నిరుపేద విద్యార్థుల కోసం..!

వీళ్ళు... కష్టాల కడగండ్లు దాటి వచ్చినవాళ్ళు! బాగా చదువుకునో, చదువుకునే అవకాశం లేకనో- జీవితంలో స్థిరపడ్డవాళ్ళు. అలా స్థిరపడ్డామని అనుకున్నాక ఒకప్పటి తమలా నేడు పేదరికంలో నలుగుతున్న పిల్లల్ని ఆదుకోవాలను కున్నారు.

Updated : 10 Mar 2024 07:03 IST

వీళ్ళు... కష్టాల కడగండ్లు దాటి వచ్చినవాళ్ళు! బాగా చదువుకునో, చదువుకునే అవకాశం లేకనో- జీవితంలో స్థిరపడ్డవాళ్ళు. అలా స్థిరపడ్డామని అనుకున్నాక ఒకప్పటి తమలా నేడు పేదరికంలో నలుగుతున్న పిల్లల్ని ఆదుకోవాలను కున్నారు. ఉన్నంతలో వాళ్ళకి సాయపడాలని కోరుకుని అడుగుముందుకేశారు. ఆ అడుగుల ప్రస్థానం ఎంత స్ఫూర్తిమంతంగా ఉందో మీరే చూడండి...


ల్యాప్‌టాప్‌ల లైబ్రరీ!

తలమీద పెద్ద మూట, ఆ మూటలో బట్టలు. వాటిని అమ్ముకుంటూ ఇంటింటికీ తిరిగేవాళ్ళు సత్యసుందరం తల్లిదండ్రులు. తమిళనాడు తేని జిల్లాలోని వడుగపట్టి అన్న గ్రామం వాళ్ళది. రెక్కాడితేకానీ డొక్కాడని ఆ ఇంట ఆరుగురు పిల్లలు. అందరూ ప్రభుత్వ బడిలో చేరితే- సత్యసుందరానికి మాత్రమే చదువబ్బింది. ఇంట్లో కరెంటులేక గుడ్డి దీపంతోనూ అదీ లేకుంటే వీధి లైట్ల వెలుగులోనూ చదివాడు. అయితేనేం పది, పన్నెండో తరగతుల్లో జిల్లా ఫస్ట్‌ వచ్చాడు. కానీ కాలేజీకి వెళ్ళే స్తోమత లేక సత్యసుందరం ఓ రెస్టరంట్‌లో వెయిటర్‌గా చేరాడు. ఏడాది తర్వాత అతని దైన్యం చూసిన బంధువొకాయన తానే ఫీజులు కట్టి కాలేజీలో చేర్పించాడు. క్లాస్‌మేట్‌ ఒకతను ఓ కంప్యూటర్‌ సెంటర్‌లో పార్ట్‌టైమ్‌ ఉద్యోగం ఇప్పించాడు. ఈ ఉద్యోగమే అతనికి కంప్యూటర్‌పైన పట్టు సాధించేలా చేసింది. డిగ్రీ ముగించగానే హైదరాబాద్‌ టెక్‌ మహీంద్రలో ఉద్యోగం వచ్చింది! ఓసారి తన ఇంటికి పేపర్‌ వేస్తున్న పిల్లాడిని చూసి- అతని చదువుల భారం మొత్తం తీసుకున్నాడు. స్నేహితుల సాయంతో ‘హనీకింగ్స్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌’ అనే ఎన్జీఓను స్థాపించి హైదరాబాద్‌లోని పలు స్కూళ్ళకి కుర్చీలూ బల్లలూ అందించాడు. తర్వాత బ్రాడ్‌రిడ్జ్‌ అనే కంపెనీలో చేరాడు. ఆ సంస్థ అతణ్ణి తమ సీఎస్సార్‌ విభాగానికి అధ్యక్షుడిగా చేసింది. దాంతో- తాను పుట్టిపెరిగిన తేని జిల్లాలోని ఐదు గ్రామాల ప్రభుత్వ బడుల్ని దత్తతకి తీసుకున్నాడు. అక్కడి పిల్లలందరికీ ట్యాబ్‌లూ, ల్యాప్‌టాప్‌లూ అందిస్తున్నాడు. ‘జనరేషన్‌ నెక్ట్స్‌ లైబ్రరీ’ అనే సరికొత్త పథకాన్ని ప్రారంభించాడు. దీనికింద- పేద విద్యార్థులు ల్యాప్‌టాప్‌లని అద్దెకు తీసుకెళ్ళొచ్చు. ఏడాదిపాటు వాటిని వాడి తిరిగివ్వొచ్చు. వందలాదిమంది విద్యార్థులు ఈ లైబ్రరీతో లబ్ధిపొందుతున్నారు ఇప్పుడు!


బాక్సింగ్‌ ఛాంపియన్‌లు..!

పంజల నివాస్‌ గౌడ్‌ది కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని కాగజ్‌నగర్‌. పదో తరగతిదాకా ప్రభుత్వ బడుల్లోనే చదువుకున్నాడు. మరుగుదొడ్లు సహా ఏ కనీస వసతులూ లేని దుర్భర పరిస్థితుల్ని స్వయంగా అనుభవించాడు. అందుకే- 2013లో పోలీస్‌ కానిస్టేబుల్‌గా ఉద్యోగం వచ్చినప్పటి నుంచి చుట్టుపక్కలున్న సర్కారు బడుల విద్యార్థులకి సాయం చేయడం ప్రారంభించాడు. ఇందుకోసం తన జీతంలో 15 శాతాన్ని కేటాయిస్తున్నాడు. పేదపిల్లలకి కావాల్సిన స్టేషనరీ మొత్తం అందిస్తున్నాడు. పై చదువులకి ఫీజులు కడుతున్నాడు. ఇటీవలే ఓ మండల ప్రజాపరిషత్‌ పాఠశాలలో బాలికలూ, టీచర్లూ ఇబ్బంది పడటం చూసి 20 వేల రూపాయల ఖర్చుతో రెస్ట్‌రూమ్‌లు కట్టిచ్చాడు. నివాస్‌ గౌడ్‌ సేవల్లో ఇవన్నీ ఒక ఎత్తయితే కాగజ్‌నగర్‌ యువతకి బాక్సింగ్‌ నేర్పించడం ఒక్కటీ ఒకెత్తు! సుమారు 30 మందికి ఈ యుద్ధవిద్యని నేర్పడమే కాదు దేశంలో ఎక్కడ ఏ ఛాంపియన్‌షిప్‌ జరిగినా సొంత
ఖర్చుతో వాళ్ళనితీసుకెళుతున్నాడు. ఆ ప్రోత్సాహంతోనే ఐదుగురు విద్యార్థులు బాక్సింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఛాంపియన్‌షిప్‌లోనూ, యూనివర్సిటీ- ఇంటర్‌ యూనివర్సిటీ పోటీల్లోనూ పాల్గొన్నారు. వాటిల్లో రాణించిన ప్రీతి అనే అమ్మాయి ఇటీవల ‘బీఎస్‌ఎఫ్‌’లో ఉద్యోగం సాధిస్తే... మరో ఇద్దరు కేంద్రప్రభుత్వ ఉద్యోగాలకి ఎంపికయ్యారు!

వి.శ్రీనివాసరావు, న్యూస్‌టుడే, కాగజ్‌నగర్‌


చేపల వ్యాపారి బడి!

అరవైయేళ్ళ కిందటి మాట ఇది. పదో తరగతి మంచి మార్కులతో పాసయ్యాక కాలేజీకి వెళతాననుకున్న బిశ్వనాథ్‌ నారూని వాళ్ళమ్మ చేపల మార్కెట్టుకి వెళ్ళి వ్యాపారం నేర్చుకోమంది. ‘మరి నా చదువు?’ అంటే ‘ఇప్పటికే మనం ఎంతమందికో భారమయ్యాం! ఇకపైన వద్దు’ అంది కన్నీళ్ళతో. ఆమె మాత్రం ఏం చేస్తుంది? బిశ్వనాథ్‌ పుట్టిన ఆరునెలలకే భర్త చనిపోయాడు. దాంతో కూలీనాలీ చేస్తూ పిల్లల్ని పెంచింది. పిల్లలిద్దరూ బాగా చదవడం చూసి బంధువులు కొందరు పదో తరగతిదాకా సాయం చేశారు. ఆ తర్వాత చేయలేమన్నారు. దాంతో బిశ్వనాథ్‌ చేపల మార్కెట్టుకి వెళ్ళక తప్పలేదు. అక్కడ వ్యాపారం నేర్చుకున్నాడు. రెండేెళ్ళ తరవాత- చుట్టూ ఉన్న రిక్షాకార్మికులూ కూలీల పిల్లల కోసం ‘వివేకానంద విద్యా మందిర్‌’ అనే బడిని స్థాపించాడు. ఆరేళ్ళు నిండిన చిన్నారులందరినీ చేర్చుకోసాగాడు. ఉదయం పదిగంటలదాకా చేపలమ్మి- ఆ తర్వాత ఇక్కడ పాఠాలు చెప్పసాగాడు. అలా- 45 ఏళ్ళు ఒంటిచేత్తో ఆ ప్రాథమిక బడిని నడిపాడు!  కానీ వయసుపైబడి, ఓపిక నశించి, ఆ బడిని తీసుకోమని ప్రభుత్వాన్ని అడిగితే కాదుపొమ్మంది. కనీసం మధ్యాహ్న భోజనమైనా కేటాయించలేమంది. ఈ విషయమంతా తెలిసి- ‘ప్రయత్న’ అనే ఎన్జీఓ ఆదుకోవడానికి ముందుకొచ్చింది. రేకుల షెడ్డుగా ఉన్న బడిని రెండంతస్తుల మేడగా మార్చింది. కొందరు టీచర్లనీ అందించింది. పదో తరగతి మాత్రమే చదివిన 63 ఏళ్ళ బిశ్వనాథ్‌ నారు- ఇప్పుడా స్కూలు హెడ్‌మాస్టర్‌ మరి!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..