సర్జరీ తర్వాత ఇన్ఫెక్షనా..?

సర్జరీ తర్వాత కొందరికి- కోత పెట్టిన చోట ఇన్ఫెక్షన్‌ వస్తుంటుంది. చీము, వాపు ఇలా పలు సమస్యలు ఏర్పడుతుంటాయి. ఆపరేషన్‌ తర్వాత ఆహారంలో పప్పులు తీసుకోవడమే ఇందుకు కారణమని భావించేవాళ్ళూ ఉన్నారు.

Updated : 28 Apr 2024 13:06 IST

ర్జరీ తర్వాత కొందరికి- కోత పెట్టిన చోట ఇన్ఫెక్షన్‌ వస్తుంటుంది. చీము, వాపు ఇలా పలు సమస్యలు ఏర్పడుతుంటాయి. ఆపరేషన్‌ తర్వాత ఆహారంలో పప్పులు తీసుకోవడమే ఇందుకు కారణమని భావించేవాళ్ళూ ఉన్నారు. కానీ, ఇందుకు బ్యాక్టీరియానే కారణమంటారు వైద్యులు. కానీ ‘ఆ బ్యాక్టీరియా ఎక్కడి నుంచి వస్తోంది?’ అన్న ప్రశ్నకి ఇంతకాలం ఆసుపత్రి నుంచేనని భావిస్తూ వచ్చారు శాస్త్రవేత్తలు. అక్కడ శుభ్రతా ప్రమాణాలు సరిగ్గా పాటించకపోవడం వల్లే సర్జరీ ఇన్ఫెక్షన్‌లు వస్తాయనుకునేవారు. అది పూర్తిగా నిజం కాకపోవచ్చని చెబుతోంది వాషింగ్టన్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన తాజా పరిశోధన ఒకటి. వెన్నెముకకు శస్త్రచికిత్స చేయించుకున్న 204 మందిపైన ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఆపరేషన్‌కి ముందే వాళ్ళ చర్మంలోని బ్యాక్టీరియాలని గుర్తుపట్టారు. సర్జరీ తర్వాత రోగుల పరిస్థితిని గమనిస్తే వాళ్ళలో 14 మంది ఇన్ఫెక్షన్‌కి లోనైనట్లు తేలిందట. అందులోనూ 12 మంది ఇన్ఫెక్షన్స్‌కి కారణం- ఆపరేషన్‌కి ముందే వాళ్ళ చర్మంలో ఉన్న బ్యాక్టీరియాలేనని ఈ శాస్త్రవేత్తలు గుర్తించారు. మామూలుగా రోగికి ఇలాంటి ఇన్ఫెక్షన్స్‌ రాకుండా ఆపరేషన్‌కి ముందు వైద్యులు యాంటీబయోటిక్స్‌ ఇస్తుంటారు. కానీ, ఈ ‘మొండి’ బ్యాక్టీరియాని ఆ మందులు ఏమీ చేయలేకపోయాయట. కాబట్టి, ఇకపైన ఆపరేషన్‌కి ముందు ప్రతి ఒక్కరికీ వాళ్ళ చర్మంలోని బ్యాక్టీరియానిబట్టే కస్టమైజ్డ్‌ యాంటీబయోటిక్‌ కోర్సు ఇవ్వడం మంచిదంటున్నారు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..