మెదడులోనూ మైక్రోప్లాస్టిక్కే!

‘ఇందుగలడందులేడని సందేహము వలదు...’ అన్న మాట మైక్రోప్లాస్టిక్కుకి బాగా వర్తిస్తుందిప్పుడు. నిన్నమొన్నటిదాకా మహాసముద్రాల్లోనే ఇవి ఉండేవని భావించేవారు.

Published : 28 Apr 2024 00:13 IST

‘ఇందుగలడందులేడని సందేహము వలదు...’ అన్న మాట మైక్రోప్లాస్టిక్కుకి బాగా వర్తిస్తుందిప్పుడు. నిన్నమొన్నటిదాకా మహాసముద్రాల్లోనే ఇవి ఉండేవని భావించేవారు. ఇప్పుడు మనం రోజూ కొని తాగే సీసా నీళ్ళలోనూ కనిపిస్తున్నాయట.  ఓ అంచనా ప్రకారం- మనం వారంలో సగటున ఐదు గ్రాముల మైక్రోప్లాస్టిక్‌ అణువుల్ని తింటున్నామట. అంటే, మనకు తెలియకుండానే ఓ ఏటీఎం కార్డంత ప్లాస్టిక్‌ని మింగేస్తున్నామన్నమాట! ‘మరి అలా లోపలికి వెళుతున్న ప్లాస్టిక్‌ కేవలం జీర్ణాశయంలోనే ఉండిపోతోందా? ఇతర అవయవాలకూ పాకుతోందా?’ అన్న ప్రశ్నతో తాజాగా పరిశోధనకి నడుం బిగించారు అమెరికాలోని న్యూమెక్సికో విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు. ఇందులో భాగంగా- ఎలుకలకి రోజూ మైక్రోప్లాస్టిక్స్‌ ఉన్న నీటిని తాగించారు. నాలుగువారాల తర్వాత వాటిని పరిశీలిస్తే- జీర్ణాశయంలోకి వెళ్ళిన మైక్రోప్లాస్టిక్స్‌ అణువులు ఆ తర్వాత కాలేయం, కిడ్నీలతోపాటూ మెదడులోకీ వెళ్ళడం గమనించారు. ఇలా వెళ్లడం వల్ల చాలా నష్టాలే ఉంటాయని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. శరీరంలో చేరే ఈ మైక్రోప్లాస్టిక్‌ అణువులు రోగనిరోధక శక్తిలో అతికీలకమైన ‘మైక్రోఫేగస్‌’ వ్యవస్థ పైన ప్రభావం చూపుతాయట. దాంతో- శరీరంలో దీర్ఘకాలిక వాపులూ నొప్పులూ మునుపుటికంటే పెరుగుతున్నాయంటున్నారు శాస్త్రవేత్తలు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..