సంగీతం... చెవులకే కాదు!

కొన్ని పాటలు శరీరంలో పులకలు తెప్పిస్తాయి. మరికొన్ని చల్లటిగాలేదో చుట్టుముట్టిన భావనని కలిగిస్తాయి. కొన్ని వ్యక్తంచేయలేని శోకాన్నేదో కలిగిస్తే... మరికొన్ని తెలియని ఆనందాన్ని పుట్టిస్తాయి.

Published : 20 Apr 2024 23:44 IST

కొన్ని పాటలు శరీరంలో పులకలు తెప్పిస్తాయి. మరికొన్ని చల్లటిగాలేదో చుట్టుముట్టిన భావనని కలిగిస్తాయి. కొన్ని వ్యక్తంచేయలేని శోకాన్నేదో కలిగిస్తే... మరికొన్ని తెలియని ఆనందాన్ని పుట్టిస్తాయి. ‘ఎందుకు జరుగుతోందిలా?’ అన్న ప్రశ్నకి సంగీతం మనసులో తెచ్చే స్పందనలే ఇందుకు కారణమని చెబుతూ వచ్చారు ఇంతకాలం. కానీ- ఒక్క మనసే కాదు శరీరమూ సంగీతానికి రకరకాలుగా స్పందిస్తోందని తాజాగా తేల్చారు శాస్త్రవేత్తలు. ఇందుకోసం 528 మందితో ఓ అధ్యయనం నిర్వహించారు. వాళ్ళకి- వినిపించడానికి కొన్ని వాయిద్య సంగీత భాగాల్ని ఎంచుకున్నారు. వాళ్ల ముందు మానవ శరీరభాగాలతో ఉన్న టచ్‌స్క్రీన్‌ బొమ్మని ఉంచారు. ప్రతిసారీ సంగీతాన్నీ విన్న పది సెకన్ల తర్వాత- వాళ్ళ శరీరంలో ఏ భాగం స్పందిస్తోందో దాన్ని టచ్‌స్క్రీన్‌లోని బొమ్మని తాకి చెప్పమన్నారు. దాదాపు అందరూ కొన్ని పాటలతో తమ హృదయ స్పందన పెరుగుతోందనీ, మరికొన్నింటితో ఉదరభాగంలో ఏదో కదులుతున్నట్టు భావించామనీ చెప్పారట! దీన్నిబట్టి సంగీతం అన్నది మనసుపైనే కాదు శరీరంమీదా ప్రభావాన్ని చూపుతోందని తేల్చారు శాస్త్రవేత్తలు. ముఖ్యంగా- పాట మొదలైనప్పటి నుంచీ చివరిదాకా సాఫీగా సాగే మెలడీ ఉదర(గట్‌) భాగాల్లో అవ్యక్తానుభూతికి కారణమైతే... అక్కడక్కడా మలుపులున్న సంగీతం హృదయ స్పందనల్ని పెంచుతోందని విశ్లేషించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..