ఒంట్లో బాలేదా... డాక్టర్‌ ఇంటికే వస్తారు! ..

జ్వరమో నొప్పో వస్తే డాక్టర్‌ దగ్గరకు వెళుతుంటాం. కానీ కొన్నిసార్లు తోడుగా ఎవరూ ఉండరు. మరికొన్నిసార్లైతే ఇంటి నుంచి బయటకు వెళ్లడానికే ఓపిక ఉండదు.

Updated : 10 Mar 2024 00:25 IST

జ్వరమో నొప్పో వస్తే డాక్టర్‌ దగ్గరకు వెళుతుంటాం. కానీ కొన్నిసార్లు తోడుగా ఎవరూ ఉండరు. మరికొన్నిసార్లైతే ఇంటి నుంచి బయటకు వెళ్లడానికే ఓపిక ఉండదు. సరిగ్గా అలాంటప్పుడు ‘అబ్బ డాక్టరే ఇంటికి వస్తే బాగుంటుంది కదా’ అనిపిస్తుంది. నిజమే కానీ అదెలా కుదురుతుందీ అంటారేమో... ఇప్పుడు ఆ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి కొన్ని సంస్థలు!

కప్పుడు ఏది కావాలన్నా బయటకు వెళ్లక తప్పేది కాదు. కానీ ఇప్పుడు అన్నీ చిటికెలో ఇంటికే వస్తున్నాయి. సరకుల దగ్గర్నుంచి తాజా ఫుడ్‌ వరకూ దుస్తులు మొదలు టీవీల్లాంటి వస్తువుల వరకూ ఏదైనా... ఇలా ఆర్డర్‌ పెట్టామంటే అలా నిమిషాల్లో ఇంట్లో ఉంటాయి. ఈ వెసులుబాటు ఇప్పుడు వైద్య సేవలకూ విస్తరించింది. మనకెంతో అవసరమైన వైద్యం విషయంలో డాక్టర్‌ను ఇంటికే పంపిస్తున్నాయి కొన్ని సంస్థలు.

ఉద్యోగాలూ పిల్లలూ ఇతర పనులూ అంటూ చాలావరకూ అందరూ బిజీగా ఉండటం వల్ల... క్షణాల్లో మనం కావాలనుకునేవి అందుబాటులో ఉంచాలనే ఆలోచనతో బోలెడన్ని స్టార్టప్‌ కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. డాక్‌టూమీ, మెడింటూ, హెల్త్‌ఎట్‌హోమ్స్‌... లాంటివి అలా వచ్చినవే. ఇంటికొచ్చి పరీక్షలు చేయడమూ, ఇంట్లో ఉన్న రోగుల బాగోగులు చూసుకునే నర్సుల సేవలూ ఇదివరకే అందుబాటులో ఉన్నాయి. మరి వీటి ప్రత్యేకత ఏంటీ అంటే... ఆ సేవలతో పాటూ వీటి ద్వారా డాక్టర్‌ని ఇంటికే పిలిపించుకోవచ్చు. మామూలుగా జ్వరమో, నొప్పో మరేదైనా ఒంట్లో బాగోలేకపోతే ఆసుపత్రికి వెళ్తాం. కానీ అందుకు ముందుగానే డాక్టర్‌ అపాయింట్‌మెంట్‌ తీసుకోవడం, వెళ్లాక మన నంబర్‌ వచ్చేవరకూ వేచి చూడటం లాంటివన్నీ చేయాలి. సమయం ఉంటే సరే కానీ అలా కుదరనప్పుడూ, వెళ్లడానికి వీల్లేని పరిస్థితి ఉన్నప్పుడు మాత్రం ఈ డాక్టర్‌ ఎట్‌ హోమ్‌ సర్వీసును వాడుకోవచ్చు. ముఖ్యంగా పెద్దవాళ్లకూ... బీపీ, షుగర్‌ లాంటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవాళ్లకూ, బయటకు తీసుకెళ్లే వాళ్లు తోడుగా లేనప్పుడూ, జనరల్‌ హెల్త్‌చెకప్స్‌తో పాటూ పోస్ట్‌ ఆపరేటివ్‌ కేర్‌ అవసరమైనప్పుడూ ఇది బాగా ఉపయోగపడుతుంది. జనరల్‌ ఫిజీషియన్లతో పాటూ కొన్ని సంస్థలు ఆర్థోపెడిక్‌ వైద్యులనూ ఇలా ఇంటికి పంపిస్తున్నాయి. ఆప్‌గా అందుబాటులో ఉన్న డాక్‌టూమీలో మన వివరాలన్నింటినీ అందించి కన్సల్టేషన్‌ తీసుకుంటే రెండు మూడు గంటల్లో డాక్టర్‌ ఇంటికొస్తారు. ఉదయం తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది వరకూ ఏ రోజైనా డాక్టర్లు అందుబాటులో ఉంటారు. ప్రస్తుతం హైదరాబాద్‌ నగరంలో సేవలందిస్తున్న ఈ సంస్థ కన్సల్టేషన్‌ ఫీజు రూ.499. హైదరాబాద్‌తోపాటు బెంగళూరు, చెన్నై, వైజాగ్‌ లాంటి నగరాల్లోనూ డాక్టర్‌ ఎట్‌ హోమ్‌ సర్వీసులు అందిస్తున్నాయి మెడింటూ, అపోలోలాంటి సంస్థలు. వీటిల్లో రూ.2500 నుంచి కన్సల్టేషన్‌ ఫీజు మొదలవుతుంది. మెడింటూలో జనరల్‌ ఫిజీషియన్‌తో పాటు ఆర్థో డాక్టర్‌నూ ఇంటికి పిలిపించుకోవచ్చు. హైదరాబాద్‌లో ఉండే హెల్త్‌ ఎట్‌ హోమ్స్‌లో జనరల్‌ ఫిజీషియన్‌ ఇంకా ఆర్థో, డెంటల్‌ డాక్టర్లూ అందుబాటులో ఉన్నారు. మన అవసరాన్ని బట్టి బుక్‌ చేసుకున్నామంటే ఎంచక్కా డాక్టరే వచ్చి ఇంట్లోనే వైద్యం చేసి వెళ్తారు. వారం- పదిరోజుల పాటు సలహాలూ సూచనలూ ఇస్తూ ఫోన్లో అందుబాటులో ఉంటారు.
అత్యవసరమైతే ఎలాగోలా డాక్టర్‌ దగ్గరకు వెళ్తాం కానీ చిన్న చిన్న ఆరోగ్య సమస్యల్లాంటివాటికి డాక్టర్‌ దగ్గరకు వెళ్లే ప్రయాస లేకుండా ఉండాలంటే... ఈ హోమ్‌ డాక్టర్‌ సేవల్ని వాడుకోవచ్చు. ఎక్కడికీ ప్రయాణం చేయాల్సిన పనీ ఉండదు, పెద్దగా సమయాన్నీ కేటాయించనక్కర్లేదు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..