పేద రైతులకు పశువులిస్తారు!

కోరికలు నెరవేరాలనీ, కష్టాలు తీరాలనీ ఆలయాలకు వెళుతుంటారు భక్తులు. మొక్కులూ కానుకల రూపంలో ఆ దేవుడికి తమకు తోచింది ఏదో సమర్పించుకుంటారు.

Published : 06 Apr 2024 23:42 IST

కోరికలు నెరవేరాలనీ, కష్టాలు తీరాలనీ ఆలయాలకు వెళుతుంటారు భక్తులు. మొక్కులూ కానుకల రూపంలో ఆ దేవుడికి తమకు తోచింది ఏదో సమర్పించుకుంటారు. హైదరాబాద్‌ పరిసరాల్లో ఉన్న చిలుకూరు బాలాజీ ఆలయం మాత్రం కష్టంలో ఉన్నవాళ్లను పిలిచి కన్నీళ్లు తుడుస్తోంది. ఆర్థిక భరోసాను కల్పించి ఆపన్నులకు అండగా ఉంటోంది. గోవింద నామ స్మరణతోనూ, కోరికలు తీరిన భక్తుల ప్రదక్షిణలతోనూ నిత్యం రద్దీగా ఉండే ఆ ఆలయం.. పేదలకు పశువులను దానం చేస్తూ గోసేవకు శ్రీకారం చుట్టింది.

వ్యవసాయంలో రైతు కష్టమెంతో.. పశువుల పాత్రా అంతే. ఎన్ని ఆధునిక యంత్రాలు పల్లెలకు చేరి, పొలాల్లో అడుగుపెట్టినా సరే, ఇప్పటికీ పేద రైతులు సాగు పనులకు పశువుల్నే నమ్ముకుంటారు. వాటిని వ్యవసాయంలో ఉపయోగించుకునేవారు కొందరైతే.. పాలు అమ్ముకుని కుటుంబాలను పోషించుకునేవారు మరికొందరు. అందుకే పాడిపశువులను కన్నబిడ్డల్లా చూసుకుంటాడు రైతు. పశువుకు కష్టమొస్తే తనకొచ్చినట్టుగా బాధపడిపోతుంటాడు. కానీ కొన్నిసార్లు ఆ మూగజీవాలు కరెంట్‌ షాక్‌కో, అనారోగ్యానికో, పాము కాటుకో గురై ప్రాణాలు కోల్పోతుంటాయి. వాటి మరణం అన్నదాతకు కడుపుకోతే అవుతుంది. ఆ బాధను దిగమింగుకుని మరో పశువును కొనుక్కుందామంటే.. ఒక్కో ఆవు ధర రూ.80 వేల నుంచి లక్షకుపైనే ఉంటుంది. మేలు జాతి ఎద్దుల ధరైతే లక్షన్నరకుపైనే. వాటిని కొనలేక ఇబ్బంది పడే వారి కన్నీళ్లు తుడిచి అవసరానికి పశువుల్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు చిలుకూరు బాలాజీ ఆలయ నిర్వాహకులు రంగరాజన్‌. నాలుగేళ్ల క్రితం ఈ ఆలోచన చేయడానికి ఆయన్ను కదిలించిందో సంఘటన.

ఆ బాధను చూసి...

అది 2019..  ఉరుములూ పిడుగులతో కూడిన అకాల వర్షం తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేసింది. అర్ధరాత్రి వేళ ఓ పాడి ఆవుపైన పడిన పిడుగు... ఓ కుటుంబాన్ని రోడ్డున పడేసింది. కొన్నేళ్లుగా ఆవు పాలే జీవనాధారంగా బతుకుతున్న ఆ కుటుంబం మూగజీవి మరణాన్ని తట్టుకోలేక తల్లడిల్లిపోయింది. నిర్జీవంగా పడి ఉన్న పశువును ముద్దాడుతూ... లేవమని తడుతూ ఆ రైతు ఏడుస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. అది చూసిన రంగరాజన్‌ కళ్లు కూడా తెలియకుండానే చెమర్చాయి. ఆ రైతు వివరాలను ఆరా తీసి... చిలుకూరు బాలాజీ ఆలయానికి పిలిపించారు రంగరాజన్‌. బాధ నుంచి ఇంకా తేరుకోని సంగారెడ్డికి చెందిన ఆ రైతును అక్కున చేర్చుకుని.. ఓ ఆవును అందించారు. ఈసారి అతని కళ్లు ఆనందంతో తడిచిపోయాయి. చనిపోయిన తన ఆవే మళ్లీ తిరిగొచ్చినంత సంబరంగా దాన్ని ఇంటికి తీసుకెళ్లిన ఆ అన్నదాత ఆనందం చూసిన రంగరాజన్‌- ప్రకృతి వైపరీత్యాల్లో మూగజీవాలను కోల్పోయిన రైతన్నలకు చేయూతనివ్వాలని నిర్ణయించుకున్నారు.

చిలుకూరు బాలాజీ ఆలయం పరిధిలో అప్పటికే ఓ గోశాలను నిర్వహిస్తున్నారు రంగరాజన్‌. ఆ గోశాలలో పుట్టినవి కొన్ని అయితే.. భక్తులు స్వామికి కానుకగా ఇచ్చినవి మరికొన్ని ఉన్నాయి. ఆ పశువులను అవసరంలో ఉన్న రైతులకు అందిస్తే... అవి వారికి జీవనాధారం అవుతాయనుకున్నారాయన. మొదట్లో అడిగినవారందరికీ పశువుల్ని ఇవ్వాలనుకున్నారు గానీ, అలా ఇస్తే కొందరు వాటితో వ్యాపారం చేసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అవసరంలో ఉన్నవారిని తామే గుర్తించి ఇవ్వాలని భావించారు. మూగజీవాలను కోల్పోయిన పేద రైతులను వార్తల ద్వారా గుర్తించి, వారికే పశువులను ఇవ్వాలనే నిబంధన పెట్టుకున్నారు. ఎందుకంటే పశువుల మీద ఆధారపడే వారికే వాటిమీద మమకారముంటుంది. ఆ బంధంతోనే వాటిని ప్రేమగా చూసుకుంటారు. అందుకే,
అప్పట్నుంచీ కులమతాలకు అతీతంగా రైతులకు ఆవుల్నీ లేదా ఎద్దుల్నీ అందించడంతోపాటు... పైసా ఖర్చు లేకుండా ఆ పశువులను రైతుల ఇళ్లకు చేర్చే బాధ్యతను కూడా రంగరాజనే తీసుకుంటున్నారు. ఆ సమయంలో తమ కంటిపాపను మరో ఇంటికి పంపినంతగా బాధపడే ఆయన గోసేవకు సరికొత్త అర్థం చెప్పారనడంలో అతిశయోక్తి లేదు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..