నిద్రతో అల్జీమర్స్‌కు చెక్‌?!

నిద్రంటే ఏమిటీ... ఈ ప్రశ్నకి శాస్త్రవేత్తలు ఇచ్చే జవాబు ఏమిటంటే ‘అదో శుభ్రతా ప్రక్రియ’ అని. మామూలుగా మనం మెలకువగా ఉన్నప్పుడు కొన్ని అనవసర ప్రొటీన్‌లు మెదడులో చేరిపోతాయి.

Published : 26 May 2024 00:22 IST

నిద్రంటే ఏమిటీ... ఈ ప్రశ్నకి శాస్త్రవేత్తలు ఇచ్చే జవాబు ఏమిటంటే ‘అదో శుభ్రతా ప్రక్రియ’ అని. మామూలుగా మనం మెలకువగా ఉన్నప్పుడు కొన్ని అనవసర ప్రొటీన్‌లు మెదడులో చేరిపోతాయి. మనం నిద్రపోతున్నప్పుడు మెదడు వాటిని శుభ్రం చేస్తుంది. దీర్ఘకాలంలో నిద్రకు భంగం వాటిల్లినప్పుడు ఈ ప్రొటీన్‌లు మెదడుని ఆవరించి న్యూరాన్స్‌ని దెబ్బతీస్తుంటాయి. అల్జీమర్స్‌ సమస్యలో ఇదే జరుగుతుంది. మన మెదడులో పేరుకుపోయే అమీలాయిడ్‌ బీటా, టావ్‌ అనే ప్రొటీన్‌లు ఇందుకు కారణమని తేల్చారు శాస్త్రవేత్తలు. అంతేకాదు, అల్జీమర్స్‌ లక్షణాలు కనపడటానికి కాస్త ముందు రోగుల్లో నిద్రలేమి సమస్య పెరగడం, మళ్ళీ అది అల్జీమర్స్‌ని పెంచడం- ఇదో ఛేదించలేని వలయంగా మారడాన్నీ గమనించారు. ఈ నేపథ్యంలోనే ‘నిద్రతో అల్జీమర్స్‌ని అడ్డుకోవచ్చా?’ అన్న ఆలోచన వచ్చింది వాషింగ్టన్‌ యూనివర్సిటీ పరిశోధకులకి. దాంతో కొందరికి- నిద్రలేమిని నివారించే కొన్ని ఔషధాలనిచ్చి, రెండురోజుల గాఢ నిద్ర తర్వాత- వాళ్ళ నుంచి మెదడూ, వెన్నుపూసా కలిసే చోట ఉండే ‘సెరిబ్రోస్పైనల్‌’ ద్రవాన్ని తీసి పరీక్షించారు. వాటిల్లో అల్జీమర్స్‌ని ప్రేరేపించే అమీలాయిడ్‌ బీటా, టావ్‌ ప్రొటీన్‌లు భారీగా తగ్గడం గమనించారు. ‘దీనర్థం నిద్రమాత్రలతో అల్జీమర్స్‌ తగ్గుతుందని కాదు, మాత్రలకన్నా ఇక్కడ గాఢనిద్ర ప్రభావాన్నే మనం పరిగణనలోకి తీసుకోవాలి’ అని చెబుతున్నారు దీన్ని నిర్వహించిన శాస్త్రవేత్తలు. గాఢనిద్రకీ అల్జీమర్స్‌ నివారణకీ ఉన్న ప్రత్యక్ష సంబంధాన్ని నిరూపించడంలో ఇదో పెద్ద ముందడుగనీ అంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..