కోపం ఎందుకు ప్రమాదమంటే...

గుండెపోటుకి ముఖ్యకారణాల్లో ఒకటి- రక్తనాళాలు సాగే గుణాన్ని కోల్పోవడం. అలా కోల్పోవడం వల్ల నాళాల్లో కొవ్వుపేరుకుపోయి రక్త ప్రసరణ కష్టమవుతుంది.

Published : 18 May 2024 23:54 IST

గుండెపోటుకి ముఖ్యకారణాల్లో ఒకటి- రక్తనాళాలు సాగే గుణాన్ని కోల్పోవడం. అలా కోల్పోవడం వల్ల నాళాల్లో కొవ్వుపేరుకుపోయి రక్త ప్రసరణ కష్టమవుతుంది. ఈ పరిస్థితినే ‘అథెరోస్ల్కిరోసిస్‌’ అంటారు. ఈ పరిస్థితికి కోపం, ఆవేదన, ఆందోళనల వంటి ప్రతికూల భావాలు నేరుగా కారణమవుతాయా అన్న ప్రశ్నవేసుకుని పరిశోధనకు దిగారు ఈ మధ్య కొలంబియా వర్సిటీ శాస్త్రవేత్తలు. సుమారు 280 మంది యువతీయువకుల్ని - నాలుగు బృందాలుగా చేశారు. ఓ బృందాన్ని- ఇటీవల వాళ్ళకి బాగా కోపం తెప్పించిన సంఘటనని గుర్తుతెచ్చుకోమన్నారు. మరో బృందాన్ని- బాధ కలిగించిన అంశాన్నీ మూడో బృందాన్ని ఆందోళన కలిగించిన విషయాన్నీ తలచుకోమన్నారు. నాలుగోబృందాన్ని ఊరికే వంద నుంచి వెనక్కి లెక్కపెట్టమన్నారు. ఎనిమిది నిమిషాల తర్వాత వాళ్ళ రక్తనాళాల్ని పరీక్షించారు. తమ బాధ, ఆందోళనల్ని నెమరేసుకున్న బృందాల్లోనూ అంకెలు లెక్క పెట్టినవారిలోనూ పెద్దగా తేడాలేదట. అదే- కోపాన్ని గుర్తు తెచ్చుకుని ఆవేశానికి లోనైనవారిలో- రక్తనాళాల్లోని కణాలు క్షీణించడం స్పష్టంగా గమనించారట. వాటిల్లో సాగే గుణమూ దెబ్బతినడం చూశారట. కోపం ప్రభావం వారిపైన 40 నిమిషాలపాటు ఉండటం గమనించారట. కోపానికీ, గుండెపోటుకీ మధ్య ఉన్న ప్రత్యక్ష సంబంధంపైన ఈ పరిశోధన ఇదివరకులేని స్పష్టత ఇచ్చిందంటున్నారు శాస్త్రవేత్తలు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..