గర్భిణులకు ఇన్ఫెక్షన్‌లు రాకుండా...

నెలతప్పిన కొత్తల్లో తల్లుల్లో ఏర్పడే కొన్ని ఇన్ఫెక్షన్‌లు గర్భస్రావానికీ, నెలలు నిండకుండానే కాన్పు కావడానికీ కారణమవుతుంటాయన్నది తెలిసిందే.

Published : 18 May 2024 23:56 IST

నెలతప్పిన కొత్తల్లో తల్లుల్లో ఏర్పడే కొన్ని ఇన్ఫెక్షన్‌లు గర్భస్రావానికీ, నెలలు నిండకుండానే కాన్పు కావడానికీ కారణమవుతుంటాయన్నది తెలిసిందే. ఇన్ఫెక్షన్‌లు సోకినప్పుడు గర్భవిచ్ఛిత్తిలాంటివి జరగకుండా అడ్డుకునేందుకు ఎంతోకాలంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇందులో శాస్త్రవేత్తలకి ఎన్నో సవాళ్ళు ఎదురవుతున్నాయి. తల్లికీ శిశువుకీ మధ్య వారధిగా ఉండే మాయ(ప్లాసెంటా)- ఇన్ఫెక్షన్‌లని ఎలా ఎదుర్కొంటుందో ఇప్పటిదాకా తెలియకపోవడం ఆ సవాళ్ళలో ప్రధానమైనది. దాని పనితీరుని ఎప్పటికప్పుడు నేరుగా చూసే పరికరాలేవీ లేకపోవడం ఇందుకో కారణం. ఈ సవాలునే ఇటీవల ఛేదించారు యూకేలోని వెల్‌కమ్‌ శాంగర్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు. నెలన్నర నుంచి ఏడునెలలున్న గర్భిణుల మాయని సేకరించి- వాటిని ప్రయోగశాలలో పెంచగలిగారు! తరవాత వాటిల్లోని రోగనిరోధక కణాలన్నింటినీ గుర్తించి ఓ మ్యాప్‌ని రూపొందించారు. ఇన్ఫెక్షన్‌లు సోకినప్పుడు మాయలోని ఈ కణాల స్పందనని చూడగలిగారు. రోగకారక కణాలు దాడిచేసినప్పుడు మాయలో వాపు స్వభావం(ఇన్‌ఫ్లమేషన్‌) పెరుగుతోందని గుర్తించారు. ఇదే సమస్యలకి కారణమవుతోందని తేల్చారు. మాయలో ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గించే మందులు రావడానికి మరెంతో కాలం పట్టదని చెబుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..