ఊరంతటికీ ఒకే వంటగది!

సాధారణంగా ఏదైనా పండుగలప్పుడు- అదీ కొన్నిప్రాంతాలలో మాత్రమే ఊరంతా కలిసి భోజనాలు ఏర్పాటు చేసుకుంటారు. కానీ ఆ ఊళ్లో మాత్రం రోజూ ఒకే దగ్గర వంట చేస్తారు

Updated : 25 Feb 2024 19:26 IST

సాధారణంగా ఏదైనా పండుగలప్పుడు- అదీ కొన్నిప్రాంతాలలో మాత్రమే ఊరంతా కలిసి భోజనాలు ఏర్పాటు చేసుకుంటారు. కానీ ఆ ఊళ్లో మాత్రం రోజూ ఒకే దగ్గర వంట చేస్తారు. అందరూ కలిసి హాయిగా ఒకే చోట కూర్చుని భోంచేస్తారు. ఊరు చిన్నదే కానీ పెద్ద ఆలోచనతో అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచిన ఆ ఊరేంటీ... దాని కథేంటీ అంటే...

పొద్దున్నే లేచి ఇతర పనులతో పాటుగా వంట చేసుకోవడమన్నది నిజంగా పెద్ద పనే. పైగా వృద్ధులకూ అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న వారికైతే మరింత కష్టం. కావాల్సిన సామాన్లు తెచ్చుకుంటూ రోజూ భోజనం వండుకోవడమంటే కాస్త భారంగానే ఉంటుంది మరి. అలాగనీ రోజూ బయటి నుంచి తెచ్చుకుని తినలేరు, తినకుండా పస్తు ఉండలేరుగా. అలాంటప్పుడే ఏం చేస్తే బాగుంటుందన్న ఆలోచనతో ముందుకొచ్చిందో ఊరు. అదే గుజరాత్‌లోని చందన్కి అనే పల్లె.

ఏంటా ఆలోచన...

వెయ్యికిపైగా జనాభాతో ఉండే ఈ ఊళ్లోని యువత- చదువు, ఉద్యోగం అంటూ విదేశాలకూ ఇతర పట్టణాలకూ వలస వెళ్లిపోయింది. దాదాపు 300 మంది పెద్దవాళ్లే ప్రస్తుతం చందన్కిలో ఉండిపోయారు. వారంతా వంటావార్పు చేసుకోవడానికి ఇబ్బంది పడటం గమనించిన రతిలాల్‌ సోమ్‌నాథ్‌ పటేల్‌ అనే ఈ ఊరి వ్యక్తి- పదేళ్ల క్రితం కమ్యూనిటీ కిచెన్‌ని ఏర్పాటు చేశాడు. అందరూ తలా కొంత డబ్బు జమ చేస్తూ ఒకే దగ్గర వండుకోవడం మొదలుపెట్టారు. ఎవరికీ ఏ ఇబ్బంది లేకుండా మూడు పూటలూ ఊరందరూ కలిసి ఒకేచోట భోజనం చేస్తున్నారు.
ఒక ఇంట్లో నలుగురికి వంట చేయడానికే ఎంతో పని ఉంటుంది. మరైతే 300 మందికి సరిపడా వండాలంటే... సరకులు తేవడం దగ్గర్నుంచి వండి వడ్డించే వరకూ ఎన్నో పనులుంటాయిగా. కచ్చితంగా ఎవరో ఒకరు బాధ్యత తీసుకుంటేనే కదా అవన్నీ సక్రమంగా జరుగుతాయి.

అందుకే మరి, ఊరంతా కలిసి ఆ పనిని సర్పంచ్‌కి అప్పగించారు. వంట చేయడానికి పెద్ద కిచెన్‌, అందరూ కలిసి తినేలా హాల్‌... లాంటి సదుపాయాలన్నీ సమకూర్చుకున్నారు. వండటానికి ప్రత్యేకంగా వంటవాళ్లనీ ఇతర పనివాళ్లనీ పెట్టుకుని రోజూ అన్నం, పప్పు, చపాతీ, కూర, స్వీట్‌తో మెనూనూ ఏర్పాటు చేసుకున్నారు. డైనింగ్‌ హాల్‌ వరకూ రాలేనివాళ్లకు ఇంటికే పట్టుకెళ్లిచ్చే సౌకర్యమూ ఉంటుందట. ఇంకా ఇంట్లోవాళ్లను చూడ్డానికి వేరే ఊళ్ల నుంచి వచ్చే ఇతర కుటుంబసభ్యులూ ఇక్కడే తింటారట. కేవలం మనిషికి ఇంత అని లెక్కగట్టి నెలకోసారి డబ్బులు సమకూర్చుకుంటారు. ఒక్క వంటగది విషయంలోనే కాదు... ఊరంతటినీ శుభ్రం చేసుకోవడంలో, సోలార్‌ పవర్‌లాంటివి ఏర్పాటు చేసుకోవడంలోనూ అందరూ ఒకేమాట మీద ఉండి నిర్ణయం తీసుకుంటారట. ఒక్కమాటలో చెప్పాలంటే మనుషులందరూ వేరు వేరు ఇళ్లలో ఉన్నా... వసుధైక కుటుంబంలా కలిసిమెలిసి ఉంటారన్నమాట. ఏది
ఏమైనా, ఇలా ఉండటం వల్ల ఇటు వంట చేసుకోలేని పెద్దవాళ్లకూ ఇబ్బంది లేకుండా ఉంటుంది, వేరే చోట ఉన్న కుటుంబసభ్యులకూ ఇంట్లోవాళ్లకు భోజనమెలా అన్న బెంగా ఉండదు. రకరకాల అర్థంలేని కట్టుబాట్లతో ఇబ్బంది పడే పల్లెల కన్నా కలిసికట్టుగా ఒకరికొకరు తోడుగా ఉండే ఈ ఊరు కచ్చితంగా ఆదర్శప్రాయమే కదా!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..