గుండెకీ... పంటికీ ముడి!

దంతాల సమస్యకీ హృద్రోగానికీ దగ్గర సంబంధం ఉందని చెప్పేందుకు మరో బలమైన సాక్ష్యాన్ని ప్రపంచం ముందు పెట్టారు జపాన్‌ శాస్త్రవేత్తలు. చిగురు వాపో- పూతో కారణం ఏదైనా సరే అక్కడ ఏర్పడే బ్యాక్టీరియా నేరుగా గుండెనాళాల్లోకి ప్రవేశించి హృద్రోగానికి దారితీస్తోందట.

Published : 28 Apr 2024 00:12 IST

దంతాల సమస్యకీ హృద్రోగానికీ దగ్గర సంబంధం ఉందని చెప్పేందుకు మరో బలమైన సాక్ష్యాన్ని ప్రపంచం ముందు పెట్టారు జపాన్‌ శాస్త్రవేత్తలు. చిగురు వాపో- పూతో కారణం ఏదైనా సరే అక్కడ ఏర్పడే బ్యాక్టీరియా నేరుగా గుండెనాళాల్లోకి ప్రవేశించి హృద్రోగానికి దారితీస్తోందట. ఈ మధ్య జపాన్‌ శాస్త్రవేత్తలు గుండె అవసరానికన్నా వేగంగా కొట్టుకునే- అట్రియల్‌ ఫైబ్రిలేషన్‌ సమస్య ఉన్న 288 మంది రోగుల్ని పరిశోధనకి తీసుకున్నారు. వీళ్ళందరికీ చిగురువాపు సమస్య కూడా ఉంది. ఈ 288 మందీ తమ హృద్రోగానికి సర్జరీ చేయించుకున్నారు. అలా చేయించుకున్న 91 మంది మూణ్ణెళ్ళ తర్వాత తమ చిగురువాపు సమస్యకీ చికిత్స తీసుకున్నారు. వీళ్ళందరినీ రెండేళ్ళ తర్వాత మళ్ళీ పరిశీలించారు జపాన్‌లోని హిరోషిమా వర్సిటీకి చెందిన ఈ శాస్త్రవేత్తలు. ఆ రోగుల్లో 24 శాతం మందికి హృద్రోగ సమస్య తిరగబెట్టిందట. వాళ్ళలో 90 శాతం మంది తీవ్ర చిగురువాపు సమస్య ఉన్నాసరే దాన్ని నిర్లక్ష్యం చేసినవాళ్ళట. అదే చిగురువాపు సమస్యకి చికిత్స తీసుకున్నవారిలో 60 శాతం మంది హృద్రోగాన్ని పూర్తిగా జయించారట. ఈ ఫలితాలని బట్టి... చిగురువాపు సమస్యకీ హృద్రోగాలకీ ఉన్న సంబంధం మరోసారి రుజువైందంటున్నారు శాస్త్రవేత్తలు. రోజూ రెండుసార్లు దంతధావనం చేయడం లాంటి చిన్నచిన్న జాగ్రత్తలతోనే పెద్ద సమస్యల్ని అధిగమించవచ్చని చెబుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..