ఏఐ... గుండెపోటు మరణాల్ని తగ్గిస్తోంది!

ఛాతీలో నొప్పని వైద్యుల దగ్గరకెళితే డాక్టర్లు ముందుగా ఈసీజీ తీయిస్తున్నారు. అందులో ఏదైనా తేడా వస్తే వెంటనే బ్లడ్‌ టెస్ట్‌లూ, ఇతర పరీక్షలూ చేయించి ఓ నిర్ణయానికి వస్తున్నారు.

Updated : 12 May 2024 00:50 IST

ఛాతీలో నొప్పని వైద్యుల దగ్గరకెళితే డాక్టర్లు ముందుగా ఈసీజీ తీయిస్తున్నారు. అందులో ఏదైనా తేడా వస్తే వెంటనే బ్లడ్‌ టెస్ట్‌లూ, ఇతర పరీక్షలూ చేయించి ఓ నిర్ణయానికి వస్తున్నారు. ఈ రక్తపరీక్షలు ఎంత వేగంగా చేసినా- నిజంగానే గుండెపోటు వచ్చినప్పుడు దీనికి పట్టే ఆ కాస్త సమయం కూడా పెద్ద ఆలస్యం కిందే లెక్క. ఆ సమయాన్ని కూడా తగ్గించేందుకే సరికొత్త కృత్రిమ మేధ(ఏఐ)ని ఆవిష్కరించారు తైవాన్‌ శాస్త్రవేత్తలు. ఇందుకోసం 4.5 లక్షల ఈసీజీ షీట్‌లతో దానికి శిక్షణ అందించారు.  గుండెపోటుతో చనిపోయినవాళ్ళ ‘రిస్క్‌ ఫ్యాక్టర్స్‌’పైన పూర్తి అవగాహన కల్పించారు. ఆ రిస్క్‌ ఫ్యాక్టర్స్‌ని ఏఐ వివిధ ‘పర్సంటైల్‌’లుగా విభజించు కుంది. 95 శాతం పర్సెంటైల్‌ దాటినప్పుడు డాక్టర్‌లని హెచ్చరించడం కూడా నేర్చుకుంది. దీన్ని తైవాన్‌కి చెందిన రెండు ఆసుపత్రుల్లో చికిత్సకి వచ్చిన 16 వేల మంది రోగులపైన పరీక్షిస్తే... ఏకంగా 30 శాతం మరణాలని తగ్గించిందట ఏఐ.

ఓ కొత్త ఆవిష్కరణ- అదీ ఓ ఔషధేతర పరికరం ఇంత చక్కటి ఫలితం చూపడం వైద్య చరిత్రలో ఓ అద్భుతమనే చెబుతున్నారు శాస్త్రవేత్తలు. తైవాన్‌లోని నేషనల్‌ డిఫెన్స్‌ మెడికల్‌ సెంటర్‌ వాళ్ళు ఆవిష్కరించిన ఈ ఏఐని ఇప్పటికే 14 సైనిక ఆసుపత్రుల్లో ఉపయోగించడం మొదలు పెట్టారు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..