మేడారం జాతర... చూసొద్దామా!

శివసత్తుల పూనకాలతో, కోయదొరల విన్యాసాలతో ఎంతో వైభవంగా జరిగే జాతర ఏదయినా ఉందంటే అది మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరే.

Updated : 18 Feb 2024 11:14 IST

శివసత్తుల పూనకాలతో, కోయదొరల విన్యాసాలతో ఎంతో వైభవంగా జరిగే జాతర ఏదయినా ఉందంటే అది మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరే. అమ్మవార్లకు నివేదించే బంగారాన్ని భక్తులు మహా ప్రసాదంగా స్వీకరించడం, వనదేవతలకు మొక్కులు చెల్లించుకోవడం... ఇలా ఈ వేడుకలో ప్రతి ఘట్టం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది.

మ్మక్క-సారలమ్మ జాతర... రెండేళ్లకోసారి మాఘమాసంలో నాలుగురోజుల పాటు నిర్వహించే ఈ వేడుకలో పాల్గొనేందుకు ప్రపంచవ్యాప్తంగా కోటిమందికి పైగా భక్తులు తరలివస్తారు. కుంభమేళా తరువాత అతి పెద్ద జాతరగా ప్రసిద్ధి పొందిన ఈ సంబరం తెలంగాణ, ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో జరుగుతుంది.

ఎలా మొదలయ్యిందంటే... 

పూర్వం ఈ ప్రాంతానికి చెందిన కొందరు కోయదొరలు వేటకోసం అడవికి వెళ్లినప్పుడు... పెద్ద పులుల మధ్య ఓ పసిపాప కనిపించడంతో ఆ పాపను తమతో తీసుకొచ్చి సమ్మక్క అని నామకరణం చేశారట. ఆ పాప గూడేనికి వచ్చినప్పటి నుంచీ అన్నీ శుభాలే జరిగాయట. కొన్నాళ్లకు కాకతీయుల సామంత రాజైన పగిడిద్దరాజుకు ఇచ్చి వివాహం చేయడంతో ఆ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు సంతానం కలిగారు. వారిలో సారలమ్మను గోవిందరాజులు వివాహమాడాడు. అయితే... కరవు కారణంగా గిరిజనులు పన్ను చెల్లించకపోవడంతో ప్రభుత్వం ఆ తండాలపైన యుద్ధం ప్రకటించింది. ఆ పోరులో పగిడిద్దరాజు, నాగులమ్మ, సారలమ్మ, గోవిందరాజులు మేడారం సరిహద్దులోని సంపెంగవాగు వద్ద నేలకూలారట. ఇది చూసి జంపన్న కూడా సంపెంగ వాగులో ఆత్మార్పణ చేసుకున్నాడట. అప్పటినుంచీ సంపెంగవాగును జంపన్నవాగుగా పిలవడం మొదలుపెట్టారు. తనవాళ్ల మరణవార్త విన్న సమ్మక్క యుద్ధ రంగానికి వచ్చి పోరాడింది. ఆమె శౌర్యం చూసి ప్రతాపరుద్రుడే ఆశ్చర్యపోయాడట. ఆ సమయంలోనే ఓ కాకతీయ సైనికుడు దొంగచాటుగా సమ్మక్కను వెన్నుపోటు పొడవడంతో ఆమె ఆ గాయంతోనే మేడారం గ్రామానికి చేరుకుని ఈశాన్య ప్రాంతంలో ఉన్న చిలకల గుట్టవైపువెళ్లి ఓ మలుపులో అదృశ్యమైపోయిందట. గూడెం వాసులు గాలిస్తే గుట్టమీదున్న నెమలినార చెట్టుకింద పుట్ట దగ్గర ఓ కుంకుమభరిణె కనిపించిందట. అంతలోనే ‘ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి వ్యక్తీ వీరుడిగానే రాజ్యాన్ని పాలించాలి. ఈ స్థలంలో రెండు గద్దెలు కట్టించి రెండేళ్లకోసారి ఉత్సవం జరిపించ’ మంటూ ఆకాశవాణి వినిపించిందట. ప్రతాపరుద్రుడూ తన తప్పును తెలుసుకుని గిరిజనులు కట్టాల్సిన కప్పాన్ని రద్దుచేశాడనీ, రెండేళ్లకోసారి జాతరను నిర్వహించాలంటూ ఆదేశాలు జారీచేశాడనీ కథనం. 

వైభవంగా వేడుకలు...

ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 24 వరకూ జరగనున్న ఈ జాతరకు వచ్చే భక్తులు మొదట ఊరి పొలిమేరలోని జంపన్నవాగులో స్నానం చేసి తరువాత సమ్మక్క-సారలమ్మ దర్శనానికి వెళ్తారు. ఈ వేడుకలో వెదురుకర్ర, కుంకుమభరిణెల్నే ఉత్సవ మూర్తులుగా కొలుస్తారు. మొదటిరోజు సారలమ్మ, ఆమె భర్త గోవిందరాజులు, తండ్రి పగిడిద్దరాజులు గద్దెలపైకి చేరుకుంటారు. కన్నేపల్లి నుంచి సారలమ్మను పూజారులు తీసుకొస్తే... కొత్తగూడ మండలం పోనుగుండ్లలోని మరో పూజారి బృందం పగిడిద్దరాజుతో బయలుదేరుతుంది. గోవిందరాజులును ఏటూరు నాగారం ప్రాంతంలోని కొండాయి గ్రామం నుంచి తీసుకొస్తారు. చివరగా సమ్మక్కను కుంకుమభరిణె రూపంలో చిలకల గుట్టకు చెందిన కొక్కెర వంశస్థులు తెచ్చి గద్దెపైన ప్రతిష్ఠిస్తారు. మూడో రోజున భక్తులు బంగారం (బెల్లం), ఇతర కానుకల్ని సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. నాలుగో రోజున దేవతలు వనప్రవేశం చేయడంతో ఈ జాతర ముగుస్తుంది.

ఎలా చేరుకోవచ్చు

ఈ జాతరకు వచ్చే భక్తులు వరంగల్‌ వరకూ రైలు లేదా బస్సుల్లో చేరుకుంటే... అక్కడినుంచి మేడారానికి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..