలు(హెపటోసైట్స్‌) తీసి బాధితుడి కాలేయానికి అందించారు- అక్కడవి కొత్తగా పెరుగుతాయేమోనని. ఆ ప్రయోగం ఫలితాన్నివ్వలేదు. దాంతో, ఈ హెపటోసైట్స్‌ కణాలు ఒక్క కాలేయంలోనే కాకుండా ఇంకెక్కడైనా పెరిగే అవకాశముందా... అని చూడాలనుకున్నారు. ఎలుకలపైన ప్రయోగానికి తెరతీశారు. కాలేయ సమస్యలున్న ఎలుకల శరీరంలోకి- ఆరోగ్యకరమైన ఎలుకలకి చెందిన హెపటోసైట్స్‌ కణాలు ఎక్కించారు. వ్యాధిబాధిత ఎలుకల్లో చాలావరకు చనిపోతే- ఓ రెండు బతికాయి. వాటి శరీరాల్ని పరీక్షిస్తే- పొత్తికడుపులో చిన్నచిన్న కాలేయాలు కనిపించాయట! అంటే, వీళ్ళు ఎక్కించిన కణాలు అసలైన కాలేయాలుగా మారాయట! ఒట్టికణాలు కాలేయంగా ఎలా మారాయా అని పరీక్షిస్తే- అవన్నీ ఎలుకల శరీరంలోని ‘లింఫ్‌నోడ్స్‌’లోకి వెళ్ళడంవల్లే అలా అయ్యాయని తేలిందట. లింఫ్‌నోడ్స్‌ అన్నవి- రోగనిరోధక వ్యవస్థకి సంబంధించిన గ్రంథులు. వీటిల్లోకి వెళ్ళిన కణాలు అక్కడి రక్తనాళాల సహకారంతో ఏకంగా చిన్నసైజు కాలేయంగానే మారాయన్న మాట! దాంతో పందులూ, కుక్కల్లోనూ హెపటోసైట్స్‌ కణాల్ని పంపించి చూశారు. వాటి లింఫ్‌నోడ్స్‌లోనూ మినీ కాలేయాలు సృష్టించి సక్సెస్‌ అయ్యారు. తాజాగా మనుషుల్లోనూ ప్రయోగించారు. 12 మంది తీవ్ర కాలేయ వ్యాధి బాధితుల లింఫ్‌ నోడ్స్‌లలోకి ఈ కణాలని పంపించారు. అమెరికాలోని లీజెనిసస్‌ బయోటెక్నాలజీ సంస్థ నిర్వహిస్తున్న ఈ ప్రయోగం ఫలితాలు రావడానికి మరో మూణ్ణాలుగు నెలలు పట్టొచ్చు. ఇదిగనక విజయం సాధిస్తే- కాలేయ చికిత్సలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటాయి. ఓ దాత నుంచి తీసుకున్న కాలేయంతో ఏకంగా 75 మందికి చికిత్స చేయొచ్చని చెబుతున్నారు పరిశోధకులు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..